గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. మెడికో సస్పెన్షన్​​

గాంధీ మెడికల్ కాలేజీలో ర్యాగింగ్.. మెడికో సస్పెన్షన్​​

పద్మారావునగర్, వెలుగు: గాంధీ మెడికల్‌‌ కాలేజీలో ర్యాగింగ్‌‌కు పాల్పడిన ఓ మెడికల్ స్టూడెంట్ ను ఏడాది పాటు సస్పెండ్‌‌ చేస్తూ యాంటీ ర్యాగింగ్‌‌ కమిటీ ఏకగ్రీవంగా తీర్మానించింది. మెడికల్‌‌ ఎడ్యుకేషన్‌‌ డైరెక్టర్, గాంధీ ప్రిన్సిపాల్‌‌ డాక్టర్‌‌ రమేశ్​రెడ్డి అధ్యక్షతన గురువారం గాంధీ మెడికల్ కాలేజీ యాంటీ ర్యాగింగ్ కమిటీ సమావేశమై పలు అంశాలపై చర్చించి, తీర్మానాలు చేసింది.

ఓ సీనియర్​ తమను ర్యాగింగ్ చేస్తున్నాడని పలువురు బాధిత విద్యార్థులు కాలేజీలోని అనాటమీ డిపార్ట్​ మెంట్ కంప్లైంట్​ బాక్స్​ లో  ఫిర్యాదు లేఖను వేశారు.  దానిపై విచారణ జరిపిన యాంటీ ర్యాగింగ్​ కమిటీ.. 2020 ఎంబీబీఎస్​ బ్యాచ్​ కు చెందిన సీనియర్​ స్టూడెంట్ ను కాలేజీతో పాటు హాస్టల్​ నుంచి ఏడాది పాటు సస్పెండ్​ చేస్తూ  ఏకగ్రీవంగా తీర్మానించింది.

10 మంది సస్పెన్షన్​ రద్దుకు నో..

గతంలో ర్యాగింగ్​ కు పాల్పడి.. ఏడాది పాటు సస్పెన్షన్​ కు గురైన 10 మంది స్టూడెంట్ల​ పేరెంట్స్​గురువారం యాంటీ ర్యాగింగ్ కమిటీని కలిశారు. తమ వాళ్లు మరోసారి ర్యాగింగ్ కు పాల్పడరని, సస్పెన్షన్​ ను ఎత్తివేయాలని ప్రాధేయపడ్డారు. అయితే,  కమిటీ సస్పెన్షన్​ ఎత్తివేయడానికి ఒప్పుకోలేదు. తెలిసి చేసిన తప్పుకు ఎవరైనా శిక్ష అనుభవించాల్సిందేనని డీఎంఈ రమేశ్​ రెడ్డి స్పష్టం చేశారు. సమావేశంలో వైస్​ ప్రిన్సిపాల్​ కృష్ణమోహన్, గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్​ రాజారావు, ఆయా డిపార్ట్ మెంట్ల హెచ్ వోడీలు, కమిటీ మెంబర్స్​ పాల్గొన్నారు.