జులై 8న హైదరాబాద్​లో 11 రాష్ట్రాల బీజేపీ ప్రెసిడెంట్ల మీటింగ్

జులై 8న హైదరాబాద్​లో 11 రాష్ట్రాల  బీజేపీ ప్రెసిడెంట్ల మీటింగ్
  • ఆయా రాష్ట్రాల పార్టీ సంస్థాగత జనరల్ సెక్రటరీలూ హాజరు
  • చీఫ్ గెస్ట్​లుగా రానున్న నడ్డా, బీఎల్ సంతోష్
  •  ఈ మీటింగ్ తర్వాత భారీ బహిరంగ సభకు ప్లాన్   

హైదరాబాద్, వెలుగు: బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణపై మరింత సీరియస్ గా ఫోకస్ పెట్టింది. మరో నాలుగైదు నెలల్లో ఇక్కడ ఎన్నికలు జరుగనుండడంతో దక్షిణాదిన తెలంగాణ వేదికగా పాగా వేయాలని ఆ పార్టీ హైకమాండ్ పకడ్బందీగా ప్లాన్ చేస్తోంది. కర్నాటకను కోల్పోయినా.. దాని స్థానంలో తెలంగాణను భర్తీ చేయాలనే పట్టుదలతో ఆ దిశగా వేగంగా అడుగులు వేస్తోంది. ఇందులో భాగంగానే వచ్చే నెల 8న హైదరాబాద్ లో దక్షిణాది రాష్ట్రాలతో పాటు వీటిని ఆనుకుని ఉండే మరికొన్ని రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, ఆయా రాష్ట్రాల పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శులతో సమావేశం నిర్వహించాలని హైకమాండ్ నిర్ణయించింది. వాస్తవానికి ఈ మీటింగ్ చెన్నైలో నిర్వహించాలని ముందుగా నిర్ణయించుకున్నప్పటికీ, మన రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో మీటింగ్ వేదికను హైదరాబాద్ కు మార్చారు. కాంగ్రెస్ దూకుడు పెంచడంతో రాష్ట్రంలో బీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అన్న సంకేతాలు ఇచ్చేందుకే మీటింగ్ ను ఇక్కడికి మార్చినట్లు తెలుస్తోంది.

పాల్గొనేది వీళ్లే..

మీటింగ్ లో తెలంగాణ, ఏపీ, తమిళనాడు, కేరళ, కర్నాటక, గోవా, అండమాన్ నికోబార్, పుదుచ్చేరి, లక్షద్వీప్, మహారాష్ట్ర, మధ్య ప్రదేశ్ రాష్ట్రాల బీజేపీ అధ్యక్షులు, ఆయా రాష్ట్రాల పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శులు  పాల్గొననున్నారు. సమావేశానికి జేపీ నడ్డా, బీఎల్ సంతోష్ హాజరుకానున్నారు. ఆయా రాష్ట్రాల్లో పార్టీ పరిస్థితి, గత సమావేశాల సందర్భంగా తీసుకున్న నిర్ణయాల అమలు, రాబోయే కాలంలో పార్టీ సంస్థాగత బలోపేతం కోసం చేపట్టాల్సిన ప్రోగ్రామ్ లతో పాటు ఎన్నికలు జరుగనున్న రాష్ట్రాల్లో గెలుపు కోసం అనుసరించాల్సిన వ్యూహాలపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు. అయితే ఈ మీటింగ్ అయిన వెంటనే ఇకడే ఒక భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కూడా పార్టీ రాష్ట్ర నాయకత్వం ప్లాన్ చేస్తోంది. వీలైతే ఈ సభకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలను రప్పించే ఏర్పాట్లలో పార్టీ నేతలు ఉన్నారు. దీనిపై 2–3 రోజుల్లో క్లారిటీ రానుంది.