కేసీఆర్ వైఫల్యానికి మేడిగడ్డనే నిదర్శనం : బీజేపీ ఎంపీ సంజయ్

కేసీఆర్ వైఫల్యానికి మేడిగడ్డనే నిదర్శనం : బీజేపీ ఎంపీ సంజయ్
  •     ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చాక.. మళ్లీ సందర్శనలేంటి?
  •     కాళేశ్వరంపై కాంగ్రెస్, బీఆర్ఎస్ డ్రామాలాడుతున్నయ్

రాజన్నసిరిసిల్ల, వెలుగు: బీఆర్ఎస్​ ప్రభుత్వ ఘోర వైఫల్యానికి నిదర్శనమే మేడిగడ్డ ప్రాజెక్టు అని బీజేపీ ఎంపీ బండి సంజయ్ కుమార్ విమర్శించారు. కేసీఆర్ ఫెయిల్యూర్ కు నేషనల్ డ్యామ్​సేఫ్టీ అథారిటీ(ఎన్డీఎస్ఏ) నివేదిక ఇచ్చిందన్నారు. సిరిసిల్ల టౌన్, తంగళ్లపల్లిలో గురువారం ఆయన తొలిదశ ప్రజాహిత యాత్రను కొనసాగించారు. మధ్యాహ్నం అగ్రహారంలో యాత్రను ముగించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. కాళేశ్వరం ప్రాజెక్టు, కృష్ణా నీళ్లపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకులు అసెంబ్లీ వేదికగా డ్రామాలాడుతున్నారని మండిపడ్డారు. 

ప్రజలకిచ్చిన హామీలపై చర్చించడం లేదన్నారు. పదేండ్ల కాలంలో బీఆర్ఎస్ చేసిన మోసాలు బయటపడకుండా కుట్ర చేస్తున్నారన్నారు. ఎన్డీఎస్ఏ నివేదిక ఇచ్చాక ఇప్పుడు మళ్లీ డ్యామ్​సందర్శనలు ఎందుకు అని ప్రశ్నించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గత అక్టోబర్ లో 20 అంశాలపై వివరణ అడిగితే కనీసం రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. 

ఎన్​డీఎస్ఏ యాక్ట్– 2021 నిబంధనలను గత ప్రభుత్వం పూర్తిగా ఉల్లంఘించిదన్నారు. మేడిగడ్డ బ్లాక్ 7 మొత్తాన్ని పునాదుల నుంచి తొలగించి తిరిగి నిర్మించాల్సిందేనన్నారు. అంతవరకు నీటిని నింపకూడదన్నారు. కాళేశ్వరం  ప్రాజెక్టులోని అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు సైతం బలహీనంగా ఉన్నాయని ఆరోపించారు. మేడిగడ్డ తరహాలో సమస్యలు ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉందన్నారు. కేసీఆర్ తప్పిదంతో రాష్ట్ర ప్రజల జీవితాలు, ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టం కలిగే పరిస్థితి వచ్చిందన్నారు. 

బీఆర్ఎస్ మూర్ఖులు వాస్తవాలు గ్రహించాలని హితవు పలికారు.  14, 15 ఆర్థిక సంఘం నిధుల్లో గోల్ మాల్ జరిగిందని, మొక్కల పెంపకం పేరుతో వందల కోట్లు దోచుకుతిన్నారని ఆరోపించారు. ఆయన వెంట బిజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ, బీజేపీ సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు ప్రతాప రామకృష్ణ, స్టేట్ ఎస్సీ మోర్చా జనరల్ సెక్రటరీ కుమ్మరి శంకర్, బీజేపీ నాయకులు రెడ్డబోయిన గోపి, ఆడేపు రవీందర్, నాగుల శ్రీనివాస్ ఉన్నారు.