ములుగు: మేడారం మహాజాతరకు ముందు నిర్వహించే ఎదురుపిల్ల పండుగ ములుగు సమీపంలోని గట్టమ్మ తల్లి ఆలయం వద్ద ఘనంగా జరిగింది. ఆదివాసీ నాయకపోడ్ ప్రధాన పూజారి కొత్త సురేందర్ఆధ్వర్యంలోపూజారులు, కుటుంబ సభ్యులు101బోనాలతో డోలు వాయిద్యాలు, మేళతాళాలతో 3 కిలోమీటర్లు భారీ ఊరేగింపుగా నృత్యాలు చేస్తూ ఆలయం వద్దకు తరలివచ్చారు.
ఉదయం గుడిని అలంకరించి మామిడి తోరణాలు కట్టారు. మట్టి కుండల్లో తెచ్చిన నీళ్లతో శుద్ధిచేసి పూజలు చేశారు. పూర్వపు గుడి వద్ద గుహలోకి వెళ్లిన ప్రధాన పూజారులు కొత్త సదయ్య, లక్ష్మయ్య, ఆకుల మొగిలి, అరిగెల సమ్మయ్య, ఆకుల రాజు, రఘు, కొత్త రవి, చిర్ర ముతేష్, రాజేందర్ బండారి(పసుపు) సమర్పించారు. అనంతరం బోనాలతో తరలివచ్చిన నాయకపోడ్లు తమ ఆరాధ్యదైవాలైన లక్ష్మీదేవర, కృష్ణస్వామి, పోతురాజు, పంచపాండవులు, ఎర్రగొండ రాక్షసి, తెల్లగొండ రాక్షసిలతో గట్టమ్మతల్లి ఆలయానికి చేరారు. మాఘశుద్ధ రోజుల్లో నిర్వహించే ఎదురు పిల్ల పండుగను ఆదివాసీలు యాట మొక్కులను చెల్లించి బోనాలు సమర్పించారు.
మహాజాతరకు వారం ముందు మేడారంలో మండ మెలిగే పండుగ నిర్వహించిన రోజునే గట్టమ్మ తల్లికి ఎదురుపిల్ల పండుగ చేయడం ఆనవాయితీ. ఆదివాసి నాయకపోడ్ సేవా సంఘం రాష్ట్ర నేతలు లక్కి అనిల్, భాను, రాజేందర్, రాజు, రాజేశ్, జిల్లా నేతలు, నాయకపోడ్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
