మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

మెదక్ జిల్లా సంక్షిప్త వార్తలు

మెదక్, వెలుగు :  ప్రభుత్వ ఆస్పత్రుల్లో కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడమే తమ లక్ష్యమని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని ఆమె సందర్శించారు.  గర్భిణులకు అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జిల్లా కేంద్రంలో కొత్తగా ఏర్పాటు చేసిన మాత, శిశు సంరక్షణ కేంద్రం నిరుపేదలకు వరం లాంటిది అన్నారు. ఈ కేంద్రం ద్వారా తల్లీపిల్లలకు అత్యాధునిక వైద్యం అందుతుందని తెలిపారు. అనంతరం స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఉత్తమ డాక్టర్ గా ఎంపికైన డాక్టర్ అరుణ నాయుడు, రాజ్యలక్ష్మికి ప్రసంసా పత్రాలను అందజేశారు. ఎమ్మెల్యే వెంట మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, జిల్లా పరిషత్ ఉపాధ్యక్షురాలు లావణ్య రెడ్డి, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్,  గైనకాలజిస్ట్ డాక్టర్ శివదయాల్, పిడియాట్రీ షన్ తిరుమలేశ్ ​ఉన్నారు.

అన్నను చంపిన తమ్ముడు

నర్సాపూర్, వెలుగు :  అన్నను తమ్ముడు హత్య చేసిన ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్ పట్టణంలో జరిగింది. పట్టణానికి చెందిన చిత్తారి బుచ్చమ్మ, నర్సింలు దంపతులకు ఇద్దరు కొడుకులు. పెద్ద కొడుకు లక్ష్మణ్ అలియాస్ ఓంకార్(38) ఇంటి వద్దనే ఉంటుండగా, చిన్న కొడుకు శేఖర్ సంగారెడ్డి జిల్లా పటాన్ చెరువు వద్ద ఓ ప్రైవేట్ కంపెనీలో పని చేస్తున్నాడు. రెండు నెలల కింద లక్ష్మణ్ తో భార్య గొడవ పడి పుట్టింటికి వెళ్లింది. అప్పటి నుంచి తాగుడుకు బానిసైన లక్ష్మణ్ తల్లిదండ్రులను రోజూ కొడుతున్నాడు. విషయాన్ని తల్లిదండ్రులు చిన్న కొడుకుకు చెప్పారు. ఈ క్రమంలో సర్దిచెప్పేందుకు వచ్చిన తమ్ముడు సోమవారం రాత్రి అన్నతో కలిసి ఇంట్లోనే మద్యం తాగారు. అనంతరం ఇద్దరి మధ్య గొడవ జరిగింది. కోపోద్రిక్తుడైన శేఖర్ అన్న లక్ష్మణ్ ను గట్టిగా కొట్టడంతో అతడు అక్కడికక్కడే చనిపోయాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని నర్సాపూర్ ఎస్సై గంగరాజు తెలిపారు.

క్రీడోత్సవాల్లో సత్తా చాటాలి

సిద్దిపేట రూరల్, వెలుగు: స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల్లో భాగంగా నిర్వహిస్తున్న జిల్లాస్థాయి క్రీడోత్సవాలలో సత్తా చాటాలని జడ్పీ చైర్ పర్సన్ రోజా రాధాక్రిష్ణ శర్మ అన్నారు. మంగళవారం పట్టణంలోని పరేడ్ గ్రౌండ్ లో ఆమె క్రీడలను ప్రారంభించారు. ఈ పోటీలకు 848 మంది క్రీడాకారులు హాజరయ్యారు. కార్యక్రమంలో సిద్దిపేట మున్సిపల్ చెర్ పర్సన్ మంజుల రాజనర్సు పాల్గొన్నారు.

పోలీసులకు క్రికెట్ పోటీలు...

వజ్రోత్సవాలలో భాగంగా జిల్లా పోలీస్ అధికారులకు, సిబ్బందికి ఫ్రీడమ్ కప్ పోటీలను మంగళవారం పొన్నాల గ్రామ శివారులోని కిష్ట సాగర్ రోడ్డు విరాట్ స్టేడియంలో సీపీ ఎన్. శ్వేత క్రికెట్ ఆడి పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఏ ఆర్ అడిషనల్ డీసీపీ రామచంద్ర రావు, సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ ఫణిందర్, సీఐలు భాను ప్రకాశ్, రవికుమార్, జానకీరామ్ రెడ్డి  పాల్గొన్నారు.

వాజ్​పేయి​ సేవలు మరువలేనివి

దుబ్బాక/సిద్దిపేట రూరల్, వెలుగు: మాజీ ప్రధాని ఏబీ వాజ్​పేయి సేవలు మరువలేనివని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అంబటి బాలేశ్​గౌడ్,  సిద్దిపేట టౌన్​ ప్రెసిడెంట్ పత్రి శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం వాజ్​పేయి వర్థంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని బీజేపీ ఆఫీస్​లో, దుబ్బాక ఎమ్మెల్యే ఆఫీస్​లో ఆయన ఫొటోకు బీజేపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అఖండ భారత్​ నిర్మాణం కోసం వాజ్​పేయి చేసిన కృషి దేశం మరువదన్నారు. కార్యక్రమంలో పలువురు బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. 

కవులు, కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండ

మెదక్​ టౌన్, వెలుగు : కవులు, కళాకారులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉండి అన్ని విధాలా ఆదుకుంటుందని మెదక్​ అడిషనల్​ కలెక్టర్​ రమేశ్​ అన్నారు.  స్వాతంత్ర్య భారత వజ్రోత్సవాల సందర్భంగా మంగళవారం కలెక్టరేట్​లో కవి సమ్మేళనాన్ని ఘనంగా నిర్వహించారు. కవులు తమ కవితలు, పాటలను వినిపించి అందరినీ  అలరించారు. ఈ సందర్భంగా అడిషనల్ కలెక్టర్​మాట్లాడుతూ రాష్ట్రంలో కవులు, కళాకారులకు కొదవలేదని, వారిలోని ప్రతిభను వెలికి తీయడానికి ఆయా కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం కవి సమ్మేళనంలో పాల్గొన్న కవులను  ప్రశంసాపత్రాలతో ఘనంగా సన్మానించారు. సిద్దార్థ్​ మోడల్​ స్కూల్​ విద్యార్థిని అక్షర ప్రదర్శించిన నృత్య ప్రదర్శన అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమంలో డీఆర్​డీవో శ్రీనివాస్, జడ్పీ ఈసీవో వెంకట శైలేశ్, డీపీవో తరుణ్​ కుమార్, డీఎస్​వో శ్రీనివాస్, డీడబ్ల్యూవో బ్రహ్మాజీ, ఇరిగేషన్​ జిల్లా అధికారి శ్రీనివాస్​రావు, మిషన్​ భగీరథ అధికారి కమలాకర్, డీఈవో రమేశ్​ కుమార్, జిల్లా సైన్స్​అధికారి రాజిరెడ్డి, మెప్మా పీడీ ఇందిర పాల్గొన్నారు.

బస్సు సర్వీస్​ను పునరుద్ధరించాలి

దుబ్బాక, వెలుగు: సిద్దిపేట-రుద్రారం ఆర్టీసీ బస్సు సర్వీస్​ను పునరుద్ధరించాలని డిమాండ్​ చేస్తూ మంగళవారం మిరుదొడ్డి మండలం అక్బర్​పేట చౌరస్తాలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు రాస్తారోకో నిర్వహించారు. కరోనా కాలంలో రద్దు చేసిన సిద్దిపేట–-రుద్రారం బస్సును మళ్లీ నడిపించాలని కోరారు. గ్రామానికి బస్సు సౌకర్యం లేక చదువులు ఆగుతున్నాయని, ఇతర పనుల కోసం వెళ్లి వచ్చేందుకు ఇబ్బంది పడుతున్నామని తెలిపారు. గ్రామానికి బస్సు వచ్చేలా చూస్తామని భూంపల్లి పోలీసులు సర్దిచెప్పడంతో వారు 
ఆందోళనను విరమించారు. 

ఉత్సాహంగా సామూహిక జాతీయ గీతాలాపన

స్వాతంత్ర్య వజ్రోత్సవాలలో భాగంగా మంగళవారం ఉదయం 11.30 గంటలకు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉత్సాహంగా సామూహిక జాతీయ గీతాలాపన చేశారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉద్యోగులు, పోలీసులు, యువకులు, విద్యార్థులు, ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని జనగణమన పాడారు. సిద్దిపేటలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జడ్పీ చైర్ పర్సన్ వేలేటీ రోజా శర్మ, మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రాజనర్సు, ఓపెన్ ఆడిటోరియంలో సీపీ ఎన్.శ్వేత, హుస్నాబాద్​లో వొడితెల సతీశ్​కుమార్, కొమురవెల్లిలో ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, సంగారెడ్డి లో కలెక్టర్​ డాక్టర్​ శరత్, జడ్పీ  చైర్​పర్సన్​ మంజుశ్రీ, అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్. అడిషనల్​ కలెక్టర్లు రాజర్షి షా, వీరారెడ్డి, డీసీఎంఎస్ శివకుమార్, నారాయణఖేడ్​ లో ఎమ్మెల్యే భూపాల్​రెడ్డి, మెదక్​లో ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్య రెడ్డి, అడిషనల్ ఎస్పీ బాలస్వామి పాల్గొన్నారు. సిద్దిపేట మున్సిపల్ పరిధిలోని నర్సాపూర్ తాటి వనంలోని ఒక్క తాటి చెట్టు పైకి 20 మంది గీత  కార్మికులు ఎక్కి జాతీయ జెండాలను ప్రదర్శించడంతోపాటు  సామూహిక జాతీయ గీతాలాపన చేశారు.  రామాయంపేట పట్టణంలో 600, దుబ్బాకలో 150 మీటర్ల తివర్ణ పతాకంతో ర్యాలీ నిర్వహించారు. కొమురవెల్లిలో విద్యార్థినులు పిరమిడ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నారు. 

సీఎం కేసీఆర్ దిష్టి బొమ్మ దహనం

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రపై టీఆర్ఎస్ నాయకుల దాడిని నిరసిస్తూ మంగళవారం ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బీజేపీ లీడర్లు సీఎం కేసీఆర్​ దిష్టిబొమ్మను దహనం చేశారు. మెదక్​లో జిల్లా అధ్యక్షుడు గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి నల్లాల విజయ్, సంగారెడ్డిలో బీజేవైఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రాకేశ్​ఠాకూర్ సింగ్, జగదేవపూర్ లో బీజేవైఎం మండల అధ్యక్షుడు గుర్రం శ్రీధర్, నారాయణఖేడ్​లో బీజేపీ ఐటీ సెల్ కన్వీనర్ శ్రీనివాస్, బీజేవైఎం జిల్లా అధికార ప్రతినిధి సతీశ్ మాట్లాడారు.  రాష్ట్రంలో బీజేపీకి  ప్రజల నుంచి పెరుగుతున్న ఆదరణను చూసి ఓర్వలేక టీఆర్ఎస్​ నాయకులు భౌతిక దాడులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. దాడికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.