
- హాజరైన మీనాక్షి నటరాజన్
- మహేశ్ గౌడ్, పొన్నం ప్రభాకర్
మేడ్చల్, వెలుగు: ఓట్ చోరీ ఘటనలపై రాహుల్ గాంధీ నేతృత్వంలో దేశవ్యాప్తంగా పోరాటం చేయాలని రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ పిలుపునిచ్చారు. ఆదివారం మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్‌తో కలిసి ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మీనాక్షి మాట్లాడుతూ.. ప్రజల హక్కుల పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ చేపట్టిన పోరాటానికి మద్దతు తెలపాలన్నారు.
దేశంలో పౌరుల ప్రాథమిక హక్కు అయిన ఓటును చోరీ చేసి బీజేపీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బిహార్‌లో రాహుల్ గాంధీ చేపట్టిన ఓటర్ అధికార్ యాత్రకు మద్దతుగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. తెలంగాణలో సామాజిక న్యాయం పాటిస్తూ 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తీసుకున్న నిర్ణయం చాలా గొప్పదన్నారు. దీనిపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొర్రీలు పెడుతుందని మండిపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా ఓటు చోరీపై నాయకులు, కార్యకర్తలు ప్రజలకు అవగాహన కల్పించాలని ఆమె కోరారు. మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా పార్టీ అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి ఓటు చోరీపై అవగాహన కల్పించేందుకు 5 వెహికల్స్‌లో డిజిటల్ స్క్రీన్స్‌ను ఏర్పాటు చేయడం బాగుందన్నారు.