- ఆరు వేల మంది కార్మికులతో క్లీనింగ్
- జాతర ముగిసినా కొనసాగుతున్న భక్తుల రద్దీ
తాడ్వాయి, వెలుగు : మేడారంలో పారిశుధ్య పనులు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. మహాజాతర నేపథ్యంలో లక్షలాది మంది మేడారం తరలివచ్చి నాలుగు రోజుల పాటు విడిది చేయడంతో మేడారం పరిసర ప్రాంతాల్లో జంతు కళేబరాలు, ప్లాస్టిక్ వస్తువులు, చెత్తాచెదారం పేరుకుపోయాయి. దీంతో డీపీవో వెంకయ్య ఆధ్వర్యంలో ఆరు వేల మంది పారిశుద్ధ్య కార్మికులతో క్లీనింగ్ పనులు చేపట్టారు. కార్మికులు ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు షిఫ్ట్‌ల వారీగా చెత్తను సేకరిస్తున్నారు.
దీనిని ట్రాక్టర్ల ద్వారా ఎప్పటికప్పుడు డంపింగ్ యార్డ్‌కు తరలిస్తున్నారు. బుధవారం జరిగే తిరుగువారం పండుగకు భక్తుల భారీ సంఖ్యలో వచ్చే అవకాశం ఉన్నందున ప్రధానంగా చిలుకలగుట్ట, జంపన్న వాగు, స్నానఘట్టాలు, ఆర్టీసీ బస్టాండ్ తదితర ప్రాంతాల్లో స్పీడ్‌గా పనులు చేయిస్తున్నట్లు డీపీవో వెంకయ్య తెలిపారు.
కొనసాగుతున్న భక్తుల రద్దీ
మేడారం జాతరకు ఓ వైపు భక్తులు ఇంకా తరలివస్తుండగా.. మరో వైపు చిరు వ్యాపారులు తమ గుడారాలను ఖాళీ చేసి వెనుదిగురుతున్నారు. సోమవారం భారీ సంఖ్యలో తరలివచ్చిన భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం అమ్మవార్లను దర్శించుకున్నారు.
ఎత్తు బంగారం, చీరె, సారె, పూలు, పండ్లు సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. సోమవారం మూడు లక్షల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు ఈవో వీరస్వామి తెలిపారు. మరో వైపు మహాజాతర ముగియడంతో మేడారంలో చిన్నచిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వ్యాపారులు తమ గుడారాలను ఖాళీ చేసి వెళ్లిపోతుండడంతో మేడారం నిర్మానుష్యంగా మారుతోంది.
కొత్త హుండీల ఏర్పాటు
మేడారం మహా జాతర సందర్భంగా మొత్తం 788 హుండీలను ఏర్పాటు చేశారు. జాతర ముగియడంతో వాటిని ఆర్టీసీ కార్గోలో హనుమకొండలోని టీటీడీ కల్యాణమండపానికి తరలిస్తున్నారు. సోమవారం గద్దెల వద్ద 40 కొత్త హుండీలను ఏర్పాటు చేశారు.
