నెలలోపు మేడారం పనులు పూర్తి చేయాలి : అధికారులకు సీతక్క సూచన

నెలలోపు మేడారం పనులు పూర్తి చేయాలి : అధికారులకు సీతక్క సూచన
  • జాతరను సక్సెస్ చేయాలి
  • మేడారం మహాజాతర ప్రాంతాల్లో మంత్రి పర్యటన

తాడ్వాయి, వెలుగు :  ఆసియాలోనే అతిపెద్ద గిరిజన మహా జాతరకు ఆర్థిక సాయం  అందించడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని రాష్ట్ర పంచాయతీ రాజ్, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క తెలిపారు. శనివారం ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం మహా జాతర పరిసర ప్రాంతాల్లో ఆమె పర్యటించారు. మేడారం భక్తులు చేరుకునే రహదారులను పరిశీలించారు. ములుగు నుంచి బయలుదేరిన మంత్రి.. నేషనల్  హైవే పస్రా గ్రామ శివారులో ఉన్న గుండ్ల వాగు బ్రిడ్జిని పరిశీలించారు. అక్కడి నుంచే మేడారం రహదారిలో ఉన్న దెయ్యాల వాగు బ్రిడ్జిని పరిశీలించారు. గత వర్షాలకు దెబ్బతిన్న పస్రా నుంచి మేడారం రోడ్డును పరిశీలించారు. మేడారం చేరుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూడాలని అధికారులకు సూచించారు. పనుల విషయంలో నాణ్యత లోపిస్తే అధికారులను ఇంటికి పంపుతామని హెచ్చరించారు.

అనంతరం వెంగళాపూర్, ఎలుబాక, సమీపంలోని పార్కింగ్  స్థలాలు, జంపన్న వాగుపై ఉన్న జంట వంతెనలను మంత్రి పరిశీలించారు. వరద సమయంలో జంపన్న వాగు కోతకు గురవడంతో  ఊరటం గ్రామానికి ఎక్కువ నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి అడ్డుగా కరకట్ట నిర్మించాలని అధికారులకు మంత్రి సూచించారు. తర్వాత ములుగు జిల్లా ఎస్పీ శబరీష్,  కలెక్టర్ ఇలా త్రిపాఠి, అదనపు కలెక్టర్  శ్రీజతో కలిసి వన దేవతలను సీతక్క దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జాతరను వైభవంగా జరపాలని, జాతర విశిష్టతను ప్రపంచం నలుమూలల తెలియజేయాలన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా మేడారం జాతరకు జాతీయ పండుగ హోదా కల్పించాలని కోరామని తెలిపారు. ఈ హోదా వస్తే దేశవ్యాప్తంగా జాతరకు మరింత ఆదరణ లభిస్తుందన్నారు. అధికారులు సమన్వయంతో పనిచేసి జాతరను విజయవంతం చేయాలని సూచించారు. మంత్రి వెంట అదనపు కలెక్టర్ వేణుగోపాల్, మేడారం సర్పంచ్  చిడెం బాబురావు,  ప్రభుత్వాధికారులు, ఎండోమెంట్  సిబ్బంది, కాంగ్రెస్  నాయకులు ఉన్నారు