త్యాగాల తల్లులకు కోటిన్నర మొక్కులు.. ముగిసిన మేడారం మహాజాతర

త్యాగాల తల్లులకు కోటిన్నర మొక్కులు.. ముగిసిన మేడారం మహాజాతర
  • వనప్రవేశం చేసిన సమ్మక్క, సారలమ్మ
  • నాలుగు రోజుల్లో 1.40 కోట్ల మంది భక్తుల రాక
  • అంతకు 15 రోజుల ముందు నుంచే ముందస్తు మొక్కులకు పోటెత్తిన భక్తులు

మేడారం (జయశంకర్‌‌‌‌ భూపాలపల్లి), వెలుగు: నాలుగురోజుల మేడారం మహాజాతర శనివారం సమ్మక్క, సారలమ్మ వనప్రవేశంతో ముగిసింది. వనప్రవేశం ఘట్టాన్ని చూసేందుకు భక్తులు పోటెత్తారు. ఎటుచూసినా జనమే కనిపించారు. దాదాపు కోటిన్నర మంది భక్తులు తల్లులను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. మహాజాతర నాలుగురోజులతోపాటు అంతకుముందు పదిహేను రోజుల నుంచే ముందస్తు మొక్కులకు కూడా లక్షలాది మంది మేడారానికి వచ్చారు. రెండేండ్లకు మళ్లా వస్తామంటూ భక్తులకు దీవెనార్తులు ఇస్తూ చిలుకలగుట్టకు సమ్మక్క, కన్నెపల్లికి సారలమ్మ వెళ్లిపోయారు. వారి వెంటే పగిడిద్దరాజు, గోవిందరాజులు తమ యుద్ధ స్థానాలకు బయలుదేరారు. 

గుండెలనిండా నింపుకున్న దైవత్వంతో భక్తులు ఇంటి బాటపట్టారు. నాలుగు రోజుల జాతరలో 1.40 కోట్ల మంది భక్తులు వచ్చారని అధికారులు అంచనా వేశారు. అమ్మవార్లకు మొక్కులు చెల్లించుకున్నారు. జాతరలో భాగంగా లగ్జరీ టెంట్లు, ఎకోటెంట్లు, హరిత హోటల్‌‌‌‌ వంటి ఆధునిక సౌకర్యాలు ఏర్పాటు చేశారు. జాతర నిఘాలో సీసీ, డ్రోన్‌‌‌‌ కెమెరాలను వినియోగించారు. అసెంబ్లీ స్పీకర్‌‌‌‌‌‌‌‌ గడ్డం ప్రసాద్‌‌‌‌‌‌‌‌ శనివారం వనదేవతలను దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. 

చుట్టూ చీరలు అడ్డుగా కట్టి పూజలు చేసి..

తల్లుల వనప్రవేశంలో భాగంగా శనివారం సాయంత్రం 5 గంటలకు మేడారంలోని సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెల వద్ద పూజలు చేశారు. డోలు వాయిద్యాలు, బూరలు లయబద్ధంగా ఊదుతూ గిరిజన పూజారులు (వడ్డెరలు) గద్దెల వద్దకు చేరుకున్నారు. ఎవరికీ కనిపించకుండా చుట్టూ చీరలు అడ్డుగా పెట్టారు. సుమారు అద్దగంట పాటు పూజా కార్యక్రమం కొనసాగించారు. తొలుత పూజారులు సిద్ధబోయిన మునేందర్‌‌‌‌‌‌‌‌, కొక్కెర కృష్ణయ్య, చందా బాబురావు, సిద్ధబోయిన మహేశ్‌‌‌‌‌‌‌‌, సిద్ధబోయిన లక్ష్మణ్‌‌‌‌‌‌‌‌ రావు  కుంకుమభరిణె రూపంలో ఉన్న సమ్మక్కను తీసుకుని గద్దె దిగారు. ఆ తర్వాత విడిది గృహం వద్దకు చేరుకుని నాగులమ్మను తాకి అక్కడ్నుంచి వేగంగా చిలుకలగుట్ట వైపు వెళ్లిపోయారు. ఆ తర్వాత పడిగె రూపంలో ఉన్న పగిడిద్దరాజును పూజారి పెనక బుచ్చిరామయ్య, గోవిందరాజును పూజారి దబ్బకట్ల గోవర్ధన్‌‌‌‌‌‌‌‌ మరికొందరు పూజారులు తీసుకొని గద్దెల దగ్గర నుంచి కదిలారు. చివరిగా సారలమ్మను పూజారులు కాక సారయ్య, వెంకటేశ్వర్లు, కిరణ్‌‌‌‌‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌, కనకమ్మ, భజంగరావు, లక్ష్మీ బాయి తీసుకుని కన్నెపల్లికి బయల్దేరారు. దేవతలను గద్దెకు చేర్చే క్రమంలో పోలీసులు ఏ విధమైన రక్షణ కల్పించారో అంతే కట్టుదిట్టమైన రక్షణ మధ్య దేవతలను వనానికి సాగనంపారు.    

4 రోజుల్లో కోటి 40 లక్షల మంది భక్తులు

ఈ సారి మేడారం మహాజాతరకు వచ్చిన భక్తుల సంఖ్య పెరిగింది. గతంలో నాలుగు రోజుల జాతరకు కోటి మంది భక్తులు వస్తే ఈ సారి కోటి 40 లక్షల మంది హాజరయ్యారని మంత్రి సీతక్క, ములుగు జిల్లా కలెక్టర్‌‌‌‌‌‌‌‌ ఇలా త్రిపాఠి ప్రకటించారు. శనివారం కూడా 20 లక్షల మందికి పైగా భక్తులు మేడారం వచ్చి అమ్మవార్లను దర్శించుకున్నట్లుగా ఆఫీసర్లు ప్రకటించారు. భక్తుల సంఖ్య పెరిగినప్పటికీ వాళ్లకు అమ్మవార్ల దర్శనం కల్పించడంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చేసినట్లుగా ఆఫీసర్లు తెలిపారు. మహాజాతర ప్రారంభంలో కనిపించే ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ జాం సమస్య ఈసారి భక్తులు ఇండ్లకు వెళుతున్నప్పుడు కలిగింది. బుధవారం నుంచి శుక్రవారం వరకు మేడారం వచ్చి విడిది చేసిన భక్తులు శుక్రవారం ఇంటికి వెళ్తున్న క్రమంలో మేడారం‒తాడ్వాయి రూట్‌‌‌‌‌‌‌‌లో ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ జాం అయింది. ఉదయం 11 గంటల నుంచి అర్ధరాత్రి 12 గంటల దాకా భక్తులు ఇబ్బందులు పడ్డారు. సుమారు నాలుగైదు గంటల పాటు ట్రాఫిక్‌‌‌‌‌‌‌‌ జాంలో ఇరుక్కుపోవాల్సి వచ్చింది. 

ఖాళీ అవుతున్న మేడారం!

మేడారం జాతర ముగియడంతో భక్తులు ఇంటి బాట పట్టారు. మళ్లీ రెండేండ్ల తర్వాత  మహాజాతర జరగనుంది. దీంతో మేడారం ప్రాంతం ఖాళీ అవుతున్నది. గత నాలుగు రోజుల పాటు గుడారాలు వేసుకొని అమ్మవార్ల సన్నిధిలో ఉన్న భక్తులు, వ్యాపారస్తులు ఇప్పుడు ఇంటి ముఖం పట్టారు.  షాపులన్నీ ఖాళీ చేసుకొని వెళ్లిపోతున్నారు. వచ్చే బుధవారం నిర్వహించే తిరుగువారం పండుగ వరకు ప్రతీ రోజు ఎంతో కొంత మంది మేడారం వచ్చి తల్లులకు మొక్కులు చెల్లిస్తారని దేవాదాయ శాఖ ఆఫీసర్లు, గిరిజన పూజారులు చెప్తున్నారు.