ఉస్మానియాలో మందులు కొరత

ఉస్మానియాలో మందులు కొరత
  • ఆరు నెలలుగా 80% మందులు లేవనే సమాధానం
  • సరిపడా సరఫరా చేయని టీఎస్ఎంఐడీఎస్
  • హై ఎండ్ యాం టి బయోటిక్స్ ఊసే లేదు

హైదరాబాద్, వెలుగు: ఉస్మానియా హాస్పిటల్​లో మందుల కొరత పేషెంట్లను తీవ్రంగా వేధిస్తోంది. ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయంలో కావాల్సిన యాంటీ బయోటిక్స్, ఇతర కీలకమైన మందులు కొన్ని నెలలుగా అందుబాటులో ఉండటం లేదు. టీఎస్ఎంఐడీఎస్ ద్వారా సెంట్రల్ డ్రగ్స్ సప్లయ్ నుంచి రావాల్సిన మందులు కనీసం 20 శాతం కూడా సప్లయ్ కావడం లేదు. ప్రతి విభాగంలో అవసరమైన మందుల జాబితాను టీఎస్ఎంఐడీఎస్ కు ఇండెంట్ ద్వారా డాక్టర్లు పంపిస్తుంటారు. సెంట్రల్ డ్రగ్ సప్లయ్ నుంచి దాదాపు ఆరు నెలలుగా ఈ ఇండెంట్​లో 80 శాతం మందులు లేవనే సమాధానం వస్తోంది. ఇటీవల 45 రకాల మందులు అవసరమని కోరితే సెంట్రల్ డ్రగ్ సప్లయ్ నుంచి వచ్చిన మందులు 8 మాత్రమే. కీలకమైన పిప్ టాజ్, మాగ్నెక్స్, అగ్ మెంట్, పన్ టాప్, డ్రామాడాల్ వంటి మందులైతే అస్సలు సరఫరా చేయటం లేదు. హై ఎండ్ యాంటిబయెటిక్స్ సరఫరా విషయంలో టీఎస్ఎంఐడీసీ చేతులేత్తేసింది. వీటి ఖరీదు ఎక్కువగా ఉండటంతో పేషెంట్లకు అందుబాటులో ఉంచటం లేదు. అసెంబ్లీ ఎన్నికలకు ముందు నుంచి ఇదే పరిస్థితి.  ఎన్నికల కోడ్ పేరుతో ఇన్నాళ్లు పలు కారణాలు చెప్పుకుంటూ వచ్చారు. అసెంబ్లీ ఎన్నికలు ముగిసి ఆరు నెలలు గడిచినప్పటికీ ఇప్పటికీ మందుల సప్లయ్ విషయంలో ఇదే తీరు కనబడుతోంది.

మందుల కొరత పేషెంట్లకు తీవ్ర ఇబ్బందిగా మారింది. ముఖ్యంగా ఎమర్జెన్సీ సమయంలో మందులు అందుబాటులో లేకపోవటంతో రోగులపై భారం పడుతోంది. అప్పటికప్పుడు రోగులే -డబ్బులు పెట్టి మందులు కొనాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. అంగుమెంటిన్ వంటి మల్టీపర్పస్ యాంటీ బయోటిక్స్ అందుబాటులో లేక ఆరు నెలలు గడుస్తోంది. ఉస్మానియాకు వచ్చే పేషెంట్లంతా పేదవారే కావటంతో ఈ యాంటీ బయోటిక్స్ కొనలేక ఇబ్బందులు పడుతున్నారు. ఎమర్జెన్సీ సమయంలో పేషెంట్లకు మందులు కొనుగోలు చేయాలని చెప్పటం సాధ్యం కాదని పలువురు డాక్టర్లు చెబుతున్నారు. సాధారణ సమయంలో మందులు అందుబాటులో లేని కారణంగా చాలా వరకు చికిత్సలకు వాయిదా వేస్తున్నారు. ఇక హై ఎండ్ యాంటీ బయోటిక్స్ వాడాల్సిన సమయంలో ఇతర మందులతో నెట్టుకొస్తున్నారు. ఉస్మానియాలోని అన్ని కీలక విభాగాల్లో మందుల కొరత కారణంగా ఉన్నా వాటితోనే నెట్టుకొస్తున్నారు. వీలైనంత వరకు ప్రత్యామ్నాయ మందులను వాడుతున్నామని చెబుతున్నారు డాక్టర్లు.

ప్రభుత్వం నుంచి రాని 20% బడ్జెట్

సెంట్రల్ డ్రగ్స్ సప్లయ్ నుంచి సరఫరా చేయలేని మందులను కొనుగోలు చేసేందుకు ఉస్మానియాకు 20 శాతం బడ్జెట్ ను కేటాయిస్తుంది. ఈ బడ్జెట్ తో అత్యవసరంగా అవసరమైన మందులను కొనుగోలు చేస్తుంటారు. ఆరు నెలలుగా ఉస్మానియాకు రావాల్సిన 20 శాతం బడ్జెట్ లో ఒక్క పైసా రాలేదు. దీంతో అత్యవసర మందులను ప్రభుత్వానికి మందులు సప్లయ్ చేస్తున్న సంస్థల నుంచి క్రెడిట్ రూపంలో తీసుకుంటున్నారు. ఆయా సంస్థలకు ఇవ్వాల్సిన సొమ్ము కోటి 20 లక్షల రూపాయలకు చేరింది.
ప్రస్తుతం మందుల కంపెనీలు పది అడిగితే ఒక్కటి మాత్రమే సప్లయ్ చేస్తున్నాయి. డ్యూ మొత్తం చెల్లించాలని కోరుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే మందుల సంస్థలు మొత్తం సప్లయ్ ను ఆపేసే ప్రమాదం ఉంది.