ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

సిద్దిపేట రూరల్, వెలుగు: రాష్ట్రంలో వృత్తి విద్య ఇంజినీరింగ్ ఫీజుల పెంపు నిర్ణయం వల్ల పేద మధ్యతరగతి విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమయ్యే పరిస్థితి ఉందని, ఫీజుల పెంపు ఉత్తర్వులను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మన్నె కుమార్ డిమాండ్ చేశారు. శనివారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర కౌన్సిల్ పిలుపు కార్యక్రమంలో భాగంగా గాంధీ చౌరస్తా వద్ద ప్రభుత్వ దిష్టిబొమ్మ దహనం చేశారు. అధికారులు స్పందించి ఉత్తర్వులు వెనక్కి తీసుకోకుంటే  ఉన్నత విద్యామండలి, విద్యాశాఖ మంత్రి కార్యాలయాన్ని ముట్టడిస్తామన్నారు.  కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు ఒగ్గు రమేశ్​, జిల్లా కార్యవర్గ సభ్యులు అప్పాల కృష్ణ, సాయి కుమార్, ప్రవీణ్, వెంకటేశ్, శ్రీను  పాల్గొన్నారు.

ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవించాలి

సిద్దిపేట రూరల్, వెలుగు: ప్రతి ఒక్కరూ చట్టాలను గౌరవించాలని, ట్రాఫిక్ రూల్స్​ పాటించాలని రోడ్డు ప్రమాదాలను అరికట్టాలని సీపీ. ఎన్. శ్వేత అన్నారు. శనివారం పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమాల్లో భాగంగా సీపీ ఆఫీస్​ పరేడ్ గ్రౌండ్ లో ఓపెన్ హౌస్ కార్యక్రమాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా సిద్దిపేటలో ప్రభుత్వ, ప్రైవేటు స్కూల్స్ స్టూడెంట్స్ ఆయుధాలు, పోలీసు చట్టాల గురించి, సీసీ కెమెరాల వల్ల కలిగే ఉపయోగాల గురించి, డాగ్ స్క్వాడ్, ఫింగర్ ప్రింట్ డివైస్ వివరించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఏ ఆర్ అడిషనల్ డీసీపీలు రామచంద్రరావు, సుభాష్ చంద్రబోస్, ట్రాఫిక్ ఏసీపీ ఫణిందర్, రిజర్వ్ ఇన్​స్పెక్టర్లు శ్రీధర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ధరణి కుమార్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ దుర్గ, సిద్దిపేట ట్రాఫిక్ సీఐ రామకృష్ణ, ఐటీ సెల్ ఎస్ఐ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. 

సునీతాలక్ష్మారెడ్డి పార్టీ మారుతున్నట్లు ప్రచారం..

నర్సాపూర్, వెలుగు : మహిళా కమిషన్ చైర్ పర్సన్ సునీత లక్ష్మారెడ్డి బీజేపీలో చేరుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వారిని గుర్తించి వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ నర్సాపూర్ పోలీస్ స్టేషన్ లో సీఐ షేక్ లాల్ మదర్ కు శనివారం టీఆర్ఎస్ నాయకులు ఫిర్యాదు చేశారు. ప్రచారం చేస్తున్న వారిని గుర్తించాలని కోరారు. ఫిర్యాదు చేసిన వారిలో నర్సాపూర్ మున్సిపల్ వైస్ చైర్మన్ నయీమ్ ఉద్దీన్, తొంట వెంకటేశ్​, మండల అధ్యక్షులు భోగ శేఖర్, పట్టణ అధ్యక్షులు పంబల్ల భిక్షపతి తదితరులు ఉన్నారు. 

43 మంది గిరిజన రైతుల మీద కేసులు

మెదక్​ (శివ్వంపేట), వెలుగు: శివ్వంపేట మండలం భీమ్లా తండా గ్రామ పంచాయతీ పరిధిలో 43 మంది గిరిజన రైతులపై ఫారెస్ట్​ ఆఫీసర్​లు కేసులు నమోదు చేశారు. ఈ విషయమై డిప్యూటీ ఫారెస్ట్​ రేంజ్​ ఆఫీసర్​ రవికుమార్​ మాట్లాడుతూ.. సదరు రైతులు తాము పోడు భూములు సాగు చేసుకుంటున్నట్టు అప్లయ్​ చేసుకున్నారని తెలిపారు. కానీ వారు కబ్జాలో లేరని పేర్కొన్నారు. ప్రస్తుతం పోడు భూముల సర్వే జరుగుతున్న నేపథ్యంలో అడవిలో చెట్లు నరికారని అందుకని వారిపై అటవీ పరిరక్షణ చట్టం ప్రకారం కేసులు నమోదు చేసినట్టు వివరించారు. 

కేసులు పెట్టడం అన్యాయం.. 

గిరిజన రైతుల మీద ఫారెస్ట్​ ఆఫీసర్​లు కేసులు నమోదు చేయడం అన్యాయమని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నర్సాపూర్​ నియోజకవర్గ ఇంఛార్జి సింగాయిపల్లి గోపి అన్నారు. శనివారం ఆయన భీమ్లా తండాను సందర్శించి కేసులు నమోదైన గిరిజన రైతులను పరామర్శించారు. ఓ వైపు ముఖ్యమంత్రి కేసీఆర్​ పోడు రైతులకు పట్టాలిస్తామని చెబుతుంటే మరో వైపు ఫారెస్ట్​ ఆఫీసర్లు  రైతుల మీద కేసులు నమోదు చేయడం ఏంటని ప్రశ్నించారు. రైతుల పైన కేసులు ఎత్తి వేయాలన్నారు లేకుంటే పెద్ద ఎత్తున రైతులతో కలిసి ఫారెస్ట్ ఆఫీస్ ముట్టడిస్తామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే మదన్ రెడ్డి అనుచరులు ఫారెస్ట్​, దేవాలయ భూములు కబ్జాచేసి వెంచర్​లు చేస్తున్న వారిపై కేసులు పెట్టకపోగా, అమాయక గిరిజనులపై కేసులు పెట్టడం
దారుణమన్నారు. 

కుల వృత్తులకు ప్రభుత్వం చేయూత

మెదక్​, వెలుగు: సొంత రాష్ట్రం ఏర్పాటయ్యాక   అన్నివర్గాల కోసం అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు  అమలు చేస్తున్నట్టు మెదక్​ఎమ్మెల్యే పద్మా దేవేందర్​రెడ్డి అన్నారు. పోచారం ప్రాజెక్ట్​లో శనివారం 12.48 లక్షల చేప పిల్లలు, 6.28 లక్షల రొయ్య పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుల వృత్తుల పై ఆధారపడి జీవించే వారి ఆర్థికాభివృద్ధికి చేయూత అందిస్తున్నట్టు తెలిపారు. మిషన్​ కాకతీయ పథకంతో చెరువులన్నీ బాగుకాగా,  మత్స్యకారుల సంక్షేమ కోసం ప్రభుత్వం చేప పిల్లలు అందిస్తోందని చెప్పారు. 
జిల్లాలోని వనదుర్గా ప్రాజెక్ట్​, హల్దీ ప్రాజెక్ట్​, చెరువులు, చెక్ డ్యామ్​లలో పెంచేందుకు ఈ సీజన్​లో 5.04 కోట్ల చేప పిల్లలను సరఫరా చేస్తున్నామన్నారు ఆయా చెరువుల పరిధిలో ఉన్నగంగపుత్రులు, ముదిరాజ్ లు కొత్త  మత్స్య సహాకార సంఘాలు ఏర్పాటు చేసుకొని చేపల పెంపకం ద్వారా ఉపాధి పొందాలని సూచించారు. ఈ కార్యక్రమంలో లోకల్​ బాడీ అడిషనల్​కలెక్టర్​ ప్రతిమాసింగ్, జిల్లా ఫిషరీస్​ ఆఫీసర్​ రజిని పాల్గొన్నారు. 

రైలు కిందపడి యువకుని ఆత్మహత్య

రామాయంపేట, వెలుగు: నార్సింగి మండలం సంకాపూర్​ శివారులో శనివారం రైలు కిందపడి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. కామారెడ్డి రైల్వే ఏఎస్సై తౌర్యా నాయక్ వివరాల ప్రకారం మండలంలోని ఝాన్సీ లింగాపూర్ కు చెందిన తిప్పపురం నరేశ్​ గౌడ్(31) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం కుటుంబ సభ్యులతో కలిసి తన అక్కవాళ్ల ఊరు సంకాపూర్ వెళ్లాడు. కానీ, నరేశ్​​ శనివారం ఉదయం ఆ గ్రామ శివారులో రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. అనారోగ్య సమస్య కారణంగానే జీవితంపై విరక్తి చెంది అతను ఆత్మహత్య చేసుకున్నట్టు మృతుని బంధువుల ఫిర్యాదు చేయగా.. కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఏఎస్సై తెలిపారు.

ఉచిత వైద్య శిబిరానికి స్పందన

మెదక్​ టౌన్​, వెలుగు : మండలంలోని మాచారంలో రష్​ హాస్పిటల్​ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని శనివారం నిర్వహించారు. ఈసందర్భంగా ఆస్పత్రి ఇన్​చార్జి రమేశ్​ మాట్లాడుతూ.. 150 మందికి ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించామని ఆర్థొపెడిక్​తో పాటు జనరల్​ టెస్ట్​లు చేసి, అవసరమైన మందులు ఇచ్చినట్టు చెప్పారు. కార్యక్రమంలో డాక్టర్లు సుమంత్, ప్రసాద్​రాజు, శ్యామల, బాలు, నాగకిరణ్​కుమార్​ పాల్గొన్నారు. 

బైక్​ దొంగల ముఠా అరెస్ట్.. 28 బైకులు స్వాధీనం 

మెదక్ (పెద్దశంకరంపేట), వెలుగు: జిల్లాతో పాటు ఇతర జిల్లాల్లో బైక్​లు దొంగతనాలు చేస్తున్న ముఠాను పట్టుకొని, వారి నుంచి 28 బైక్​లు స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ రోహిణి ప్రియదర్శిని తెలిపారు. శనివారం పెద్దశంకరంపేట పోలీస్ స్టేషన్​ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కు చెందిన జంగం ప్రశాంత్, మెదక్ జిల్లా శివంపేట మండలం రాబోజిపల్లికి చెందిన షేక్ ఫయాజ్, చాపల సంజీవ్, రామాయంపేట మండలం ధర్మారం గ్రామానికి చెందిన పున్న హరీశ్, నిజాంపేట్ మండలం నర్సాపూర్ గ్రామానికి చెందిన బోయిని ప్రశాంత్, నిజామాబాద్ జిల్లా నాగారంకు చెందిన పల్లపు హరికృష్ణ, నిజామాబాద్ కు చెందిన మక్కల లక్ష్మణ్ కలిసి ముఠాగా ఏర్పడ్డారని, ఏడాది కాలంగా బుల్లెట్​లు, పల్సర్​ బైక్​ లను దొంగలిస్తున్నారని తెలిపారు. వీరంతా గతంలో నిజామాబాద్​ జిల్లాలో పాత నేరస్తులని చెప్పారు. ఈనెల 18 న తిరుమలాపూర్ బ్రిడ్జి వద్ద పోలీసులు వెహికల్స్​ చెక్​ చేస్తుండగా అనుమానాస్పదంగా రెండు బైకులపై వచ్చిన ముగ్గురిని పోలీసులను పట్టుకొని విచారించగా దొంగతనాలను ఒప్పుకున్నారు. మొత్తం మొత్తం 28 బైక్​లు దొంగతనం చేశారని, వాటి విలువ రూ.30 లక్షల వరకు ఉంటుందన్నారు. ముఠాను పట్టుకున్న మెదక్ డీఎస్పీ సైదులు, అల్లాదుర్గం సీఐ జార్జ్, పెద్ద శంకరంపేట ఎస్సై బాలరాజ్​ను ఎస్పీ అభినందించారు. 

కరెంట్​ షాక్​ తో రైతు మృతి

మెదక్​, వెలుగు: హవేలి ఘనపూర్​ మండలం తిమ్మాయిపల్లిలో పొలం వద్ద కరెంట్​ షాక్​తో ఓ రైతు శుక్రవారం చనిపోయాడు. బాధిత కుటుంబ సభ్యులు, గ్రామస్థుల కథనం ప్రకారం... శుక్రవారం ఆఫీసర్​లు వచ్చి గ్రామ శివార్లలో పోడు భూముల సర్వే నిర్వహిస్తుండగా మండల శ్యామయ్య (61) అనే రైతు అక్కడికి వెళ్లాడు. కొద్ది సేపటి తరువాత దాహం వేస్తుందని సమీపంలోని వ్యవసాయ బోరు వద్ద నీరు తాగేందుకు వెళ్లాడు. ఈ క్రమంలో అక్కడ అడవి పందుల భారి నుంచి పంట రక్షణ కోసం వేసిన కరెంట్​ వైర్​కు తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. సాయంత్రమైనా శ్యామయ్య ఇంటికి తిరిగి రాకపోయే సరికి ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు పోడు భూముల సర్వే జరిగిన ప్రాంతంలో గాలించగా సమీపంలోని ఓ పొలం వద్ద చనిపోయి కనిపించాడు. శ్యామయ్యతోపాటు అక్కడ ఓ అడవి పంది, కోతి కూడా చనిపోయాయి. కాగా సదరు పొలం యజమాని నిర్లక్ష్యంగా పగటి పూట కూడా కంచెకు కరెంట్​ పెట్టడం వల్ల శ్యామయ్య చనిపోయాడని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ఇందుకు పరిహారం ఇవ్వాలని డిమాండ్​ చేశారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని  డెడ్​ బాడీని మెదక్​ జిల్లా ఆసుపత్రికి తరలించారు. శనివారం బాధిత కుటుంబ సభ్యులు రూరల్​ పోలీస్​ స్టేషన్​ కు తరలివచ్చారు. అయితే సదరు యజమాని అందుబాటులో లేకపోవడంతో ఏ విషయం తేలలేదు. తమకు న్యాయం జరిగే వరకు డెడ్​బాడీని తీసుకెళ్లేది లేదని వారు స్పష్టం చేశారు. దీంతో శనివారం సాయంత్రం వరకు శ్యామయ్య డెడ్ బాడీ ఆసుపత్రి మార్చురిలోనే ఉంది. 

కోతుల దాడి.. స్టూడెంట్​కు గాయాలు

మెదక్​(శివ్వంపేట), వెలుగు: శివ్వంపేట మండలం టిక్యాదేవమ్మగూడ తండా ప్రైమరీ స్కూల్లో కోతు లు దాడి చేయడంతో 3వ తరగతి చదువుతున్న అశ్విత్ కు తీవ్ర గాయాలయ్యాయి. అశ్విత్​ బాత్ రూమ్ కు వెళ్తుండగా కోతులు దాడి చేశాయి. అతను కింద పడిపోగా తలకు  గాయమైంది. టీచర్​లు ఆస్పత్రికి తరలించించారు. స్కూల్​కు ప్రహరీ వాల్ లేక చుట్టూ చెట్లు ఉండడంతో కోతులు క్లాస్​ రూమ్​లలోకి వస్తున్నాయని, దాడి చేస్తున్నాయని టీచర్లు తెలిపారు. 

బావిలో దూకి తల్లి, బిడ్డ ఆత్మహత్య

జహీరాబాద్, వెలుగు : మొగడంపల్లి మండల కేంద్రంలో అదనపు కట్నం వేధింపులతో శుక్రవారం రాత్రి అంబిక ( 23),   ఏడాది కూతురు  నక్షత్ర తో కలిసి వ్యవసాయ బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు చిరాక్ పల్లి ఎస్సై కాశీనాథ్​ తెలిపారు. ఆయన వివరాల ప్రకారం శనివారం ఉదయం ఇంట్లో అంబిక, పాప కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు వెతుకగా.. గ్రామ శివారులోని బావిలో చనిపోయి కనిపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. పోస్టుమార్టం కోసం మృతదేహాలను జహీరాబాద్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.కేసు దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్.ఐ కాశీనాత్ వివరించారు.