
- సెన్సెక్స్ 213 పాయింట్లు అప్
- 69 పాయింట్లు ఎగిసిన నిఫ్టీ
ముంబై: ఐటీ, ఎఫ్‌ఎంసీజీ షేర్లలో భారీ కొనుగోళ్ల కారణంగా మార్కెట్లు బుధవారం లాభపడ్డాయి. వరుసగా ఐదో రోజూ ఇన్వెస్టర్లను మురిపించాయి. 30 షేర్ల బీఎస్ఈ సెన్సెక్స్ 213.45 పాయింట్లు పెరిగి 81,857.84 వద్ద స్థిరపడింది. ఇందులో 15 షేర్లు లాభాల్లో ముగియగా, మిగిలినవి నష్టపోయాయి. ఇంట్రాడేలో 341.23 పాయింట్లు పెరిగి 81,985.62ను తాకింది. 50 షేర్ల ఎన్ఎస్ఈ నిఫ్టీ 69.90 పాయింట్లు ఎగిసి 25,050.55 వద్ద స్థిరపడింది.
సెన్సెక్స్ కంపెనీల్లో, ఇన్ఫోసిస్ అత్యధికంగా 3.88 శాతం పెరిగింది. ఆ తర్వాతి స్థానంలో టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (2.69 శాతం) ఉంది. హిందుస్తాన్ యూనిలివర్, ఎన్టీపీసీ, టాటా స్టీల్, టెక్ మహీంద్రా, ఎటర్నల్, హెచ్‌సీఎల్ టెక్ లాభపడ్డాయి. భారత్ ఎలక్ట్రానిక్స్, బజాజ్ ఫైనాన్స్, టాటా మోటార్స్, ట్రెంట్ నష్టపోయాయి. రిలయన్స్ ఇండస్ట్రీస్ షేర్లు అర శాతం పడిపోవడం ప్రధాన సూచీల్లో లాభాలకు అడ్డుకట్ట వేసింది.
జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ మాట్లాడుతూ, "బలమైన దేశీయ పెట్టుబడులు, అనుకూలమైన ఆర్థిక అంశాల కారణంగా భారత మార్కెట్ సానుకూల వృద్ధిని కొనసాగించింది. అయితే, అమెరికా సుంకాలు, రష్యా నుంచి ముడి చమురు కొనుగోళ్లపై ఉన్న ఆంక్షల వంటి సమస్యలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో, అమెరికా వాణిజ్య విధానం, రాబడి వృద్ధిపై స్పష్టత రావడం చాలా ముఖ్యం. ఎఫ్‌ఓఎంసీ మినిట్స్ విడుదల నేపథ్యంలో గ్లోబల్ మార్కెట్లు జాగ్రత్తగా ఉన్నాయి. ఇన్వెస్టర్లు జెరోమ్ పావెల్ ప్రసంగం కోసం ఎదురుచూస్తున్నారు. ఆయన భవిష్యత్తు విధానాలపై స్పష్టత ఇస్తారని భావిస్తున్నారు" అని అన్నారు.
బీఎస్ఈ రంగాల సూచీలు ఇలా..
బీఎస్ఈ మిడ్‌క్యాప్ 0.39 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.30 శాతం పెరిగాయి. బీఎస్ఈ రంగాల సూచీల్లో, బీఎస్ఈ ఫోకస్డ్ ఐటీ 2.70 శాతం, ఐటీ 2.61 శాతం, టెక్ 2.22 శాతం, ఎఫ్‌ఎంసీజీ 1.36 శాతం, రియల్టీ 1.04 శాతం, టెలికమ్యూనికేషన్ 0.68 శాతం లాభపడ్డాయి. బ్యాంకెక్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫైనాన్షియల్ సర్వీసెస్, ఎనర్జీ నష్టాలను చవిచూశాయి.
ఆసియా మార్కెట్లలో, దక్షిణ కొరియా కోస్పి, జపాన్ నిక్కీ 225 ఇండెక్స్ నష్టాల్లో ముగియగా, షాంఘై ఎస్ఎస్ఈ కాంపోజిట్ ఇండెక్స్, హాంకాంగ్ హాంగ్ సెంగ్ లాభాలతో ముగిశాయి. యూరప్ మార్కెట్లు మిశ్రమంగా ట్రేడయ్యాయి. మంగళవారం అమెరికా మార్కెట్లు ఎక్కువగా నష్టాల్లో ముగిశాయి. ఎఫ్‌ఐఐలు మంగళవారం రూ. 634.26 కోట్ల విలువైన ఈక్విటీలను విక్రయించారు. గ్లోబల్ ఆయిల్ బెంచ్‌మార్క్ బ్రెంట్ క్రూడ్ 1.14 శాతం పెరిగి బ్యారెల్ ధర 66.54 డాలర్లకు చేరుకుంది.