- క్యూర్ పరిధిలో డ్రగ్స్ విభాగాధికారుల ఆకస్మిక తనిఖీలు
హైదరాబాద్, వెలుగు: డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అక్రమంగా మత్తు మందులు అమ్ముతున్న మెడికల్ షాపులపై టీజీ సేఫ్ కొరడా ఝళిపించింది. నగరంలోని క్యూర్ రీజియన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 111 మెడికల్ షాపులకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. టీజీ సేఫ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం పోలీసులతో కలిసి డ్రగ్స్ ఇన్‌స్పెక్టర్లు చార్మినార్, మెహదీపట్నం, టోలిచౌకి, మలక్‌పేట్, గోషామహల్ జోన్లలోని రిటైల్ మెడికల్ దుకాణాల్లో విస్తృతంగా సోదాలు నిర్వహించారు.
ఈ తనిఖీల్లో డాక్టర్ల ప్రిస్క్రిప్షన్లు లేకుండానే నిబంధనలకు విరుద్ధంగా మందులు విక్రయించడం, రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ లేకుండానే మందులు ఇవ్వడం, కస్టమర్లకు బిల్లులు ఇవ్వకపోవడం వంటి లోపాలు కనిపించాయి. కొనుగోలు, అమ్మకాల బిల్లులు చూపించకపోవడం, షెడ్యూల్ హెచ్1 డ్రగ్ రిజిస్టర్లను సక్రమంగా నిర్వహించకపోవడం వంటి ఉల్లంఘనలను ఆఫీసర్లు గుర్తించారు. ట్రమడాల్, టపెంటడాల్, నైట్రాజెపామ్, ప్రెగాబలిన్, జోల్పిడెమ్, ఆల్ప్రజోలం ట్యాబ్లెట్లతోపాటు కొడైన్ ఉన్న దగ్గు సిరప్‌లను అక్రమంగా విక్రయిస్తున్నట్లు తనిఖీల్లో తేలింది. నిబంధనలు ఉల్లంఘించిన 111 మెడికల్ షాపులకు డ్రగ్స్ చట్టం ప్రకారం షోకాజ్ నోటీసులు అందజేశారు.
చీటీ ఆధారంగా మందులు విక్రయించాలి..
షెడ్యూల్ హెచ్, హెచ్1, ఎక్స్ పరిధిలోకి వచ్చే ప్రిస్క్రిప్షన్ మందులను తప్పనిసరిగా రిజిస్టర్డ్ మెడికల్ ప్రాక్టీషనర్ చీటీ ఆధారంగా మాత్రమే విక్రయించాలని టీజీ సేఫ్ కమిషనర్ స్పష్టం చేశారు. ప్రిస్ర్కిప్షన్ లేకుండా మందులను విక్రయిస్తే లైసెన్సుల రద్దు, ప్రాసిక్యూషన్ చర్యలు తప్పవని హెచ్చరించారు. నివాస, వాణిజ్య, పారిశ్రామిక ప్రాంతాల్లో మత్తు పదార్థాల అక్రమ రవాణా లేదా తయారీపై అనుమానాలు ఉంటే ప్రజలు 1800-599-6969 కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
