ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

జిల్లాస్థాయి సైన్స్​ ఫెయిర్​ ప్రారంభించిన ఎమ్మెల్యే పద్మాదేవేందర్ ​రెడ్డి

మెదక్, వెలుగు: స్టూడెంట్స్ సరికొత్త ఆలోచనలతో ముందుకు సాగి సైంటిస్టులుగా ఎదగాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్​ రెడ్డి సూచించారు.  గురువారం మెదక్ పట్టణంలోని గోల్​ బంగ్లా (వెస్లీ హైస్కూల్​)లో జిల్లా స్థాయి సైన్స్​ ఫెయిర్ ను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడారు. మానవ నిత్య జీవితంలో సైన్స్​ పాత్ర ఎంతో ఉందన్నారు. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహామ్మారి నుంచి ప్రజలను రక్షించేందుకు యుద్ధ ప్రాతిపదికన వాక్సిన్​ కనుగొన్న సైంటిస్టుల కృషి అమోఘమన్నారు. మున్సిపల్​ చైర్మన్​ చంద్రపాల్, డీఈఓ రమేశ్​ కుమార్​ మాట్లాడుతూ సీవీరామన్​, ఐన్​స్టీన్​, మేడమ్​ క్యూరీ, గుడెన్​ బర్గ్​, అబ్దుల్​ కలాం లాంటి సైంటిస్టులను ఆదర్శంగా తీసుకోవాలని స్టూడెంట్స్​కు సూచించారు. 

474 ఎగ్జిబిట్లు..

సైన్స్​ ఫెయిర్​ లో మొత్తం 474 ఎగ్జిబిట్లు ప్రదర్శితమయ్యాయి. ఎమ్మెల్యే పద్మా దేవేందర్​ రెడ్డి స్టూడెంట్స్​ ప్రదర్శించిన ఎగ్జిబిట్లను తిలకించి, వాటి పనితీరు, ప్రయోజనాల గురించి స్టూడెంట్స్​ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వివిధ పాఠశాలల విద్యార్థినుల సాంస్క్రతిక ప్రదర్శనలు అందరిని అలరించాయి. కార్యక్రమంలో డీఎస్​ఓ రాజిరెడ్డి, ఎంఈఓ నీలకంఠం, టీఎన్​జీఓ జిల్లా ప్రెసిడెంట్​ నరేందర్, ఆయా టీచర్స్​ యూనియన్ల ప్రెసిడెంట్లు పాల్గొన్నారు. 

అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే నంబర్​ వన్ : హోం మంత్రి మహమూద్​ అలీ

గజ్వేల్, వెలుగు : అభివృద్ధి, సంక్షేమంలో తెలంగాణ దేశంలోనే నంబర్​ వన్​గా ఉందని రాష్ట్ర హోంశాఖ మంత్రి మహమూద్​ అలీ అన్నారు. గురువారం ఆయన సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని గ్యారా షాహీద్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రాన్ని కాంగ్రెస్, టీడీపీ ఏళ్లుగా పాలించినా అభివృద్ధి జరగలేదన్నారు. ప్రస్తుతం సీఎం కేసీఆర్​ మంచి మనస్సుతో చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలు రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ గా నిలిపాయన్నారు. ఆయన వెంట ఎమ్మెల్సీ యాదవరెడ్డి, ఎఫ్​డీసీ చైర్మన్​ ప్రతాప్​రెడ్డి ఉన్నారు. 

దివ్యాంగుల సంక్షేమానికి కృషి

కంగ్టి, వెలుగు : రాష్ట్రంలో దివ్యాంగుల సంక్షేమానికి టీఆర్ఎస్ పార్టీ కృషి చేస్తోందని ఖేడ్ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్ రెడ్డి అన్నారు. గురువారం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మండల పరిధిలోని భీంరాతోపాటు పలు గ్రామాలకు చెందిన దివ్యాంగులకు ఉపాధి కోసం రూ.50వేల చెక్కులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం దివ్యాంగుల కోసం అనేక సంక్షేమ పథకాలు తీసుకొస్తోందని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ గోదావరి బస్వారాజ్ పాటిల్, లీడర్లు సంతోష్ పాటిల్, విశ్వనాథ్ ఉన్నారు. 

దుబ్బాకలో ఎంపీ దిష్టిబొమ్మ దహనం

దుబ్బాక, వెలుగు : మిరుదొడ్డి మండలం చెప్యాల గ్రామ సర్పంచ్ మాచపురం లక్ష్మీయాదగిరికి సమాచారం ఇవ్వకుండానే అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎంపీ కొత్త ప్రభాకర్​రెడ్డి వైఖరి నిరసిస్తూ గురువారం దుబ్బాకలో బీజేపీ నాయకులు ఎంపీ దిష్టిబొమ్మను దహనం చేశారు. ​ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అగ్రవర్ణ అహంకారంతో దళిత సర్పంచ్​ లేకుండానే అభివృద్ధి పనులకు ఎంపీ శంకుస్థాపనలు ఎలా చేస్తారని ప్రశ్నించారు. దళిత సర్పంచ్​ను అవమానించిన ఎంపీ వైఖరిని ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాలు, విద్యార్థి, మేధావులు ఖండించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు మట్ట మల్లారెడ్డి, మచ్చ శ్రీనివాస్​, పుట్ట వంశీ, దూలం వెంకట్​ గౌడ్, తొగుట రవీందర్, గాజుల భాస్కర్, సుంకోజి ప్రవీణ్, రమేశ్​రెడ్డి, సప్తగిరి, భద్రి, సంజీవ్, బాబాజీ రాజేశ్, నేహాల్​ గౌడ్, విఠోభా పాల్గొన్నారు. 

ప్రమాదాల నివారణపై అవగాహన కల్పించాలి

సిద్దిపేట, వెలుగు : పరిశ్రమల్లో ప్రమాదాలు నివారణకు అందులో పనిచేసే వారితో పాటు ఆయా ప్రాంతాల్లోని ప్రజలకు అవగాహన కల్పించాలని సిద్దిపేట అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్ సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్​లో పరిశ్రమలల్లో  ప్రమాదాలు,  విపత్తు  సందర్భంగా తీసుకోవాల్సిన చర్యలపై  పరిశ్రమలు, రెవెన్యూ, పోలీస్, ఫైర్, రవాణా, మెడికల్ డిపార్ట్​మెంట్  అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా ఎదుర్కోవాలో అక్కడ పని చేస్తున్న సూపర్ వైజర్ల కు  ట్రేనింగ్ ఇవ్వడంతో పాటు  నెలకోసారి సమావేశాలు నిర్వహించాలని సూచించారు. పరిశ్రమల్లోని  మేనేజర్ గదిలో ఆర్డీఓ, పోలీస్, ఫైర్, మెడికల్ డిపార్మెంట్ అధికారుల ఫోన్​ నంబర్లను అందుబాటులో ఉంచాలన్నారు.  సమావేశంలో ఆర్డీవో అనంత్ రెడ్డి, అడిషనల్ డీసీపీ మహేందర్, డీపీఓ దేవకిదేవి, డీఏఓ శివప్రసాద్, ఎన్డీఆర్ఎఫ్ ఏసీపీ దామోదర సింగ్ పాల్గొన్నారు. 

నాణ్యమైన విద్య అందించాలె

సిద్దిపేట రూరల్, వెలుగు : వచ్చేఏడాది జరిగే నేషనల్ అకడమిక్ సర్వేలో రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచేలా నాణ్యమైన విద్య అందించాలని రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్  దేవసేన అన్నారు. గురువారం ఆమె సిద్దిపేట కలెక్టరేట్ మీటింగ్ హాల్ లో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎంపీడీవో, ఎంఈవోలు, ఆర్ అండ్ బీ, టీఎస్ ఈడబ్ల్యూఐడీసీ, తదితర అధికారులతో  సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలోని ప్రైమరీ స్కూల్స్ లో  స్టూడెంట్స్  అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేందుకు అమలు చేస్తున్న తొలిమెట్టు కార్యక్రమం బాగుందన్నారు. కార్యక్రమంలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ముజా మ్మిల్ ఖాన్, సమగ్ర శిక్ష అడిషనల్ స్టేట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ రమేశ్ పాల్గొన్నారు.

ప్రతి సబ్జెక్టుపై పూర్తి అవగాహన వచ్చేలా బోధన ఉండాలి 

కరోనా కారణంగా రెండేండ్లు స్టూడెంట్స్ చదువులకు ఆటంకం కలిగినందున ప్రతి సబ్జెక్టు పై పూర్తి అవగాహన వచ్చేలా టీచర్లు అదనంగా సమ యం కేటాయించి పాఠాలు చెప్పాలని దేవసేన సూచించారు.  గురువారం సిద్దిపేట రూరల్ మం డలం రాఘవపూర్ గ్రామంలోని ప్రభుత్వ ప్రైమరీ, జడ్పీహెచ్ఎస్ లను కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ తో కలిసి ఆమె సందర్శించారు. మన ఊరు మనబడి కార్యక్రమం ద్వారా ఆయా పాఠశాలలలో చేపట్టిన అభివృద్ధి పనులను పరిశీలించారు. జడ్పీ హైస్కూల్, ప్రైమరీ స్కూళ్లలో నిర్మించిన కిచెన్ షెడ్లు, ప్రహరీని చూసి బాగుందన్నారు. తరగతి గదులలో పెయింటింగ్ ఆకర్షణీయంగా లేదని, స్కూల్ ఆవరణలో మొక్కలు నాటి పరిసరాలను శుభ్రం చేయాలని టీచర్ల ను ఆదేశించారు. స్టూడెంట్స్ తో కలిసి పాఠాలు విని, బోధన బాగుందని సంతృప్తి వ్యక్తం చేశారు. జడ్పీ హైస్కూల్ పీఈటీ హెచ్ఎం కు  సరైన సమాచారం ఇవ్వకుండా జిల్లా కేంద్రంలో జరుగుతున్న క్రీడల పోటీలకు మూడవ తరగతి స్టూడెంట్స్ ను తీసుకెళ్లడంపై ఆమె ఆగ్రం వ్యక్తం చేశారు. అనంతరం సిద్దిపేట లోని ఇందిరానగర్ జడ్పీ హైస్కూల్, నాసర్ పురా లోని బాలికల ఉన్నత పాఠశాలలను సందర్శించి టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ అభ్యాసన సామర్థ్యాన్ని పరిశీలించారు. 

ఆర్టీవో ఆఫీస్​లో విజిలెన్స్ తనిఖీలు

సిద్దిపేట, వెలుగు : సిద్దిపేట ఆర్టీవో ఆఫీస్​ను గురువారం రవాణా శాఖ విజిలెన్స్ అధికారుల బృందం  తనిఖీ  చేసింది. మధ్యాహ్నం 2 గంటలకు వచ్చిన విజిలెన్స్ టీమ్ రాత్రి పొద్దు పొయ్యే వరకు పలు రికార్డులను పరిశీలించింది. మీడియాను లోపలికి అనుతించకుండా  కార్యాలయం డోర్లకు తాళాలు వేశారు. 15 రోజులుగా కార్యాలయంలో నగదు చెల్లింపులు జరిపినా దాదాపు రూ.3 లక్షలకు పైగా నగదును ప్రభుత్వానికి చెల్లించకపోవడంతోపాటు ఆఫీస్​ పనితీరుపై పలు ఫిర్యాదులు అందడంతో తనిఖీలు చేసినట్లు తెలిసింది. 

అన్ని వర్గాల అభివృద్ధికి కృషి : ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి

మెదక్​ టౌన్​, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాల వారి అభ్యున్నతికి కృషి చేస్తోందని సీఎం కేసీఆర్​ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్​రెడ్డి అన్నారు. గురువారం హవేలీఘనపూర్​ మండలం కూచన్​పల్లిలోని చెక్​డ్యామ్​లో  సుభాష్ రెడ్డి, ఫిషరీస్​ జిల్లా ఏడీ డాక్టర్​ రజనితో కలిసి చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్స్యకారులు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు వీలుగా వారికి ప్రభుత్వం టూవీలర్లు అందిస్తోందన్నారు. ఈ ప్రాంతంలో రొయ్యల పెంపకం కూడా జరిగే విధంగా మత్స్య శాఖ అధికారులు కృషి చేయాలని సూచించారు.  కార్యక్రమంలో హావేలీఘనపూర్ ఎంపీపీ శేరి నారాయణరెడ్డి, సర్పంచులు మన్నె లక్ష్మీనారాయణ,  యామిరెడ్డి,  శ్రీను నాయక్, టీఆర్ఎస్ నాయకులు గోపాల్ రెడ్డి, జైపాల్ రెడ్డి పాల్గొన్నారు.  

ఆడబిడ్డలకు అండగా ‘కల్యాణలక్ష్మి’

కోహెడ (బెజ్జంకి), వెలుగు: కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్​ పథకాలు పేదింటి ఆడ బిడ్డలకు అండగా నిలిచి వారి జీవితాల్లో వెలుగులు నింపుతున్నాయని మానకొండూర్​ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ అన్నారు. గురువారం బెజ్జంకి మండలం గుండారం, చీలాపూర్, రేగులపల్లి గ్రామాల్లో కల్యాణలక్ష్మి, సీఎంఆర్ఎఫ్​ చెక్కులను ఆయన ఇంటింటికీ తిరుగుతూ లబ్ధిదారులకు పంపిణీ చేశారు. చీలాపూర్​పల్లిలో కొత్తగా నిర్మిస్తున్న జీపీ, మహిళ బిల్డింగ్​పనులను పరిశీలించారు. 

‘రియల్’ మాఫియా చేతిలో మోసపోవద్దు 

కంగ్టి, వెలుగు : రియల్ మాఫియాను నమ్మి మోసపోవద్దని ఖేడ్ డీఎస్పీ బాలాజీ సూచించారు. గురువారం కంగ్టి మండల పరిధిలోని రాజారాం తండా చౌరస్తా వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. రియల్ ఎస్టేట్ పేరు చెప్పి ఇతర భూములను నకిలీ సర్టిఫికెట్స్ చూపించి భూములు తక్కువ ధరలకు అమ్ముతూ కొనుగోలుదారులను మోసం చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నవారిపై పీడీ యాక్ట్ కేసు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట సీఐ వెంకటేశ్వర్లు, ఏఎస్ఐ ఈశ్వర్, గంగాధర్, ప్రేమ్ సింగ్, గోపాల్ పాల్గొన్నారు.

రైతు సమస్యలపై కాంగ్రెస్ నిరసన

రైతుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ గురువారం కాంగ్రెస్​ పార్టీ ఆధ్వర్యంలో మెదక్​ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు. తహసీల్దార్​ ఆఫీసుల ముందు నాయకులు బైఠాయించారు. ధరణి పోర్టల్​రద్దు చేయాలని, రైతు రుణ మాఫీ అమలు చేయాలని, వడ్ల బిల్లులను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. – వెలుగు, నెట్​ వర్క్

వివాహిత మృతి కేసులో భర్తకు పదేళ్లు, అత్తకు ఏడేళ్ల జైలు 

మెదక్ టౌన్, వెలుగు:  వివాహిత మృతి కేసులో భర్త, అత్తకు జైలు శిక్షపడింది. మెదక్ జిల్లా ఎస్పీ  రోహిణి ప్రియదర్శిని తెలిపిన ప్రకారం.. మెదక్ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్కొండ వీధికి చెందిన మహమ్మద్ సమీ అహ్మద్​కు హైదరాబాద్ బోరబండకు చెందిన విజాహతున్నిసతో 2009లో పెళ్లి జరిగింది. భర్త మహమ్మద్ సమీఅహ్మద్​ అత్త అమీనా బేగం, మామ మహమ్మద్ షమీ, ఆడపడుచులు విజాహతున్నిసను అదనపు కట్నం కోసం వేధించారు. ఈ క్రమంలో 2016 ఫిబ్రవరి 15న విజాహతున్నిస ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ మేరకు మృతురాలి భర్తకు పదేళ్లు, అత్తకు ఏడేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.16 వేల జరిమానా విధిస్తూ గురువారం జిల్లా సెషన్స్ జడ్జి లక్ష్మీ శారద తీర్పునిచ్చారు.

గ్రామీణాభివృద్ధి పనుల్లో ఇబ్రహీంపూర్ భేష్

సిద్దిపేట రూరల్, వెలుగు : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న గ్రామీణాభివృద్ధి పనుల్లో ఇబ్రహీంపూర్ గ్రామం భేష్ అని ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, డామాన్ డయ్యూ రాష్ట్రాల ప్రతినిధుల బృందం కితాబునిచ్చింది.. గురువారం నారాయణరావుపేట మండలం ఇబ్రహీంపుర్ గ్రామాన్ని ఎన్ఐఆర్డీ ఆధ్వర్యంలో సందర్శించారు. ఉపాధి హామీ పథకం కింద చేపట్టిన ఇంటింటికీ ఇంకుడు గుంతలు, సామూహిక గొర్రెల షెడ్లు, శ్మశానవాటిక, డంపింగ్ యార్డు, పార్క్, ప్రైమరీ స్కూల్, పశువుల షెడ్లు, కందకాలు పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. కార్యక్రమంలో ఎంపీడీవో మురళీధర్ శర్మ, ఎంపీవో శ్రీనివాస్, సర్పంచ్ కోడురి దేవయ్య, ఎన్ఐఆర్డీ ప్రోగ్రాం అధికారి అనురాధ, కో ఆర్డినేటర్ రాజ్ కుమార్, పంచాయతీ కార్యదర్శులు హర్శత్, శ్రీధర్, రేఖారాణి, అరుణ పాల్గొన్నారు.

గాయపడ్డ విద్యార్థులకు ఎమ్మెల్యే పరామర్శ 

మెదక్​ (చేగుంట), వెలుగు : మెదక్ జిల్లా చేగుంట మండలం ఉల్లి తిమ్మాయిపల్లి వద్ద బస్సును ఆటో ఢీకొన్న ఘటనలో గాయపడిన విద్యార్థులను దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్​రావు గురువారం ఇబ్రహీంపూర్​  గ్రామానికి వెళ్లి పరామర్శించారు. వారికి ఆర్థిక సాయం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరికీ తాను ఉన్నానంటూ భరోసానిచ్చారు. విద్యార్థులు మంచి ఆహారం, మందులు తీసుకొని తొందరగా కోలుకోవాలన్నారు. ఆర్టీసీ ఉన్నతాధికారులతో  మాట్లాడి సమయానుకూలంగా బస్సు సౌకర్యం ఏర్పాటు చేసే విధంగా చూస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే వెంట చేగుంట వైస్ ఎంపీపీ మున్నూరు రామచంద్రం, మాజీ సర్పంచ్ నాగభూషణం, మండల పార్టీ అధ్యక్షుడు చింతల భూపాల్, రాష్ట్ర ఓబీసీ కార్యవర్గ సభ్యుడు కర్ణం గణేశ్, తదితరులు ఉన్నారు.