తిరుపతి, కుంభమేళా తరహాలో మేడారం అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి

తిరుపతి, కుంభమేళా తరహాలో మేడారం అభివృద్ధి : సీఎం రేవంత్ రెడ్డి
  • కోట్లాది మంది భక్తులు దర్శించుకునేలా ఏర్పాట్లు: సీఎం రేవంత్ రెడ్డి 
  •     జంపన్నవాగులో ఎల్లకాలం నీళ్లుండేలా రామప్ప నుంచి ప్రత్యేక పైప్‌‌‌‌లైన్ 
  •     మూడేండ్ల కింద ఇచ్చిన మాట నిలబెట్టుకున్న 
  •     మేడారంలో కేబినెట్ మీటింగ్‌‌‌‌తో కొత్త చరిత్ర  
  •     నేను మరణించినా మేడారాన్ని అభివృద్ధి చేశాననే సంతృప్తి మిగుల్తది 
  •     వంద రోజుల్లోనే పని పూర్తి చేశారని మంత్రులపై ప్రశంసలు 

వరంగల్‍/ములుగు, వెలుగు:  తిరుపతి, కుంభమేళా తరహాలో మేడారాన్ని అభివృద్ధి చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. సమ్మక్క, సార క్కను కోట్లాది మంది భక్తులు కొలుస్తారని.. వాళ్లందరూ తల్లులను దర్శించుకునేలా ఏర్పాట్లు చేస్తామని చెప్పారు. ‘‘మేడారం భవిష్యత్తులో తిరుపతి స్థాయిలో నిత్యం భక్తులతో కళకళలాడుతుంది. దీన్ని ఉత్తరాదిలో జరిగే కుంభమేళా తరహాలో తీర్చిదిద్దుతాం. 

మేడారం జాతరంటే దక్షిణాది కుంభమేళా అనేలా నిర్వహిస్తాం. కేవలం ఆదివాసీ గిరిజనులే కాకుండా ప్రపంచ నలుమూలల నుంచి గిరిజనేతరులు సైతం తరలివచ్చేలా సౌలతులు కల్పిస్తాం” అని ప్రకటించారు. సీఎం రేవంత్‍రెడ్డి ఆదివారం తన కుటుంబసభ్యులతో కలిసి మేడారం వచ్చారు. 

ఈ సందర్భంగా ఇక్కడ చేపట్టిన అభివృద్ధి పనులను, జంపన్న వాగు వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. ఆ తర్వాత కేబినెట్ మీటింగ్ నిర్వహించారు. అనంతరం ఆదివాసీ సాంస్కృతిక కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. ఇకపై జంపన్న వాగులో నిత్యం నీళ్లు ఉండేలా శాశ్వత పరిష్కారం చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. రామప్ప నుంచి లక్నవరం, అక్కడి నుంచి జంపన్న వాగు వరకు ప్రత్యేక పైప్‌‌‌‌లైన్ వేస్తామని ప్రకటించారు. ఇందుకు అవసరమైన నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. 

మొక్కు నెరవేర్చుకున్న..   

మేడారం అభివృద్ధి చేస్తామని ఇచ్చిన మాటను తాము నిలబెట్టుకుంటున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘ఆనాడు మేడారం గడ్డ నుంచే హాత్‍ సే హాత్‍ జోడో యాత్ర చేపట్టాను. రాష్ట్రంలో ప్రజాకంఠక పాలనను అంతమొందించాలని సమ్మక్క, సారక్క తల్లులను కోరుకున్నాను. నేను అనుకున్నది నెరవేరితే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందేలా మేడారాన్ని అభివృద్ధి చేస్తానని మొక్కుకున్నాను. ఇచ్చిన మాట ప్రకారం మూడేండ్లలోపే మేడారాన్ని అభివృద్ధి చేస్తున్నాం” అని చెప్పారు. 

నాకు ఆ సంతృప్తి చాలు.. 

మనిషి ఎంత కాలం జీవించాడన్నది ముఖ్యం కాదు.. ప్రజలకు ఏం చేశాడనేదే ముఖ్యమని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ‘‘ప్రతి మనిషి 55 నుంచి 65 ఏండ్లు లేదంటే వందేండ్లు జీవిస్తారు. కానీ అతను మరణించినప్పుడు.. ప్రజలకు ఉపయోగపడే మంచి పని ఏదైనా చేశాడా? అని ఆప్తులు చూస్తే.. చాలామంది జీవితాల్లో శూన్యమే కనిపిస్తుంది. కానీ నాకంటూ మరణం వస్తే.. సమ్మక్క, సారక్క జాతరకు అద్భుతమైన ఏర్పాట్లు చేసి గిరిజనులు, గిరిజనేత సోదరులకు ఒక మంచి పుణ్యకేత్రాన్ని అందించాననే సంతృప్తి మిగులుతుంది” అని భావోద్వేగంతో మాట్లాడారు. ఈ అవకాశం తనకు దక్కడం పూర్వజన్మ సుకృతమని అన్నారు.  

వంద రోజుల్లోనే పనులు పూర్తి చేశాం.. 

వంద రోజుల్లోనే మేడారం పనులు పూర్తి చేశామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మంత్రులపై ప్రశంసలు కురిపించారు. ‘‘జాతర పనులను కేవలం 100 రోజుల్లో పూర్తి చేయాలని ఇంజనీర్లతో చెప్పినప్పుడు.. అందరూ ఆశ్చర్యపోయారు. ఆ సమయంలో వరంగల్ జిల్లా ఇన్‌‌‌‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి బాధ్యతలు అప్పగిస్తూ.. ‘ఆరునూరైనా సరే జనవరి 28 నాటికి పనులు పూర్తి కావాలి. నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు’ అని చెప్పాను. ఆ రోజు నుంచి పొంగులేటి వెనుదిరిగి చూడకుండా ఎంతో కష్టపడి దగ్గరుండి సమయానికి పనులను పూర్తి చేయించారు. 

సాధారణంగా ఆర్థిక మంత్రి అంటే ఖజానాను పిడికిలి బిగించిపట్టుకుంటారు. కానీ భట్టి ఈ విషయంలో చాలా ఉదారంగా వ్యవహరించారు. మేడారం పనుల కోసం అడిగిన వెంటనే నిధులు ఇచ్చారు” అని కొనియాడారు. ‘‘ఈసారి జాతర ఏర్పాట్లు ఇద్దరు ఆడబిడ్డల నేతృత్వంలో జరగడం దైవనిర్ణయంగా భావిస్తున్నాను. మంత్రులు సీతక్క, కొండా సురేఖ.. ఈ బాధ్యతలు తీసుకోవడం యాదృచ్ఛికమే అయినా అద్భుతం. తల్లిబిడ్డలైన సమ్మక్క-సారక్క జాతరను ఈ ఇద్దరు ఆడబిడ్డలు దగ్గరుండి నిర్వహించడం అరుదైన సందర్భం. 

వాళ్లిద్దరూ గొప్పగా ఏర్పాట్లు చేశారు. ఈ అద్భుతమైన అవకాశాన్ని ఆ దేవుడు నాకు, నా సోదరీమణులకు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది” అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌‌‌‌ రెడ్డి, అడ్లూరి లక్ష్మణ్‍, పొన్నం ప్రభాకర్‍, వివేక్‍ వెంకటస్వామి, ఉత్తమ్‍ కుమార్‍రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌‌‌‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, అజారుద్దీన్‍, సీఎం సలహాదారు వేం నరేందర్‍రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

సరికొత్త చరిత్రకు శ్రీకారం.. 

చరిత్రలో తొలిసారి హైదరాబాద్ బయట రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగిందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ‘‘వన దేవతల సాక్షిగా సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టాం. గతంలో ఉమ్మడి ఏపీలో గానీ, తెలంగాణలో గానీ హైదరాబాద్ బయట ఎన్నడూ మంత్రివర్గ సమావేశం జరగలేదు. కానీ మేడారంలో కేబినెట్ మీటింగ్ పెడదామని నేను ప్రతిపాదించగానే, మంత్రివర్గ సహచరులు అందరూ అంగీకరించారు. ప్రజల వద్దకు వెళ్లడం చాలా బాగుంటుందని మంత్రులంతా సహకరించారు. వాళ్లందరికీ కృతజ్ఞతలు” అని పేర్కొన్నారు.  

కోట్లాది మంది గుండెల్లో  రేవంత్ నిలిచిపోతరు: సీతక్క  

ములుగు నియోజకవర్గ పరిధిలో 100 కిలోమీటర్ల గోదావరి పరీవాహక ప్రాంతమున్నా, ఈ ప్రాంతానికి చుక్కనీరు రాలేదని.. రూ.143 కోట్లతో ములుగుకు గోదావరి జలాలు అందించాలని కేబినెట్ మీటింగ్‌‌‌‌లో నిర్ణయం తీసుకున్నామని మంత్రి సీతక్క తెలిపారు. గతంలో ఇదే గోదారి జలాల కోసం పాదయాత్ర చేస్తే ఎవరూ పట్టించుకోలేదన్నారు. ‘‘మాజీ సీఎం కేసీఆర్‍ తన ఇలవేల్పు అయిన ఆలయం కట్టించారు. కానీ సీఎం రేవంత్‍రెడ్డి సకల జనుల భావాలు, భక్తుల భావోద్వేగాలను గౌరవించి మేడారాన్ని అభివృద్ధి చేశారు. కనీవినీ ఎరగని రీతిలో జాతరకు ఏర్పాట్లు చేసిన ఆయన.. కోట్లాది మంది భక్తుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు” అని అన్నారు. 

అభివృద్ధి పనులు దశాబ్దాలు గుర్తుంటయ్: సురేఖ 

800 ఏండ్ల చరిత్ర కలిగిన మేడారం ఆలయాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచన గతంలో ఎవరికీ రాలేదని మంత్రి కొండా సురేఖ అన్నారు. ‘‘సీఎం రేవంత్‍రెడ్డి చేపట్టిన ఈ పనులు రాబోయే  వెయ్యేండ్ల పాటు కండ్ల ముందు ఉంటాయి. మేడారం ఆలయ అభివృద్ధిలో నాకు, సీతక్కకు అవకాశం దక్కడం గౌరవంగా భావిస్తున్నం. ఈ అవకాశం కల్పించిన సీఎం రేవంత్‍రెడ్డికి ధన్యవాదాలు” అని పేర్కొన్నారు.