
- అదేరోజు గద్దెకు చేరనున్న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు
- 29న గద్దెలపైకి సమ్మక్క.. 30న మొక్కులు
- 31న అమ్మవార్ల వన ప్రవేశం
జయశంకర్‌భూపాలపల్లి/తాడ్వాయి, వెలుగు: మేడారం మహాజాతర తేదీలు ఖరారయ్యాయి. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31వ తేదీ వరకు జాతర నిర్వహించాలంటూ మేడారం పూజారులు ప్రభుత్వానికి సిఫార్సు చేశారు. మేడారం పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు అధ్యక్షతన బుధవారం ఆదివాసీ పూజారులు సమావేశమయ్యారు. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 3 రోజుల పాటు జాతర నిర్వహించనున్నట్లు ప్రకటించారు. మొదటి రోజైన జనవరి 28 బుధవారం రోజున కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజులు, పూనుగొండ్ల నుంచి పగిడిద్దరాజు మేడారంలోని గద్దెలపైకి చేరుకోనున్నారు. 29న చిలుకలగుట్ట నుంచి సమ్మక్కను తీసుకొచ్చి గద్దెపై ప్రతిష్ఠిస్తారు. 30న భక్తులు మొక్కులు సమర్పించనున్నారు. 31న సాయంత్రం 6 గంటలకు అమ్మవార్లను తిరిగి వనప్రవేశం చేయడంతో మహా జాతర ముగియనున్నది. జాతర నిర్వహణకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్ధబోయిన జగ్గారావు ప్రభుత్వాన్ని కోరారు.