ఆర్టీసీ విలీనంపై ఈ నెల 18న మీటింగ్

ఆర్టీసీ విలీనంపై ఈ నెల 18న మీటింగ్
  • ట్రాన్స్ పోర్ట్ సెక్రటరీకి రిపోర్ట్ అందజేయనున్న అధికారులు
  • ఇప్పటికే అన్ని డిపోల నుంచి వివరాల సేకరణ

హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనంపై ఈ నెల 18న ఉన్నతాధికారుల మీటింగ్ జరగనుంది. ట్రాన్స్ పోర్ట్ ఈడీలు, ఆర్ అండ్ బీ సెక్రటరీ శ్రీనివాస రాజుతో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ మీటింగ్ అవుతారని సమాచారం. అన్ని డిపోలు, వర్క్ షాపుల నుంచి సేకరించిన కార్మికుల, ఉద్యోగుల వివరాలను సెక్రటరీకి అందజేయనున్నారు. విలీనం ప్రాసెస్ జరుగుతున్న నేపథ్యంలో ఉద్యోగుల బదిలీలు, ప్రమోషన్స్ చేపటొద్దని రీజినల్ మేనేజర్లు, డిపో మేనేజర్​లకు బస్ భవన్ నుంచి ఆదేశాలు వెళ్లాయి. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్టీసీలో మొత్తం 43వేల మంది పని చేస్తున్నారు. వారిలో కార్మికులు, ఉద్యోగులు, అధికారులు ఉన్నారు. ఇందులో 80 శాతం మంది డ్రైవర్లు, కండక్టర్లు, శ్రామిక్, మెకానిక్ లే ఉన్నారు. సస్పెండ్, రిమూవ్ అయిన అధికారుల వివరాలను బుధవారం దాకా సేకరించారు. డౌట్లు క్లియర్ చేసేందుకు బస్​భవన్​లో స్పెషల్ సెల్ ఏర్పాటు చేశారు. ప్రతి కార్మికుడి వ్యక్తిగత వివరాలతో పాటు శాలరీ బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్సీ కోడ్, పాన్, ఆధార్​కార్డు డీటెయిల్స్ సేకరించారు. ఇవి ట్రాన్స్ పోర్ట్ సెక్రటరీ పరిశీలించిన తర్వాత ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ కు పంపిస్తారు. ఆగస్ట్ జీతం ఆర్టీసీనే చెల్లించే అవకాశాలు ఉన్నాయి. ఆర్టీసీ మస్టర్ (అటెండెన్స్) ప్రతినెలా 18తో ముగుస్తుంది. దీంతో సెప్టెంబర్ జీతం అక్టోబర్ లో ప్రభుత్వం ట్రెజరీ ద్వారా చెల్లిస్తుందని అధికారులు చెబుతున్నారు.

ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ బేసిక్ ఉద్యోగుల రెగ్యులరైజ్​పై కసరత్తు!

ఆర్టీసీలో సుమారు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు 1800 మంది వరకు ఉన్నారు. 200 మంది కాంట్రాక్ట్ బేసిక్​పై పని చేస్తున్నారు. వీరు అలాగే కొనసాగుతారని మంత్రులు ఇప్పటికే ప్రకటించారు. తాజాగా వీరిని కూడా రెగ్యులర్ చేసే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తున్నది. రెగ్యులర్ చేస్తే ప్రభుత్వ ఖజానాపై ఎంత భారం పడుతుంది.. జీతం ఎంత పెరుగుతది.. వంటి లెక్కలు అధికారులు రెడీ చేస్తున్నట్లు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 43 వేల మంది రెగ్యులర్ చేసి.. 2వేల మంది వదిలేస్తే విమర్శలు వస్తాయని ప్రభుత్వం భావిస్తున్నది.