నర్సంపేట, వెలుగు : వరంగల్ జిల్లా నర్సంపేట డివిజన్ పరిధిలోని ఓ మేజర్ గ్రామపంచాయతీ చెందిన 17 ఏండ్ల మైనర్ యువతికి ఇటీవల కడుపునొప్పి రావడంతో ఫ్యామిలీ మెంబర్లు వెంటనే నర్సంపేటలోని ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. సదరు యువతికి రకరకాల పరీక్షలు చేసిన డాక్టర్లు ప్రెగ్నెంట్ అని చెప్పారు. అంతేకాకుండా ప్రిస్క్రిప్షన్ చీటీపై జనరల్ ఫిజీషియన్ డాక్టర్, స్కానింగ్ సెంటర్ రిపోర్ట్ పై రేడియాలజిస్ట్ డాక్టర్ సంతకాలు చేసి ఆ యువతి ఫ్యామిలీకి ఇవ్వడంతో విస్తుపోయారు. అంతేకాకుండా వరంగల్ సిటీకి రిఫర్ చేశారు. తమ కూతురుకి పెళ్లి కాలేదని, మరే ఇతర సంబంధాలు లేవని చెప్పినా డాక్టర్లు రిపోర్ట్ ఇవ్వడంతో ఆ ఫ్యామిలీ కుంగిపోయింది.
వరంగల్ లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పూర్తిస్థాయిలో పరీక్షలు చేయించగా, బ్యాడ్ టిష్యూ ఉందని తేలింది. అక్కడ ఆపరేషన్ పూర్తయ్యాక సదరు యువతి ఫ్యామిలీ సభ్యులు నర్సంపేటకు వచ్చారు. తమ కుటుంబ సభ్యురాలికి ప్రెగ్నెంట్ అని రిపోర్ట్ ఎలా ఇచ్చారని ప్రైవేట్ స్కానింగ్ సెంటర్లోని రేడియాలిస్టుగా పనిచేస్తున్న డాక్టర్ ను చితకబాదారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. సోమవారం మధ్యాహ్నం ఇరువర్గాలు పోలీసులకు ఫిర్యాదు చేసుకున్నారు. ఫిర్యాదు అందిన మాట వాస్తవమని, దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
