దివ్యభారత్‌ ‌‌‌‌‌‌‌లో మెదక్‌‌‌‌‌‌‌‌ కు చోటు..టూరిస్ట్ ప్లేస్‌‌‌‌‌‌‌‌లుగా మెదక్ చర్చి, ఖిల్లా, ఏడుపాయల 

దివ్యభారత్‌ ‌‌‌‌‌‌‌లో మెదక్‌‌‌‌‌‌‌‌ కు చోటు..టూరిస్ట్ ప్లేస్‌‌‌‌‌‌‌‌లుగా మెదక్ చర్చి, ఖిల్లా, ఏడుపాయల 
  • పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసేందుకు నీతి అయోగ్​ నిర్ణయం
  • దర్శనీయ ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలు, చారిత్రక కట్టడాలతో పుస్తకం

మెదక్​, వెలుగు: దేశంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు నీతి ఆయోగ్ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లోని దర్శనీయ స్థలాలు, ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రాలు, చారిత్రక కట్టడాలు, ప్రకృతి అందాలను పరిశీలించి 498 పేజీలతో ఓ పుస్తకాన్ని రూపొందించింది. ఇందులో మెదక్ జిల్లాలోని ప్రపంచ ప్రసిద్ధి గాంచిన మెదక్  కేథడ్రల్ చర్చి, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయల, కాకతీయుల కాలంలో శత్రు దుర్భేద్యంగా  నిర్మించిన మెదక్ ఖిల్లాకు చోటుదక్కింది. 

మౌలిక వసతుల కల్పనకు నిధులు

నీతి అయోగ్​ నివేదిక ఆధారంగా ఎంపిక చేసిన పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం వివిధ పథకాల ద్వారా నిధులు కేటాయించనుంది. స్వదేశీ దర్శన్​ 2.0 కింద పర్యాటక ప్రాంతాల్లో సందర్శకులకు మౌలిక వసతుల కల్పనకు అవసరమైన నిధులు మంజూరు చేయనుంది. దీంతోపాటు ప్రసాద్​పథకం కింద ఆధ్యాత్మిక, పుణ్యక్షేత్రాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తుంది. నీతి అయోగ్​ దివ్యభారత్​ నివేదికలో పొందుపర్చిన పర్యాటక ప్రాంతాలకు రవాణా సౌకర్యాలు, టూరిస్టులకు వసతి సదుపాయాలు కల్పిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయా ప్రాంతాలను పర్యాటక అభివృద్ధికి అవసరమైన నిధులు కేటాయించనుంది.

ఆసియాలో రెండో అతిపెద్ద చర్చి 

మెదక్​ పట్టణంలోని కేథడ్రల్‌‌‌‌‌‌‌‌ చర్చి ఆసియా ఖండంలో రెండో అతిపెద్దది. లోక రక్షకుడుగా కీర్తించే ఏసయ్య సన్నిధిగా, క్రైస్తవుల ఆరాధన మందిరంగా, మెదక్ మహాదేవాలయంగా, ప్రముఖ టూరిస్ట్ ప్లేస్ గా దేశ, విదేశాల్లో గుర్తింపు పొందిన ఈ చర్చి అతి సుందరమైన నిర్మాణంగా గుర్తింపు పొందింది. ఈ చర్చి నిర్మాణానికి 1914లో పునాది రాయి వేయగా.. 1924లో పూర్తయింది. అప్పటి నుంచి ఇప్పటివరకు మెదక్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

వందేళ్లు గడిచినా చర్చి చెక్కు చెదరకపోవడం విశేషం. ఇక కాకతీయ చివరి రాజు రెండో ప్రతాప రుద్రుడు మెదక్​ఖిల్లాను నిర్మించారు. సహజ సిద్ధంగా ఏర్పడిన ఎత్తైన గుట్టపై నిర్మించిన ఈ కోటలో నాటి సైనిక అవసరాల కోసం డంగుసున్నం, రాళ్లతో రక్షణ గోడ, నలువైపులా సైనికులు పహారా కాసేందుకు రాతితో బురుజులు నిర్మించారు. కాలక్రమంలో గోడ, బురుజులు చాలా వరకు శిథిలమయ్యాయి. ఖిల్లాను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంలో భాగంగా నాటి బందీఖానాకు (ముబారక్ మహల్) రిపేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసి అందులో హరిత హోటల్​ ఏర్పాటు చేశారు. మెదక్​ ఖిల్లా సందర్శనకు వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు వస్తుంటారు. 

దేశంలో రెండో వనదుర్గా ఆలయం

పాపన్నపేట మండల పరిధిలో మంజీరా నది ఏడుపాయలుగా చీలి ప్రవహించే చోట, రాతి గుహలో వనదుర్గా భవాని మాత కొలువు దీరింది. సహజ ప్రకృతి అందాలతో అలరారే ఈ ప్రదేశం ఆధ్యాత్మిక కేంద్రంగానే కాక ప్రముఖ పర్యాటక కేంద్రంగా విరాజిల్లుతోంది. దేశంలో ఒక వనదుర్గా మాత ఆలయం జమ్మూకాశ్మీర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఉండగా, రెండోది ఇదే కావడం విశేషం. ఏడుపాయల ఆలయ ప్రాంగణం చుట్టూ పచ్చని చెట్లతో కళకళలాడుతూ, దొంతర్లు పేర్చినట్టుండే రాళ్ల గుట్టలతో ప్రకృతి ప్రేమికులు ఆకట్టుకుంటుంది. ఆలయ సమీపంలో మంజీరా నది మీద నిర్మించిన ఘునపూర్ ఆనకట్ట ఉంది. ఏడుపాయల వనదుర్గామాత దర్శనానికి ఏడాది పొడుగునా తెలుగు రాష్ట్రాలతోపాటు, మహారాష్ట్ర, కర్నాటక నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుంటారు.