ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

ఉమ్మడి మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

పటాన్​చెరు(గుమ్మడిదల), వెలుగు : ప్రతి ఇంటికీ సంక్షేమ ఫలాలు అందిస్తున్నామని పటాన్​చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. ఆదివారం గుమ్మడిదల మండల పరిధిలోని మంబాపూర్, నల్లవల్లి కొత్తపల్లి, నాగిరెడ్డిగూడెం, అనంతారం, కానుకుంట, వీరారెడ్డిపల్లి, రామిరెడ్డి బావి గ్రామ పంచాయతీల పరిధిలో రూ.1.60కోట్లతోపాటు రూ.80 లక్షల సీడీపీ నిధులతో  చేపట్టనున్న సీసీ రోడ్లు, అండర్​ డ్రైనేజీ నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. అనంతరం మహమ్మద్ ప్రవక్త జన్మదినం సందర్భంగా గుమ్మడిదలలో ఏర్పాటుచేసిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ఎమ్మెల్యే వెంట ఎంపీపీ ప్రవీణ విజయభాస్కర్ రెడ్డి, జడ్పీటీసీ కుమార్ గౌడ్, ఎంపీడీవో చంద్రశేఖర్, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు ఉన్నారు. 

మల్లన్న ఆలయ అభివృద్ధికి పలు తీర్మానాలు

కొమురవెల్లి, వెలుగు : మల్లన్న ఆలయంలో ఈవో బాలాజీ, చైర్మన్ గీస భిక్షపతి ఆధ్వర్యంలో ఆదివారం ధర్మకర్తల్లి మండలి సభ్యులు, ఆలయ అధికారులు అభివృద్ధి కార్యక్రమాలపై పలు తీర్మానాలు చేశారు. స్వామికి బంగారు కిరీటం తయారీ కోసం టెండర్, స్వామివారి కళ్యాణం, జాతర ఏర్పాట్లు, దుకాణాల వేలం, టికెట్ రేట్ల పెంపుదల, తదితర తీర్మానాలు చేసి ప్రతిపాదనలు పంపించారు. కార్యక్రమంలో ఏఈవో అంజయ్య, ధర్మకర్తలు, సిబ్బంది పాల్గొన్నారు.

పిట్లం బేస్​ మున్నూరుకాపు సంఘం కార్యవర్గం ఎన్నిక

మెదక్​ టౌన్​, వెలుగు : మెదక్​ పట్టణంలోని మున్నూరు కాపు సంఘం పిట్లంబేస్​ శాఖ కొత్త కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. సంఘం ప్రెసిడెంట్​గా ఆది బలరామ్,  జనరల్ ​సెక్రటరీగా బట్టి రమేశ్, కోశాధికారిగా మేర్గు రాజు, ఉపాధ్యక్షులుగా బండ సిద్ధయ్య, బోనగిరి శంకర్, ఆకారం యాదగిరి, అల్లం  మధుసూదన్​ ఎన్నికయ్యారు. ఆడిటర్లుగా కొత్త దశరథం, తిరుపతి, కార్యవర్గ సభ్యులుగా జగన్, మోహన్, ఆంజనేయులు, ప్రసాద్, రాజు, కిష్టయ్య, సత్యనారాయణ, బాలయ్య ఎన్నికయ్యారు. సంఘం సలహాదారులుగా బండ నారాయణ, బట్టి జగపతి, కొప్పుల పోచయ్య, చల్లా నరేందర్ ​వ్యవహరించనున్నారు. ఎన్నికల అధికారిగా ఎ.రమేశ్​ వ్యవహరించారు.

మత్స్యకారుల అభివృద్ధికి కృషి

సిద్దిపేటరూరల్, వెలుగు : రాష్ట్ర ప్రభుత్వం చేపల పంపిణీ పథకంతో మత్స్యకారుల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తోందని ఎంపీపీ శ్రీదేవీచందర్ రావు అన్నారు. ఆదివారం మత్స్యశాఖ ఆధ్వర్యంలో మండల పరిధిలోని రాఘవాపూర్ గ్రామ పరిధిలోని పెద్ద చెరువులో ఆమె చేప పిల్లలను విడుదల చేశారు. అనంతరం గ్రామంలో ఏర్పాటు చేయనున్న లైబ్రరీ పనులను సందర్శించి, త్వరగా వర్క్స్​ కంప్లీట్​ చేసి అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అలాగే మండల పరిధిలోని రావురుకుల, రాంపూర్ గ్రామాలలోని చెరువులలో వైస్ ఎంపీపీ శేరిపల్లి యాదగిరి ఆధ్వర్యంలో సర్పంచ్ నీరటి కవితారవీందర్, రాంపుర్ సర్పంచ్ ఏర్పుల భిక్షపతి 69 వేల చేప పిల్లలను విడుదల చేశారు. 

సిద్దిపేటలో దొంగల హల్ చల్

సిద్దిపేట రూరల్, వెలుగు: సిద్దిపేట జిల్లా కేంద్రంలోని శ్రీనివాసనగర్ కాలనీలో దొంగలు కలకలం సృష్టించారు. శనివారం రాత్రి ఏడు ఇండ్ల తాళాలు పగల కొట్టి దొంగతనానికి యత్నించారు. కాలనీ వాసులు, టూటౌన్ పోలీసులు తెలిపిన ప్రకారం.. శ్రీనివాసనగర్ కాలనీలోని రామకృష్ణ గౌడ్, గంప శ్రీను ఇండ్లలోని కిరాయిదారులు ఇటీవల పండుగకు సొంతూళ్లకు వెళ్లారు. దీంతో ఆ ఇండ్లను దొంగలు టార్గెట్ చేశారు. వరుసగా ఏడు ఇండ్ల తాళాలు పగలగొట్టి వెతుకుతున్నారు. ఇదే సమయంలో కాలనీలో నివాసం ఉండే ఇరుకుల సురేందర్​ హైదరాబాద్ ​నుంచి ఇంటికి వస్తున్నాడు. దొంగల అలికిడిని గుర్తించి గట్టిగా అరిచాడు. దీంతో దొంగలు ఎక్కడి వస్తువులు అక్కడే వదిలేసి పారిపోయారు. అనంతరం నంబర్ లేని ద్విచక్ర వాహనం, రెండు గడ్డ పారలను కాలనీవాసులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

భక్తి శ్రద్ధలతో మిలాద్- ఉన్ -నబీ

ఇస్లాం మత గురువు మహమ్మద్​ ప్రవక్త పుట్టిన రోజు సందర్భంగా ఉమ్మడి మెదక్​ జిల్లా వ్యాప్తంగా ఆదివారం మిలాద్​- ఉన్​ -నబీని ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. భారీ ర్యాలీలు నిర్వహించారు. ఈద్గా, దర్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ మొహమ్మద్ ప్రవక్త జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ర్యాలీల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. - వెలుగు, నెట్​వర్క్

మెదక్​ చర్చిలో భక్తుల సందడి

మెదక్​ టౌన్, వెలుగు : మెదక్​ కెథడ్రల్ చర్చికి ఆదివారం భక్తులు పెద్ద సంఖ్యలోనే తరలివచ్చారు. ఉదయం శిలువ ఊరేగింపు నిర్వహించారు. చర్చి ఫాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం మెదక్​ డిస్ట్రిక్ట్​ చర్చి కౌన్సిల్​ చైర్మన్​గా ఎన్నికైన ప్రెసిబిటరీ ఇన్​చార్జి జార్జి ఎబినేజర్ ​దంపతులతో పాటు ఇటీవల కొత్తగా ఎన్నికైన మెదక్​ డిస్ట్రిక్ట్​ చర్చి కౌన్సిల్​సభ్యులు రోలాండ్​పాల్, వికాస్, డగ్లస్, సునీల్, జాయ్​ముర్రే, లిల్లీ గ్రేస్​ తదితరులను పూలమాలలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. 

బీజేపీ సభకు తరలివెళ్లిన నాయకులు

సంగారెడ్డి టౌన్/పటాన్​చెరు​, వెలుగు : ఉమ్మడి మెదక్ జిల్లా జిల్లా ప్రజా పరిషత్ మాజీ చైర్ పర్సన్ ఎర్రగొల్ల రాజమణి మురళీ యాదవ్, ప్రస్తుతం నర్సాపూర్ మున్సిపల్ చైర్మన్ మురళి యాదవ్ ఆదివారం బీజేపీలో చేరుతున్న సందర్భంగా సంగారెడ్డి నుంచి బీజేపీ నాయకులు దయాకర్ రెడ్డి ఆధ్వర్యంలో 100 కార్లతో నర్సాపూర్​ సభకు తరలివెళ్లారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని మోడీ అవినీతిరహిత పాలన, ప్రజా సంక్షేమం, తెలంగాణ రాష్ట్రంలో ప్రజల పక్షాన ప్రజా సమస్యలపై పోరాటం చేయడంతో బీజేపీకి రోజురోజుకూ ప్రజల్లో ఆదరణ పెరుగుతోందన్నారు. వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. 

గోదావరి అంజిరెడ్డి ఆధ్వర్యంలో..
పటాన్​చెరు నియోజకవర్గం నుంచి బీజేపీ రాష్ట్ర మహిళా మాజీ ప్రధాన కార్యదర్శి గోదావరి అంజి రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో నర్సాపూర్​ సభకు తరలివెళ్లారు.  పటాన్​చెరు పట్టణ కాంగ్రెస్​ నాయకులు మాజీ కార్పొరేటర్ శంకర్ యాదవ్ బీజేపీలో చేరుతుండడంతో ఆయనతో కలిసి ఆమె పటాన్​చెరు పట్టణంలోని అంబేద్కర్​ విగ్రహానికి పూలమాళలు వేసి బయలుదేరారు. వారి వెంట నాయకులు ఆనంద్ కృష్ణ రెడ్డి, మొహాన్ గౌడ్, నంద రెడ్డి, మల్లేశ్, రత్నం, రవి నాయక్, సాయికృష్ణ ఉన్నారు.

భక్తి శ్రద్ధలతో మిలాద్- ఉన్ -నబీ

ఇస్లాం మత గురువు మహమ్మద్​ ప్రవక్త పుట్టిన రోజు సందర్భంగా ఉమ్మడి మెదక్​ జిల్లా వ్యాప్తంగా ఆదివారం మిలాద్​- ఉన్​ -నబీని ముస్లిం సోదరులు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. భారీ ర్యాలీలు నిర్వహించారు. ఈద్గా, దర్గాల వద్ద ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా పలువురు ముస్లిం మత పెద్దలు మాట్లాడుతూ మొహమ్మద్ ప్రవక్త జీవితాన్ని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ర్యాలీల సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. - వెలుగు, నెట్​వర్క్

కరెంట్ షాక్తో మహిళ మృతి

మెదక్​(పెద్దశంకరంపేట), వెలుగు : కరెంట్ షాక్​తో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటన మెదక్​ జిల్లా అల్లాదుర్గం మండలం మాందాపూర్ గ్రామ శివారులో ఆదివారం జరిగింది. మండలంలోని కోమటి కుంట తండాకు చెందిన కొమిని బాయి (50) తోటి కూలివాళ్లతో కలిసి రైతు సుధాకర్ పొలం వద్ద పనులు చేసేందుకు వెళ్లింది. అయితే శనివారం రాత్రి అడవి పందుల కోసం పంట పొలాల చుట్టూ విద్యుత్ తీగలు అమర్చినవారు ఆదివారం ఉదయం వాటిని తీయడం మర్చిపోయారు. కూలీ పనులకు వచ్చిన కొమిని బాయి ఆ తీగలను చూసుకోకుండా తగలడంతో కరెంట్​షాక్​తో ఆమె అక్కడికక్కడే చనిపోయింది.

పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం

మెదక్​టౌన్, వెలుగు : మెదక్​లో ఆదర్శ ఉన్నత పాఠశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఆనందోత్సాహాల మధ్య ఘనంగా జరుపుకున్నారు. పదో తరగతి 1997–-9-8 విద్యా సంవత్సరానికి చెందిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం పట్టణంలోని  వైస్రాయ్ గార్డెన్స్​లో నిర్వహించారు. చిన్ననాటి తీపి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఆనందంగా గడిపారు. 

పెంపుడు తండ్రిపై పోక్సో కేసు

దుబ్బాక, వెలుగు : చిన్నారులకు నీలి చిత్రాలను చూపెట్టి, అసభ్యంగా ప్రవర్తించిన పెంపుడు తండ్రిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఏసీపీ దేవారెడ్డి తెలిపారు. కేసు వివరాలను ఆదివారం దుబ్బాకలో ఆయన మీడియాకు వెల్లడించారు. మిరుదొడ్డి మండలానికి చెందిన ఓ మహిళకు ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. ఆమె భర్త ఐదేళ్ల కింద అనారోగ్యంతో మరణించాడు. ఇటీవల ఆమె మరో వ్యక్తిని పెళ్లి చేసుకుని దుబ్బాక పట్టణంలో నివాసం ఉంటుంది. అయితే ఈనెల 8న అతడు భార్యను కూలీ పనుల కోసం బయటికి పంపించాడు. అనంతరం ఇంట్లోని ఎనిమిదేళ్లలోపు ఇద్దరు చిన్నారులకు నీలి చిత్రాలను చూపెట్టి వారితో అసభ్యంగా ప్రవర్తించాడు. చిన్నారులు కేకలు వేయడంతో నిందితుడు పారిపోయాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పిల్లల తల్లి వెంటనే అతడిపై పోలీస్ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఆదివారం ఉదయం దుబ్బాక బస్టాండ్​వద్ద నిందితుడిని అరెస్ట్​ చేసి జ్యూడిషియల్​ రిమాండ్​కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు. సమావేశంలో సీఐ కృష్ణ, ఎస్సై మహేందర్​ ఉన్నారు. 

వివాహితను అత్తింటివారే హత్య చేశారని బంధువుల ఆందోళన

మెదక్​ టౌన్, వెలుగు : ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. అత్తింటివారే హత్య చేసి ఆత్మహత్యగా చెబుతున్నారని ఆరోపిస్తూ మృతురాలి బంధువులు దాడికి యత్నించారు. ఈ ఘటన మెదక్​ జిల్లా హవేలీఘనపూర్​మండలం లింగ్సాన్​పల్లిలో ఆదివారం జరిగింది. పోలీసులు, గ్రామస్తులు తెలిపిన ప్రకారం..  కామారెడ్డి జిల్లా  నాగిరెడ్డిపేట మండలం గుండారం గ్రామానికి చెందిన శిరీష (24)తో లింగ్సాన్​పల్లికి చెందిన రాగుల మహేశ్​కు రెండేండ్ల కింద వివాహం జరిగింది. వారికి ఎనిమిది నెలల కూతురు ఉంది. కాగా అత్తింటివారికి, శిరీషకు ఎప్పుడూ గొడవలు జరుగుతుండేవి. ఈ క్రమంలో ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో శిరీష దూలానికి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. విషయం తెలుసుకున్న మృతురాలి బంధువులు లింగ్సాన్​పల్లికి చేరుకొని గొడవ చేశారు. శిరీష ఆత్మహత్య చేసుకోలేదని, ఆమెను హత్య చేసి ఆత్మహత్యగా చెబుతున్నారని అత్తింటివారిపై దాడికి యత్నించారు. విషయం తెలుసుకున్న మెదక్​ డీఎస్పీ సైదులు, మెదక్​ రూరల్ సీఐ విజయ్, మెదక్​, హవేలీఘనపూర్​ఎస్సైలు మోహన్​రెడ్డి, మురళి సిబ్బందితో గ్రామానికి చేరుకున్నారు. ఇరువర్గాలకు సర్దిచెప్పి శాంతిపజేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మెదక్​ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. గ్రామంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు.

వాల్మీకి జీవితం అందరికీ ఆదర్శప్రాయం

మహర్షి వాల్మీకి జీవితం అందరికీ ఆదర్శప్రాయమని మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట అడిషనల్​ కలెక్టర్లు ప్రతిమాసింగ్, వీరారెడ్డి, శ్రీనివాస్​రెడ్డి, మెదక్​ ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. ఆదివారం వాల్మీకి జయంతి సందర్భంగా ఆయన ఫొటోలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కలెక్టరేట్లలో, ఎస్పీ ఆఫీసులో వేడుకలు ఘనంగా నిర్వహించారు. వాల్మీకి  రామాయణం అనే గొప్ప కావ్యాన్ని రచించి మానవ సంబంధాలు విలువలు సమాజానికి అందించారని గుర్తుచేసుకున్నారు. అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. - మెదక్​టౌన్/సంగారెడ్డి టౌన్​/సిద్దిపేట రూరల్, వెలుగు