టమాటాలు అమ్మి కోటీశ్వరుడైన తెలంగాణ రైతు

టమాటాలు అమ్మి కోటీశ్వరుడైన తెలంగాణ రైతు

మెదక్/ కౌడిపల్లి, వెలుగు: ధర అమాంతం పడిపోయి.. కొనే వారు లేక గంపల కొద్దీ టమాటలు రోడ్ల పక్కన పారబోసిన ఘటనలు చూశాం. పంట సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా రాక నష్టపోయిన టమాట రైతుల గురించి విన్నాం. అయితే, ఓడలు బండ్లు..బండ్లు ఓడలైనట్టు పదుల్లో ఉన్న టామాట రేటు రూ.150కి చేరగా, పక్క రాష్ట్రమైన మహారాష్ట్రలో టమాటలు పండించిన రైతులు లక్షాధికారులయ్యారు. పుణేకు చెందిన తుకారం భాగోజీ గాయకర్​ కేవలం టమాటలు అమ్మి రూ.1.50 కోట్లు సంపాదించాడు. పక్క స్టేట్​లోనే కాదు మన రాష్ట్రంలోను టమాటలు అమ్మి కోటీశ్వరుడైన రైతు ఒకరున్నారు. ఆయనే మెదక్ ​జిల్లాకు  చెందిన మహిపాల్​రెడ్డి...

కూరగాయలపైనే దృష్టి

మెదక్ జిల్లా కౌడిపల్లి మండలం మహ్మద్ నగర్ కు చెందిన రైతు బాన్స్​వాడ మహిపాల్​రెడ్డి తనకున్న 60 ఎకరాల్లో ఆధునిక పద్ధతుల్లో పంటలు సాగు చేస్తుంటాడు. ఇతర రాష్ట్రాల నుంచి కూరగాయలు దిగుమతి అవుతుండడంతో కూరగాయ పంటలపైనే దృష్టి పెట్టాడు. మూస పద్ధతిలో కాకుండా పందిరి విధానంలో, డ్రిప్​ సిస్టం ఏర్పాటు చేసి కూరగాయలు పండిస్తాడు. దీనివల్ల దిగుబడి ఎక్కువ రావడంతోపాటు, కూరగాయలు క్వాలిటీగా ఉండి మార్కెట్​లో మంచి ధర పలుకుతాయి. ఈ క్రమంలో వేసవిలో 
కూరగాయలకు ఎక్కువ డిమాండ్ ​ఉండడాన్ని గమనించి ఏప్రిల్, మే నెలల్లో 12 ఎకరాల్లో క్యాప్సికం,  12 ఎకరాల్లో టమాట సాగు చేశాడు. మేలైన యాజమాన్య పద్ధతులు అవలంబించడంతో దిగుబడి  బాగా వచ్చింది. అనూహ్యంగా టమాట ధర రూ.150 వరకు పెరిగింది. అంతేగాక మహిపాల్​ పండించిన టమాట క్వాలిటీగా ఉండడంతో ఇతర స్టేట్స్​ నుంచి దిగుమతి అయిన దానికంటే ఎక్కువ ధర పలికింది.  

రోజూ 250 బాక్స్​లు అమ్మిండు 

నెల నుంచి టమాట పంట చేతికందుతుండగా మహిపాల్​ రెడ్డి హైదరాబాద్​లోని బోయిన్ పల్లి, షాపూర్​నగర్, పటాన్​చెరు మార్కెట్​కు తరలిస్తున్నాడు. టమాటలను తెంపిన తర్వాత పొలం వద్దే కూలీలతో గ్రేడింగ్​ చేసి పాడవకుండా బాక్సుల్లో ప్యాక్ ​చేసి డీసీఎం వ్యాన్​, ట్రాలీ ఆటోల్లో మార్కెట్​కు పంపిస్తున్నాడు. రోజుకు 250 బాక్స్​ల చొప్పున నెల రోజుల్లో 8,000 బాక్స్​ల టమాటలు విక్రయించినట్టు చెప్పాడు. యావరేజ్​గా బాక్స్​కు రూ.2,300 చొప్పున ధర రాగా ఇప్పటి వరకు అమ్మిన టమాటల ద్వారా రూ.1.84 కోట్ల ఆదాయం వచ్చిందని చెప్పాడు. ఇప్పటి వరకు అమ్మింది పోను ఇంకా 8 వేల బాక్స్​ల దిగుబడి వస్తుందని తెలిపాడు. టమాట రేటు తగ్గినా కోటి ఆదాయం వస్తుందని ధీమా వ్యక్తం చేశాడు.  

లాభం వస్తదని ఊహించలే..

మన రాష్ట్రంలో టమాట పంట తక్కువ సాగు చేస్తరు. అందుకే కర్నాటక నుంచి బెంగళూర్ ​టమాట ఎక్కువగా దిగుమతి అవుతోంది. ఇది గమనించి వేరే రాష్ట్రాల నుంచి టమాట దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండకూడదని 12 ఎకరాల్లో టమాట సాగు చేసిన. పందిరి విధానంతో పాటు , నీరందించేందుకు డ్రిప్​ సిస్టం ఏర్పాటు చేసిన. ఎకరాకు రూ.2 లక్షల ఖర్చు వచ్చింది. ఆశించిన దిగుబడి రావడంతోపాటు, ఈసారి మార్కెట్​లో టమాట ధర అమాంతం పెరిగింది. దీంతో ఊహించని లాభం వచ్చింది.  

- మహిపాల్​ రెడ్డి, రైతు, మహ్మద్​నగర్, మెదక్ ​జిల్లా