రూ.50 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్

రూ.50 వేలు లంచం ఇవ్వాలని డిమాండ్

హౌసింగ్ సొసైటీకి సంబంధించి వార్షిక ఆడిట్, రికవరీ రిపోర్టులు ఇవ్వడానికి లంచం డిమాండ్ చేసిన మేడ్చల్ జిల్లా కో ఆపరేటివ్ సొసైటీ అధికారులు ఇద్దరు సోమవారం ఏసీబీకి పట్టుబడ్డాడు. ఏసీబీ డీఎస్పీ సూర్య నారాయణ తెలిపిన వివరాల ప్రకారం… కుత్బుల్లాపూర్ సెగ్మెంట్ లోని దుండిగల్ మండలం బహుదూర్ పల్లి రెవెన్యూ గ్రామంలో  ఉన్న సాయినాథ్ హౌసింగ్ సోసైటీ చైర్మన్ భూమిరెడ్డి సొసైటీకి చెందిన వార్షక ఆర్థిక లావాదేవీలను ఆడిట్ చేయించాడు.

ఈ క్రమంలో గతంలో కృష్ణారావు చైర్మన్ గా ఉన్న కాలంలో జరిగిన లావాదేవీల్లో రూ.లక్షా80వేలు దుర్వినియోగం అయినట్టు తేలింది. దీంతో రికవరీ రిపోర్టు ఇవ్వాలని కోరుతూ భూమిరెడ్డి.. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కో ఆపరేటివ్ సొసైటీ జిల్లా అసిస్టెంట్ రిజిస్ట్రార్ దామోదర్, సీనియర్ ఇన్ స్పెక్టర్ చంద్రకిరణ్ ను సంప్రదించాడు.  రిపోర్టులు ఇవ్వాలంటే రూ.50 వేలు లంచం ఇవ్వాలని సొసైటీ అధికారులు దామోదర్, చంద్రకిరణ్ డిమాండ్ చేశారు.

దీంతో భూమిరెడ్డి వారికి రూ.7 వేలు ఇచ్చాడు. మొత్తం డబ్బులు ఇస్తేనే రిపోర్టులు ఇస్తామని ఆ ఇద్దరు అధికారులు చెప్పడంతో సాయినాథ్ సొసైటీ చైర్మన్ భూమిరెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారం రోజులుగా దామోదర్, చంద్రకిరణ్ పై ఏసీబీ అధికారులు నిఘా పెట్టారు. తమ ప్లాన్ ప్రకారం సోమవారం రూ.20 వేలు డబ్బులు పంపిస్తున్నాని ఏసీబీ అధికారులు భూమిరెడ్డితో చెప్పించారు.

కో ఆపరేటివ్ సొసైటీ అసిస్టెంట్ రిజిస్ట్రార్ దామోదర్.. ఆ డబ్బులను సీనియర్ ఇన్ స్పెక్టర్ కచంద్రకిరణ్ కి ఇవ్వాలని చెప్పాడు. భూమిరెడ్డి.. చంద్రకిరణ్​కు ఫోన్ చేయగా బాలానగర్ హెచ్ఏఎల్ లోని సీనియర్ సిటిజన్ సెంటర్ దగ్గరికి రావాలని చెప్పాడు. అక్కడికి వెళ్లిన భూమిరెడ్డి..చంద్రకిరణ్ కు రూ.20వేలు ఇచ్చాడు. ఆ తర్వాత చంద్రకిరణ్ దామోదర్ కి ఫోన్ చేసి డబ్బులు ముట్టాయని చెప్పాడు.

ఈ సమయంలో అక్కడే నిఘా పెట్టిన ఏసీబీ అధికారులు చంద్రకిరణ్​ను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. మరోవైపు కీసరలోని మేడ్చల్ జిల్లా ఆఫీసులో ఉన్న అసిస్టెంట్ రిజిస్ట్రార్ దామోదర్ ను అక్కడ ఉన్న మరో ఏసీబీ అధికారుల బృందం అరెస్టు చేసింది. చంద్రకిరణ్, దామోదర్ ను  కోర్టులో హాజరుపరిచి రిమాండ్ కు తరలిస్తామని ఏసీబీ అధికారులు తెలిపారు. ఏసీబీ దాడుల్లో పలువురు సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.