
సిద్దిపేట రూరల్, వెలుగు : ‘మన ఊరు మన బడి’ పనులను స్పీడ్‌గా పూర్తి చేసి రాష్ట్రంలో సిద్దిపేట నియోజకవర్గాన్ని ఆదర్శంగా నిలపాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ అన్నారు. బుధవారం నియోజకవర్గంలోని ‘మన ఊరు మన బడి’ పనులపై కలెక్టరేట్ లో రివ్యూ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్మాట్లాడుతూ స్కూళ్లలో ఇప్పటివరకు పూర్తయిన పనులను రికార్డు చేసి ఆన్లైన్లో బిల్లులు మంజురు చేస్తామన్నారు. రూ.30లక్షల కన్నా ఎక్కువున్న పనులను తొందరగా పూర్తిచేయాలని కాంట్రాక్టర్లను కలెక్టర్ఆదేశించారు. సమావేశంలో డీఈఓ శ్రీనివాస్, పంచాయతి రాజ్ ఈఈ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
వారంలోగా పెండింగ్ ఫైల్స్ క్లియర్ చేయాలె
కంది, వెలుగు: ప్రతి ఫైల్లో ఒకరి జీవితం ఉంటుందని, ఫైల్స్పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేయాలని సంగారెడ్డి కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు. బుధవారం కలెక్టరేట్ లో వివిధ డిపార్ట్మెంట్లను కలెక్టర్ తనిఖీ చేశారు. సిబ్బంది హాజరును పరిశీలించి, డిపార్ట్మెంట్ల వారీగా పెండింగ్‌లో ఉన్న ఫైళ్లపై ఆరా తీశారు. యాక్షన్ ఓరియంటెడ్ ఫైళ్లను వారంలోగా క్లియర్ చేయాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట డీఆర్ఓ రాధికారమణి, ఏవో స్వర్ణలత ఉన్నారు. అనంతరం శ్రీశ్రీశ్రీ దత్తగిరి మహారాజ్ శతజయంతి హోత్సవాల పాంప్లెంట్‌ను కలెక్టర్ విడుదల చేశారు.
దేశానికి ఆదర్శంగా తెలంగాణ పల్లెలు
జిన్నారం, వెలుగు: సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలోని పల్లెలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయని ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బుధవారం జిన్నారం మండలం కాజిపల్లి, వావిలాల, జంగంపేట, జిన్నారం, ఊట్ల, రాళ్లకత్వ, శివానగర్, అండూర్ గ్రామాలలో రూ.4.79కోట్లతో చేపట్టిన సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కాలువలు, మహిళా భవనం పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ప్రభుత్వంలో ప్రతి గ్రామంలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీ రవీందర్ గౌడ్, టీఆర్ఎస్ సీనియర్ నాయకుడు వెంకటేష్ గౌడ్, ఆయా గ్రామాల సర్పంచ్ లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
రాహుల్ జోడో యాత్రను సక్సెస్ చేయాలె
మెదక్, రామచంద్రాపురం, వెలుగు: ఉమ్మడి మెదక్ జిల్లాలో రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రను సక్సెస్చేయాలని ఏఐసీసీ ఇన్చార్జి మాణిక్యం ఠాగూర్ అన్నారు. బుధవారం మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో రూట్‌మ్యాప్‌ను మాణిక్యం ఠాగూర్, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో కలిసి పరిశీలించారు. జోడో యాత్ర నవంబర్ మొదటి వారంలో లింగంపల్లి నుంచి ప్రారంభం కానుంది. అనంతరం మెదక్ జిల్లాలో టేక్మాల్, అల్లాదుర్గం మండలాల్లో రూట్ మ్యాప్ ను పరిశీలించారు. అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్‌లో రాహుల్ గాంధీ బస చేయనుండగా ఏర్పాట్లపై నాయకులకు సూచనలు చేశారు. కార్యక్రమాల్లో పటాన్చెరు నియోజకవర్గ ఇన్చార్జి శ్రీనివాస్ గౌడ్, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్ గౌడ్, ఏఐసీసీ సెక్రటరీ నదీమ్ జావీద్, మాజీ మంత్రి గీతారెడ్డి, సురేష్ షట్కర్, డీసీసీ ప్రెసిడెంట్ నిర్మల, జోడో యాత్ర ఇన్చార్జి బలరాం నాయక్, పార్లమెంట్ ఇన్చార్జి గాలి అనీల్ కుమార్ పాల్గొన్నారు.
అంత్యక్రియలకు అనుమతించలే..
పాపన్నపేట, వెలుగు: పాపన్నపేట మండలం కుర్తివాడ గ్రామంలో బుధవారం మణెమ్మ అనే మహిళ చనిపోయింది. డెడ్‌బాడీకి అంత్యక్రియలు నిర్వహించేందుకు వైకుంఠధామానికి తీసుకెళ్లగా అనుమతించలేదు. దీంతో పక్కనున్న స్థలంలో చితి పేర్చి అంత్యక్రియలు పూర్తిచేశారు. ఉపాధి హామీ కింద రూ.10 లక్షలతో గ్రామంలో వైకుంఠధామం నిర్మించారు. కాగా తమకు బిల్లు రూ.7 లక్షలు మాత్రమే వచ్చాయని, ఇంకా రూ.3 లక్షలు పెండింగ్‌లో ఉందని కాంట్రాక్టర్వైకుంఠధామాన్ని పంచాయతీకి అప్పగించలేదు. దీంతో నిర్మాణం పూర్తయినా అందులో అంత్యక్రియలకు అనుమతించడం లేదు. ఈ విషయమై అధికారుల నిర్లక్ష్యంపై గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎంపీడీఓ శ్రీనివాస్ ను వివరణ కోరగా ఎంబీ రికార్డు ప్రకారం వైకుంఠధామానికి సంబంధించి పంచాయతీ అకౌంట్‌ద్వారా కాంట్రాక్టర్‌కు డబ్బులు పూర్తిగా ముట్టాయన్నారు.
అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలె
మెదక్ (కౌడిపల్లి), వెలుగు: రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ అడుగుజాడల్లో నడవాలని రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. కౌడిపల్లి మండలం తునికిలో కొత్తగా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని బుధవారం నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి, మాలమహానాడు అధ్యక్షుడు అద్దంకి దయాకర్లతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మాట్లాడుతూ ఆమె మాట్లాడుతూ అంబేద్కర్ బడుగు బలహీన వర్గాల కోసమే తన జీవితం అర్పించారని, కష్టపడి చదివి దేశ దిశ మార్చేందుకు కృషి చేశారని కొనియాడారు. ఎమ్మెల్యే మదన్ రెడ్డి మాట్లాడుతూ కుల, మత భేదం లేకుండా అన్ని వర్గాల ప్రజలకు అన్ని హక్కులు కల్పించిన ఏకైక వ్యక్తి అంబేద్కర్ అన్నారు. కార్యక్రమంలో మలమహానాడు రాష్ట్ర అధ్యక్షుడు భిక్షపతి, టీఆర్ఎస్ స్టేట్లీడర్శ్రీధర్ గుప్తా, ఎంపీపీ రాజు నాయక్, జడ్పీటీసీ కవిత, లీడర్లు సురేష్, చంద్రయ్య, సంజీవ్ , శివ పాల్గొన్నారు.
ప్రభుత్వ సంస్థలను అమ్మడమే బీజేపీ విధానం
కంది, వెలుగు : రాజ్యాంగ విలువలు, లౌకిక ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు చుక్క రాములు అన్నారు. బుధవారం సంగారెడ్డిలోని కేవల్ కిషన్ భవన్ లో జరిగిన సీపీఎం విస్తృత స్థాయి సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రజా సమస్యలను గాలికి వదిలేసి, మతోన్మాద శక్తులను ప్రేరేపిస్తూ ప్రజల మధ్య వైషమ్యాలను సృష్టిస్తోందని విమర్శించారు. ప్రభుత్వ ఆస్తులు అమ్మడానికే అధికారంలోకి వచ్చామన్నట్లు నరేంద్ర మోడీ వ్యవహరిస్తోందన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి గొల్లపల్లి జయరాజ్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మల్లేశం, మాణిక్, రాజయ్య, సాయిలు, రాంచందర్, యాదవరెడ్డి, ప్రవీణ్, యాదగిరి, మైపాల్ పాల్గొన్నారు.