నదుల అనుసంధానం ప్రాజెక్టుపై.. ఫిబ్రవరిలో సీఎంల మీటింగ్

నదుల అనుసంధానం ప్రాజెక్టుపై.. ఫిబ్రవరిలో సీఎంల మీటింగ్

హైదరాబాద్, వెలుగు : గోదావరి– కృష్ణా–పెన్నా– కావేరి నదుల అనుసంధానంపై ఫిబ్రవరిలో సంబంధిత రాష్ట్రాల సీఎంలతో సమావేశం నిర్వహించేందుకు కేంద్ర జలశక్తి శాఖ సిద్ధమవుతోంది. ఈ నదుల అనుసంధానంపై ఇప్పటికే ఆయా రాష్ట్రాలన్నీ ఏకాభిప్రాయం తెలపడంతో ప్రాజెక్టు డీపీఆర్​పై కసరత్తు చేస్తున్నారు. రెండు వారాల్లో డీపీఆర్​ రెడీ చేసి భాగస్వామ్య రాష్ట్రాలకు పంపేందుకు నేషనల్ ​వాటర్ ​డెవలప్​మెంట్​అథారిటీ (ఎన్​డబ్ల్యూడీఏ) ఏర్పాట్లు చేస్తోంది. కేంద్ర జలశక్తి శాఖ మంత్రి గజేంద్రసింగ్​ షెకావత్ ​అధ్యక్షతన నిర్వహించే సమావేశంలో తెలంగాణ సీఎం రేవంత్​ రెడ్డి, ఏపీ సీఎం జగన్​తో పాటు తమిళనాడు, కర్నాటక, చత్తీస్​గఢ్, పుదుచ్చేరి సీఎంలు పాల్గొననున్నారు. 

గోదావరి– కావేరి ​రివర్ ​లింకింగ్​కు సంబంధించిన డ్రాఫ్ట్ ​డీపీఆర్​ను ఇప్పటికే అన్ని రాష్ట్రాలకు ఎన్​డబ్ల్యూడీఏ పంపింది. ఆయా రాష్ట్రాలు వ్యక్తం చేసిన అభిప్రాయాలు, అభ్యంతరాల ఆధారంగా తుది డీపీఆర్ రూపొందిస్తున్నారు. ఈ డీపీఆర్​పై ఆయా రాష్ట్రాల అభిప్రాయాలు సేకరించేందుకు ఈ నెలాఖరుకు కేంద్ర జల శక్తి శాఖ కార్యదర్శి అధ్యక్షతన భాగస్వామ్య రాష్ట్రాల ఇరిగేషన్​సెక్రటరీలతో మీటింగ్ నిర్వహిస్తున్నారు. గోదావరి (ఇచ్చంపల్లి)– కృష్ణా(నాగార్జునసాగర్)– పెన్నా (సోమశిల)– కావేరి (గ్రాండ్​ఆనికట్) నదుల అనుసంధానానికి రూ.74,326 కోట్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. ఇచ్చంపల్లి వద్ద రూ. 3.381 కోట్లతో బ్యారేజీ నిర్మించి, ప్రస్తుతం చత్తీస్​గఢ్ ​వాడుకోని 148 టీఎంసీలను తరలించాలని నిర్ణయించారు. 

సెక్రటరీల మీటింగ్​లో ఎంఓయూలు  

తమ వాటా నీటిని రివర్ ​లింకింగ్ ​కోసం వాడుకోవడంపై చత్తీస్ గఢ్ ​ఇప్పటికే అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ 148 టీఎంసీలను వినియోగించుకునేందుకు ఇప్పటికే సర్వే పూర్తి చేశామని, ప్రాజెక్టులు చేపట్టనున్నట్లు తెలిపింది. దీంతో మహానది నుంచి గోదావరి అనుసంధానిస్తామని, అప్పటి వరకు మాత్రమే చత్తీస్​గఢ్​ ఉపయోగించుకోని 148 టీఎంసీల నీటిని నదుల అనుసంధానంలో తరలిస్తామని కేంద్రం హామీ ఇచ్చింది. మహానది– గోదావరి అనుసంధానం పూర్తయితే 230 టీఎంసీలు అందుబాటులోకి వస్తాయని, ఆ నీటిని గోదావరి – కావేరి అనుసంధానంలో భాగంగా తరలిస్తామని ఎన్​డబ్ల్యూడీఏ చెప్తోంది. ఈ నెలలో జరిగే సెక్రటరీల స్థాయి సమావేశంలో రివర్ ​లింకింగ్​ ప్రాజెక్టు చేపట్టేందుకు ఎంవోయూలపై సంతకాలు చేయించనున్నారు. ఆ తర్వాత సీఎంల సమావేశంలో తుది నిర్ణయం తీసుకొని ప్రాజెక్టు చేపట్టనున్నారు. కాగా, రివర్ ​లింకింగ్​లో భాగంగా తరలించే నీటిలో తెలంగాణకు 45 టీఎంసీలు కేటాయిస్తారు. ఈ రివర్ ​లింకింగ్​ను జాతీయ ప్రాజెక్టుగా చేపట్టనున్నారు. దీంతో ప్రాజెక్టు నిర్మాణ వ్యయంలో 90% కేంద్రం, 10% నీటి వాటాల ఆధారంగా ఆయా భాగస్వామ్య రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది.