సిద్దిపేట రూరల్, వెలుగు: ఉమ్మడి జిల్లాలోని పలు సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు. నంగునూరు మండలం నర్మెట్ట గ్రామంలో పామాయిల్ ఫ్యాక్టరీ ప్రారంభోత్సవానికి వచ్చిన సీఎంకు 8 అంశాలతో కూడిన వినతిపత్రం అందజేసి వాటిని పరిష్కరించాలని కోరారు. గజ్వేల్ లో అసంపూర్తిగా ఉన్న రింగ్ రోడ్డును పూర్తి చేయాలని, మల్లన్నసాగర్ కింద దుబ్బాక నియోజకవర్గంలోని అన్ని గ్రామాలకు కాలువల ద్వారా నీళ్లు అందించాలని, తపాస్ పల్లి రిజర్వాయర్ నుంచి కొండపాక మండలంలోని 8 గ్రామాలకు నీళ్లు ఇవ్వాలన్నారు.
765 డీజీ హైవే హబ్సీపూర్ నుంచి దుబ్బాక అంబేద్కర్ విగ్రహం వరకు నాలుగు లేన్ల రోడ్డు వేయాలని, ఎనగుర్తి చౌరస్తా నుంచి బొప్పాపూర్ మీదుగా శిలాజీ నగర్ కు డబుల్ రోడ్డు మంజూరు చేయాలని, కొండపాకలో కొత్త పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలని, మెదక్, సంగారెడ్డి జిల్లాల్లో పామాయిల్ కంపెనీలను ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.
