
- అనుమతులు రాక మొదలు కాని పనులు
- అసంపూర్తి పనులతో ఇబ్బందులు
మెదక్/సిద్దిపేట, వెలుగు: మెదక్, సిద్దిపేట జిల్లా కేంద్రాలను అనుసంధానిస్తూ నిర్మిస్తున్న నేషనల్ హైవే పనులకు అటవీ అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఆయా ప్రాంతాల్లో అటవీ భూమిని సేకరించి, అక్కడున్న చెట్లను తొలగించి హైవే రోడ్డు పనులు చేపట్టాల్సి ఉండగా అటవీ శాఖ నుంచి క్లియరెన్స్ రాక కొన్ని కిలో మీటర్ల దూరం హైవే నిర్మాణ పనులు మొదలు కాలేదు. కాంట్రాక్ట్ గడువు ముగిసినప్పటికీ నేషనల్ హైవే అథారిటీ, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ల మధ్య సమన్వయలోపం వల్ల హైవే పనులు అసంపూర్తిగా మిగిలిపోయాయి.
మెదక్ -రామాయంపేట మధ్యలో..
మెదక్ -సిద్దిపేట నేషనల్ హైవే 765 డీజీ 69.978 కిలోమీటర్ల నిర్మాణాన్ని రూ.521.79 కోట్లతో చేపట్టారు. ఇందులో మెదక్ జిల్లా పరిధిలో మెదక్ నుంచి నిజాంపేట్ వరకు 33.676 కిలో మీటర్లు రూ.269.56 కోట్లతో చేపట్టగా 71 శాతం పనులు పూర్తయ్యాయి. మెదక్ - రామాయంపేట మధ్యలో షామ్నాపూర్, గంగాపూర్, తోనిగండ్ల, అక్కన్నపేట అటవీ ప్రాంతంలో రోడ్డు విస్తరణకు అనుమతులు రాక హైవే పనులు పెండింగ్ లో పడ్డాయి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అటవీ భూమి అవసరం, ఆ ప్రాంతంలో ఎన్ని చెట్లు తొలగించాల్సి వస్తుంది అనేది ఎప్పుడో సర్వే చేసి చెట్లకు నంబర్లు వేశారు. కానీ అనుమతులు రాకపోవడం వల్ల ఆ ప్రాంతంలో రోడ్డు పనులు చేపట్టలేకపోతున్నారు.
తొలగించే చెట్ల స్థానంలో మరో చోట మొక్కలు నాటి సంరక్షించేందుకు అటవీ శాఖకు డబ్బులు చెల్లించాల్సి ఉంది, ఆ మొత్తం కాంట్రాక్టర్ చెల్లిస్తారా లేదా హైవే అథారిటీ చెల్లిస్తుందా అనే విషయంపై స్పష్టత రాకపోవడం వల్ల పనులు జరగడం లేదు.
ఎన్ హెచ్ఏఐ అధికారులపై ఎంపీ ఆగ్రహం
హైవే పనులకు అటవీ శాఖ అనుమతుల విషయంలో నేషనల్హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు అలసత్వం వహించడంపై ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తన దృష్టికి ఎందుకు తేలేదని గురువారం మెదక్ లో జరిగిన దిశ కమిటీ మీటింగ్ లో మండిపడ్డారు. హైదరాబాద్ లో ఉన్న ఫారెస్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీ, ఢిల్లీలో ఉన్న నేషనల్ హైవే ఉన్నతాధికారులతో మాట్లాడి అనుమతులు వచ్చేలా చూస్తానని చెప్పారు.
నిలిచిన 2 కిలోమీటర్ల పనులు
సిద్దిపేట నుంచి ఎల్కతుర్తి వరకు నేషనల్ హైవే 765 డీజీ పనుల్లో అటవీ అనుమతులు లేకపోవడం ఆటంకంగా మారింది. దాదాపు రెండేళ్ల కింద ప్రారంభమైన ఈ పనులు 80 శాతం పూర్తి కాగా అటవీ అనుమతులు లభించని 2 కిలోమీటర్ల మేర ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు.
కోహెడ మండలం నాగసముద్రాల నుంచి కోహెడ క్రాసింగ్ వరకు రోడ్డు అటవీ శాఖ పరిధిలోకి వస్తుంది. దీనికి సంబంధించి అనుమతులు లభించకపోవడంతో నిర్మాణ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ ఈ రెండు కిలోమీటర్ల పరిధిలో ఎలాంటి పనులు చేయలేదు. అటవీ అనుమతులు పొందడంపై అధికారులు శ్రద్ధ చూపకపోవడంతో రెండు కిలోమీటర్ల మేర పనులు నిలిచిపోయాయి.