- వంశీమోహన్‌పై ఆదాయానికి మించి ఆస్తుల కేసు
- ఆయన నివాసం, ఆఫీసు, బంధువుల ఇండ్లలో ఏసీబీ సోదాలు.. భారీగా అక్రమాస్తులు బట్టబయలు
- తహసీల్దార్, ఆర్డీవో, స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ హోదాలో భూఆక్రమణలు
హైదరాబాద్, వెలుగు: రెవెన్యూ శాఖలో మరో అవినీతి అధికారి గుట్టురట్టు అయ్యింది. రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లాల్లోని వివాదాస్పద భూములు, ప్రభుత్వ భూములను చెరబట్టి, బంధువులతో కలిసి రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నట్టు తేలడంతో మేడ్చల్ మల్కాజ్‌గిరి స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్ మర్రి వంశీమోహన్‌ను శుక్రవారం ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. వనస్థలిపురం ఎన్‌జీవోస్ కాలనీలోని ఆయన ఇల్లు, మేడ్చల్ కలెక్టరేట్‌లోని ఆయన ఛాంబర్, గుంటూరులోని ఆయన మామ విజయ్ భాస్కర్ నివాసం సహా 11 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మొత్తం రూ.6.22 కోట్లు విలువ చేసే స్థిర, చరాస్తులను సీజ్ చేశారు. వీటి విలువ రూ.100 కోట్లకుపైగా ఉంటుందని అంచనా వేశారు. అబ్దుల్లాపూర్ మెట్ మండలం పిగ్లీపూర్‌లో తన మామ పేరిట ఫేక్ రిజిస్ట్రేషన్ చేసిన 8 ఎకరాల వ్యవసాయ భూమికి డాక్యుమెంట్లను సైతం ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్‌కుమార్‌తో కలిసి వివాదాస్పద, ప్రభుత్వ భూములను అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టు గుర్తించారు.
అక్రమంగా రెగ్యులరైజేషన్..
ఏపీలోని గుంటూరు జిల్లా అమరావతికి చెందిన వంశీ మోహన్ తండ్రి ప్రభుత్వ ఉద్యోగి. వనస్థలిపేరం ఎన్‌జీవోస్ కాలనీలో స్థిరపడ్డారు. 2005లో వంశీమోహన్ డిప్యూటీ తహసీల్దార్‌గా ఉద్యోగంలో చేరాడు. 2019 నుంచి 2023 వరకు శేరిలింగంపల్లి ఎమ్మార్వోగా పనిచేశాడు. ఈ నాలుగేళ్లలో భారీగా అక్రమాస్తులు కూడబెట్టాడనే ఆరోపణలు ఉన్నాయి. ఏసీబీ అధికారుల ప్రాథమిక విచారణలో వంశీమోహన్.. రంగారెడ్డి జిల్లా మాజీ కలెక్టర్ అమోయ్ కుమార్‌తో కలిసి పలు ప్రభుత్వ, వివాదాస్పద భూములపై రియల్టర్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నట్టు తేలింది. వంశీమోహన్ బంధువులు కూడా ఈ రియల్ దందాలో పాలుపంచుకున్నట్టు బయటపడింది. వంశీమోహన్ మామ విజయ్ భాస్కర్ పేరుతో తప్పుడు డాక్యుమెంట్లను తయారు చేయించి, భూదందాలకు పాల్పడినట్లు వెల్లడైంది.
భారీగా అక్రమాస్తుల చిట్టా..
రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లో వంశీమోహన్ భారీగా అక్రమాస్తులు కూడబెట్టినట్టు ఏసీబీ అధికారులు గుర్తించారు. వంశీమోహన్ ఇంట్లో తన మామయ్య పేరిట ఉన్న 25 ఖాళీ దస్తావేజులను స్వాధీనం చేసుకున్నారు. ఇంట్లో రూ.2.10 లక్షల నగదు, 122 గ్రాముల బంగారు నగలు, రూ.32 లక్షల విలువ చేసే రెండు కార్లు సీజ్ చేశారు. బ్యాంకు అకౌంట్‌లో రూ.20 లక్షలు ఫ్రీజ్ చేశారు. వీటితో పాటు రూ.4.42 కోట్ల విలువ చేసే 19 ఓపెన్ ప్లాట్స్, మణికొండలో రూ.1.12 కోట్లు విలువ చేసే రెండు ఫ్లాట్లు, ఇబ్రహీంపట్నం నర్రెపల్లిలో 2 ఎకరాల వ్యవసాయ భూమి, అందులో రూ.10 లక్షలు విలువ చేసే ఫామ్‌హౌస్ డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన మొత్తం ఆస్తుల విలువ రూ.100 కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. వంశీమోహన్‌ను అరెస్ట్ చేసి ఏసీబీ స్పెషల్ కోర్టు జడ్జి ఎదుట హాజరుపరిచారు.
