శివ్వంపేట, వెలుగు: ఇందిరమ్మ ఇళ్లు శాంక్షన్ కావడంతో ఉంటున్న గుడిసె తీసేసి, అప్పుచేసి ఇల్లు కట్టుకున్నామని, బిల్లులు రావడం లేదని, మేడం మీకు దండం పెడతా.. జర బిల్లులు మంజూరు చేయండని ఓ మహిళ సోమవారం ప్రజావాణిలో ఎంపీడీవోను వేడుకొంది.
మెదక్ జిల్లా శివ్వంపేట మండలం బిక్యా తండా జీపీకి చెందిన ధరావత్ లక్ష్మీకి ఇందిరమ్మ ఇల్లు మంజూరైంది. అధికారులు వచ్చి ముగ్గు పోయడంతో ఆమె పనులు ప్రారంభించింది. అప్పులు స్లాబ్ లెవెల్ వరకు పూర్తి చేసింది.
అయినా ఇప్పటివరకు ఒక్క బిల్లు కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఇంటి బిల్లు కోసం నెలలుగా ఆఫీసర్ల చుట్టు తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయింది. దీనిపై ఎంపీడీవో వెంకటలక్ష్మి మాట్లాడుతూ మరో తండాలో గతంలో లక్ష్మీకి ఇందిరమ్మ ఇల్లు మంజూరైనట్టు చూపించడంతో బిల్లు ఆగిందన్నారు. ఎంక్వైరీ చేయగా లక్ష్మీ ఇందిరమ్మ ఇల్లు బిల్లు తీసుకోలేదని తేలిందని చెప్పారు.
