వనమంతా జనం.. సమ్మక్క, సారలమ్మ దర్శనం కోసం పోటెత్తిన భక్తులు

వనమంతా  జనం.. సమ్మక్క, సారలమ్మ దర్శనం కోసం  పోటెత్తిన భక్తులు
  • ఒక్కరోజే 50 లక్షల మందికిపైగా జాతరకు హాజరు
  • భక్తులతో కిక్కిరిసిపోయిన గద్దెలు.. జనసంద్రమైన జంపన్న వాగు
  • అమ్మవార్లను దర్శించుకున్న గవర్నర్, మంత్రులు
  • వన దేవతల దర్శనం తర్వాత భక్తుల తిరుగుముఖం
  • నేడు తల్లుల వన ప్రవేశంతో మహాజాతర ముగింపు

వరంగల్‍/ ములుగు/ తాడ్వాయి, వెలుగు: సమ్మక్క–సారలమ్మ గద్దెల మీదకు రావడంతో మేడారం జనసంద్రమైంది. జంపన్న వాగులో పుణ్య స్నానాలు ఆచరించిన భక్తులు.. గద్దెల వద్ద అమ్మవార్లకు బంగారంతో మొక్కులు సమర్పించుకున్నారు. శుక్రవారం ఒక్క రోజే సుమారు 50 లక్షల మంది వన దేవతలను దర్శించుకున్నారు. ఇద్దరు తల్లులతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు గద్దెపైకి చేరడంతో భక్తులు ఒక్కసారిగా పోటెత్తారు. వనమంతా ఇసుక వేసినా రాలనంత రద్దీగా మారింది. దీంతో తాడ్వాయి–మేడారం రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. తాడ్వాయి నుంచి మేడారం వెళ్లే మార్గంలో దాదాపు 8 కిలో మీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. 3 రోజులుగా జాతరలో పాల్గొన్న జనం.. మొక్కులు చెల్లించుకుని శుక్రవారం నుంచి తిరుగు ప్రయాణం ప్రారంభించారు. వనం వీడి జనాల మధ్యకొచ్చిన సమ్మక్క, సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజులు శనివారం తిరిగి వనప్రవేశం చేయడంతో మేడారం మహాజాతర ముగియనున్నది.

ఎటు చూసినా గుడారాలే..

మేడారం మహాజాతర అధికారికంగా జనవరి 28 నుం చి 31 వరకు నిర్వహిస్తుండగా.. తల్లులు గద్దెలపై ఉన్నప్పుడే దర్శనం చేసుకోవాలని లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. గద్దెల చుట్టూ 4 నుంచి 5 కిలో మీటర్ల మేర జంపన్నవాగు, రెడ్డిగూడెం, ఊరట్టం, నార్లాపూర్‍ మొదలు చింతల్‍ క్రాస్‍ వరకు తల్లుల దర్శనం కోసం వచ్చిన భక్తుల గుడారాలు వేసుకుని బస చేస్తున్నారు. దీంతో మేడారంలో ఎటుచూసినా జనాలే దర్శనమిస్తున్నారు. తల్లులను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్న భక్తులతో గద్దెల ప్రాంతం చుట్టూ అర కిలోమీటర్ వరకు నిలబడేందుకు కూడా వీల్లేని పరిస్థితి నెలకొన్నది.

కరెంట్‍పోవడంతో.. చీకట్లో గందరగోళం

గురువారం రాత్రి దాదాపు 10 గంటలకు సమ్మక్కతల్లి గద్దెమీదకు చేరింది. ఈ అపూరూప ఘట్టాన్ని చూసేందుకు మూడునాలుగు రోజులుగా ఎదురుచూసిన భక్తులు ఒక్కసారిగా గద్దెల ప్రాంతానికి చేరుకున్నారు. దీంతో టీటీడీ భవనం పక్కనున్న సాధారణ, వీఐపీ, వీవీఐపీ క్యూలైన్ల నుంచి జంపన్నవాగు వైపు, ఆర్టీసీ జంక్షన్ వైపు తొక్కిసలాట జరిగింది. అదేసమయంలో 2 సార్లు విద్యుత్‍ అంతరాయం ఏర్పడటంతో పిల్లలు, వృద్ధులతో జాతరకొచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంత్రి అడ్లూరి లక్ష్మణ్‍ కాన్వాయ్‍ భక్తుల మధ్య చిక్కుకుని ముందుకు కదల్లేకపోయింది. అదేటైంలో రద్దీలోంచి వెళ్తున్న వీఐపీల వాహనాలపై భక్తులు దాడులు చేశారు.

గవర్నర్‍ జిష్ణుదేవ్‍ వర్మ, ప్రముఖుల మొక్కులు

గవర్నర్‍ జిష్ణుదేవ్‍ వర్మ శుక్రవారం మేడారంలో సమ్మక్క, సారలమ్మలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మంత్రి సీతక్క తనతల్లి సమ్మక్క, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి దర్శనం చేసుకున్నారు. దేవాదాయశాఖ మంత్రి కొండా సురేఖ వనద దేవతలను దర్శించుకున్నారు. తల్లులకు పట్టువస్త్రాలు సమర్పించారు. తులభారంలో బంగారు బెల్లాన్ని మొక్కుగా చెల్లించారు. మాజీ గవర్నర్‍ దత్తాత్రేయ, ఎమ్మెల్సీ కవిత, మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్‍, ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు, బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్‍ గ్యారత్‍ వెన్‍ ఒవెన్‍, పొలిటికల్‍ ఎకనామిక్‍ అడ్వైజర్‍ నళిని రఘురాం, డీజీపీ శివధర్‍రెడ్డి, జైళ్ల శాఖ డీజీ సౌమ్య మిశ్రా, హైడ్రా కమిషనర్‍ రంగనాథ్‍, మాజీ మంత్రి దయాకర్‍రావు, సత్యవతి రాథోడ్‍ తదితర ప్రముఖులు తల్లుల గద్దెల వద్ద మొక్కులు చెల్లించుకున్నారు. 

నేటితో ముగియనున్న మహాజాతర

మేడారం మహాజాతర ఈ నెల 28న ప్రారంభం కాగా.. తల్లుల వనప్రవేశంతో శనివారం ముగియనున్నది. బుధవారం కన్నెపల్లి నుంచి సారలమ్మ, మహబూబా బాద్‍ జిల్లా గంగారం మండలం పూను గొండ్ల నుంచి పగిడిద్దరాజు, ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం కొండాయి నుంచి గోవిందరాజు గద్దెలపై కి చేరారు. 29న చిలుకలగుట్ట నుంచి సమ్మక్కతల్లిని ప్రధాన గద్దెమీద ప్రతిష్టిం చారు. శుక్రవారం సమ్మక్క సారలమ్మతో పాటు పగిడిద్దరాజు, గోవిందరాజు భక్తులకు దర్శనభాగ్యం ఇచ్చారు. ఇద్దరు తల్లులు గద్దెలపై కొలువుదీరి దర్శనం కల్పించడంతో భక్తులు ఒక్కొక్కరుగా గూడారాలు ఖాళీచేసి ఇంటిదారి పట్టారు. శనివారం నలుగురు తిరిగి వనంలోకి చేరడంతో జాతర ముగుస్తుంది.