- పీడీఎస్ బియ్యం దందాకు చెక్
- పేకాట రాయుళ్ల ఆటకట్టిస్తున్రు
మెదక్, వెలుగు: అక్రమాలపై జిల్లా టాస్క్ ఫోర్స్ పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అక్రమ రేషన్ బియ్యం దందా, పేకాట, బొమ్మ బొరుసు, బెల్ట్ షాప్ ల్లో మద్యం విక్రయాలు జోరుగా సాగుతున్నా స్థానిక పోలీసులు పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కానీ సమాచారం తెలిసిన వెంటనే జిల్లా ఎస్పీ ఆధీనంలో పనిచేసే టాస్క్ ఫోర్స్ పోలీసులు స్పందించి దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నారు. ఇటీవల జిల్లాలో వివిధ ప్రాంతాల్లో అక్రమ రవాణా చేస్తున్న, నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని పెద్ద మొత్తంలో పట్టుకున్నారు.
ఓ చోట అక్రమంగా రవాణా చేస్తున్న యూరియా లారీని పట్టుకున్నారు. అనేక చోట్ల పేకాట స్థావరాలపై దాడులు చేసి పేకాట రాయుళ్లను పట్టుకుని, పెద్ద మొత్తంలో డబ్బులు స్వాధీనం చేసుకున్నారు. పలుచోట్ల బొమ్మ బొరుసు ఆడుతున్న వారి ఆటకట్టించారు. గ్రామాల్లో బెల్ట్ షాప్ పై దాడి చేసి అక్రమంగా అమ్ముతున్న మద్యం పట్టుకున్నారు.
పేకాట స్థావరాలపై..
ఈ నెల 20న మండల కేంద్రమైన చేగుంటలో పేకాట స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడిచేసి8 మందిని అదుపులోకి తీసుకుని రూ.58,060 నగదు, 7 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. 14న పాపన్నపేట మండలం యూసుఫ్‌పేటలో బొమ్మా బొరుసు ఆడుతున్నట్టు సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు వెళ్లి దాడిచేసి 12 మంది జూదరులను అదుపులోకి తీసుకుని, రూ.14 వేల నగదు, 9 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.
10న రామాయంపేటలోని సెవన్ హిల్స్ స్విమ్మింగ్ పూల్ వద్ద పేకాట ఆడుతున్నట్టు సమాచారం రాగా దాడిచేసి ఏడుగురిని అరెస్ట్ చేసి రూ.7,372 నగదు, 7 ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. గతనెల 28న నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి అయ్యన్న ఫామ్ హౌస్ పేకాట ఆడుతున్న ఐదుగురిని పట్టుకుని రూ.3,800 నగదు, ఫోన్లు, బైక్ లు స్వాధీనం చేసుకున్నారు.
బెల్ట్ షాప్‌లపై..
మనోహరాబాద్ మండలం కాళ్లకల్‌లో కిరాణా షాప్‌లో మద్యం అమ్ముతున్నట్టు సమాచారం రాగా ఈ నెల 8న టాస్క్ ఫోర్స్ పోలీసులు ప్రభాకర్ గౌడ్ కిరాణ షాపులో తనిఖీలు నిర్వహించి 120 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నారు. 7న మెదక్ మండలం తిమ్మానగర్ లో రవీందర్ కిరాణా షాప్ మీద దాడి చేసి 76 లీటర్ల మద్యం పట్టకున్నారు.
నిఘా వేసి.. దాడి చేసి..
టాస్క్ ఫోర్స్ పోలీసులు ఈ నెల 25న తెల్లవారు జామున కొల్చారం మండలం పోతంశెట్టిపల్లి గ్రామ పరిధిలోని ఎడుపాయల టీ -జంక్షన్ వద్ద, డీసీఎం వ్యాన్ లో అక్రమంగా తరలిస్తున్న 370 పీడీఎస్ బియ్యం సంచులను పట్టుకున్నారు. 23న మెదక్ మండలం రాజ్‌పల్లి సమీపంలోని మల్బరీ ఫామ్ హౌజ్‌లో అక్రమంగా నిల్వచేసిన 22 క్వింటాళ్ల పీడీఎస్ బియ్యం పట్టుకున్నారు. 13న శివ్వంపేట మండలం పాంబండ గ్రామంలో శేఖర్‌గౌడ్ అనే వ్యక్తి తన పౌల్ట్రీఫామ్ పక్కనున్న ఇంట్లో పీడీఎస్ బియ్యం నిల్వచేసినట్టు సమాచారం రాగా దాడిచేసి 12 బియ్యం సంచులను స్వాధీనం చేసుకున్నారు.
10న వెల్దుర్తిలో టాటా ఎస్ వాహనంలో తరలిస్తున్న 37 క్వింటాళ్ల బియ్యాన్ని పట్టుకుని వాహనాన్ని సీజ్ చేశారు. 6న అల్లాదుర్గం మండల పరిధిలో 60 పీడీఎస్ బియ్యం సంచులు, టేక్మాల్ మండల పరిధిలో 40 పీడీఎస్ బియ్యం సంచులు, అక్రమంగా రవాణా చేస్తున్న రెండు వాహనాలను అదుపులోకి తీసుకున్నారు. గత నెల 29న పెద్ద శంకరంపేట్ మండలం ఉత్తులూరు గ్రామ పరిధిలో 40 పీడీఎస్ బియ్యం సంచులను అక్రమంగా తరలిస్తున్న మహీంద్రా బొలెరో వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు.
అక్రమార్కులపై కఠిన చర్యలు
జిల్లాలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా, నిల్వ, విక్రయాలకు పాల్పడే వారిపై కఠినమైన చర్యలు తప్పవు. చట్టవ్యతిరేక కార్యకలాపాలకు ఎవరూ పాల్పడకూడదు. ఇలాంటి ఘటనల గురించి తెలిస్తే ప్రజలు వెంటనే పోలీసులకు సమాచారం అందించి సహకరించాలి. అక్రమాల సమాచారం ఇచ్చే వారి పేర్లు గోప్యంగా ఉంచుతాండీవీ శ్రీనివాసరావు, మెదక్ జిల్లా ఎస్పీ
