ఫిబ్రవరి 16 నుంచి మేడారం మహా జాతర

ఫిబ్రవరి 16 నుంచి మేడారం మహా జాతర

 ఆసియాలోనే అతిపెద్దదైన మేడారం సమ్మక్క సారలమ్మ మహాజాతర వచ్చే ఏడాది ఫిబ్రవరి 16 నుంచి 19 వరకు జరుగనుంది. ఆదివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలోని మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంలో పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు పూజారుల (వడ్డెల) సమావేశం నిర్వహించి, 2022లో జరగనున్న మహాజాతర తేదీలను నిర్ణయించారు. ఈ మేరకు ఫిబ్రవరి 16న కన్నెపల్లి నుంచి సారలమ్మ, కొండాయి నుంచి గోవిందరాజు, పునుగొండ్ల నుంచి పగిడిద్దరాజును గద్దెలపైకి తీసుకు వస్తారు. 17న మేడారం సమీపంలోని చిలుకల గుట్ట నుంచి సమ్మక్క దేవతను కుంకుమ భరిణె రూపంలో గద్దెపైకి తీసుకువస్తారు. 18న అమ్మవార్లకు భక్తులు మొక్కులు సమర్పించుకుంటారు. 19న పూజలు నిర్వహించిన అనంతరం సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులను వన ప్రవేశం చేయియడంతో మహా జాతర ముగుస్తుందని పూజారులు తెలిపారు.
 
మే 1 నుంచి మేడారం దర్శనాలు నిలిపివేత

కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతుండడంతో మే 1  నుంచి 15 వరకూ మేడారం సమ్మక్క సారలమ్మ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు పూజారులు ప్రకటించారు. భక్తులు సహకరించి ఈ రోజుల్లో మేడారానికి రావద్దని కోరారు. సమావేశంలో పూజారుల సంఘం కార్యదర్శి చంద గోపాల్​ రావు, పూజారులు (వడ్డెలు) పాల్గొన్నారు.