ఈ ర్యాలీ నిలిచేనా..? సెన్సెక్స్ 862 పాయింట్లు జంప్.. 1.03 శాతం పెరిగిన నిఫ్టీ.. కారణాలు ఇవే !

ఈ ర్యాలీ నిలిచేనా..? సెన్సెక్స్ 862 పాయింట్లు జంప్.. 1.03 శాతం పెరిగిన నిఫ్టీ.. కారణాలు ఇవే !

ముంబై:
గ్లోబల్​ మార్కెట్లలో  ర్యాలీ, యూఎస్  ఫెడ్ రేట్ల తగ్గింపు ఆశలతో ఇండియా మార్కెట్లు గురువారం (అక్టోబర్ 16) పరుగులు పెట్టాయి. ఇన్వెస్టర్లు భారీగా షేర్లు కొనడంతో  బెంచ్‌‌‌‌మార్క్ బీఎస్​ఈ సెన్సెక్స్ 862.23 పాయింట్లు ఎగిసింది. నిఫ్టీ 25,600 మార్కు దగ్గర క్లోజయింది. సెన్సెక్స్ 1.04 శాతం పెరిగి 83,467.66 వద్ద స్థిరపడింది. సెన్సెక్స్‌‌‌‌లోని 30 షేర్లలో 28 లాభాల్లో ముగియగా, రెండు మాత్రమే నష్టపోయాయి. 

డే ట్రేడింగ్​లో ఇది 1,010.05 పాయింట్లు వరకు దూసుకెళ్లి 83,615.48 గరిష్టాన్ని తాకింది. 50 షేర్ల ఎన్​ఎస్​ఈ నిఫ్టీ 261.75 పాయింట్లు (1.03 శాతం) పెరిగి 25,585.30 వద్ద ముగిసింది. సెన్సెక్స్ కంపెనీలలో కోటక్ మహీంద్రా బ్యాంక్ 2.67 శాతం పెరిగి టాప్ ​గేనర్​గా నిలిచింది.  

టైటాన్, యాక్సిస్ బ్యాంక్, అదానీ పోర్ట్స్, మహీంద్రా అండ్​ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, హెచ్‌‌‌‌డీఎఫ్‌‌‌‌సీ బ్యాంక్ ఎక్కువగా లాభపడ్డాయి. ఎటర్నల్, ఇన్ఫోసిస్ నష్టాల పాలయ్యాయి. లెమన్‌‌‌‌ మార్కెట్స్ డెస్క్ రీసెర్చ్ అనలిస్ట్ గౌరవ్ గార్గ్ మాట్లాడుతూ, "బ్యాంకింగ్ స్టాక్స్​లో ర్యాలీ, గ్లోబల్ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు రావడంతో గురువారం భారత ఈక్విటీ మార్కెట్లు లాభాలను సాధించాయి. యూఎస్ ఫెడ్ రేట్ల తగ్గింపు అవకాశం, ఐఎంఎఫ్ భారతదేశ వృద్ధి అంచనాను (2026 ఆర్థిక సంవత్సరం కోసం 6.6 శాతం) పెంచడం సెంటిమెంట్‌‌‌‌ను బలోపేతం చేసింది’’ అని అన్నారు.

ఇండెక్స్ ​లు జూమ్​

బీఎస్​ఈ స్మాల్‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.47 శాతం, మిడ్‌‌‌‌క్యాప్ ఇండెక్స్ 0.29 శాతం పెరిగాయి. అన్ని రంగాల సూచీలు లాభాల్లో ముగిశాయి. రియల్టీ 1.87 శాతం పెరిగి అత్యధిక లాభం సాధించింది. ఎఫ్ఎమ్​సీజీ (1.74 శాతం), కన్స్యూమర్ డ్యూరబుల్స్ (1.51 శాతం), బ్యాంకెక్స్ (1.27 శాతం), ఆటో (1.15 శాతం), కన్స్యూమర్ డిస్క్రిషనరీ (1.05 శాతం), కమోడిటీస్ (0.76 శాతం) లాభపడ్డాయి. బీఎస్​ఈలో 2,377 స్టాక్స్ లాభపడగా, 1,810 నష్టపోయాయి. 

ఆసియా మార్కెట్లలో దక్షిణ కొరియా కోస్పి 2.49 శాతం, జపాన్ నిక్కీ 225 సూచీ 1.27 శాతం, షాంఘై ఎస్​ఎస్​ఈ కాంపోజిట్ సూచీ 0.10 శాతం పెరిగాయి. హాంకాంగ్ హ్యాంగ్ సెంగ్ మాత్రం నష్టాల్లో ముగిసింది. యూరోప్ మార్కెట్లు లాభాల్లో ట్రేడవుతున్నాయి. బుధవారం యూఎస్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌‌‌‌మార్క్ బెంట్ క్రూడ్ ధర 0.57 శాతం పెరిగి 62.26 యూఎస్ డాలర్లకు చేరింది. ఎఫ్‌‌‌‌ఐఐలు బుధవారం రూ. 68.64 కోట్ల విలువైన ఈక్విటీలను కొనుగోలు చేశారు. డీఐఐలు కూడా రూ. 4,650.08 కోట్ల విలువైన ఈక్విటీలను కొన్నారు.

 29.5 శాతం పెరిగిన రూబికాన్ రీసెర్చ్  షేర్లు 

ఫార్మా కంపెనీ రూబికాన్ రీసెర్చ్ లిమిటెడ్ ఐపీఓ సక్సెస్​ అయింది. దీని షేర్లు గురువారం ఇష్యూ ధర రూ. 485తో పోలిస్తే 29.5 శాతం ప్రీమియంతో ముగిశాయి. బీఎస్​ఈలో ఇష్యూ ధర నుంచి 27.85 శాతం పెరిగి రూ. 620.10 వద్ద ఈ స్టాక్ ట్రేడింగ్ ప్రారంభించింది. ఒకదశలో 31.75 శాతం పెరిగి రూ. 639 గరిష్టాన్ని తాకింది.  చివరకు 29.37 శాతం లాభంతో రూ. 627.45 వద్ద ముగిశాయి. ఎన్​ఎస్​ఈలో ఈ స్టాక్ 27.83 శాతం జంప్‌‌‌‌తో రూ. 620 వద్ద ప్రయాణం మొదలుపెట్టింది. చివరకు 29.52 శాతం పెరిగి రూ. 628.20 వద్ద ముగిసింది. కంపెనీ మార్కెట్ వాల్యుయేషన్ రూ. 10,337.26 కోట్లుగా ఉంది.