11,062 పోస్టులతో మెగా డీఎస్సీ .. ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ

11,062 పోస్టులతో మెగా డీఎస్సీ .. ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖ
  •  ఇయ్యాల్నో, రేపో నోటిఫికేషన్.. ఖాళీల్లో 7,304 ఎస్జీటీ పోస్టులు
  • పాత నోటిఫికేషన్ రద్దుకు సర్కార్ నిర్ణయం
  • ఆమోదం తెలిపిన ఆర్థిక శాఖఇయ్యాల్నో.. రేపో నోటిఫికేషన్
  • ఎస్జీటీ 7,304 పోస్టులుపాత నోటిఫికేషన్ రద్దుకు సర్కార్ నిర్ణయం

హైదరాబాద్, వెలుగు: మెగా డీఎస్సీ నోటిఫికేషన్ రిలీజ్ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. మొత్తం 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేయాలని నిర్ణయించింది. అయితే, ఇప్పటికే 5,089 టీచర్ పోస్టుల భర్తీకి గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది. తాజాగా కాంగ్రెస్ సర్కార్ మరో 5,973 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు జీవో 26, 27ను రిలీజ్ చేసింది. పాత డీఎస్సీ నోటిఫికేషన్ రద్దు చేసి.. ఒకటి రెండ్రోజుల్లో 11,062 టీచర్ పోస్టులు భర్తీ చేసేందుకు కొత్త నోటిఫికేషన్ ఇవ్వనుంది.

1,016 స్పెషల్ టీచర్ పోస్టులు

అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం 5,089 పోస్టుల భర్తీకి గత సెప్టెంబర్ లో నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. అక్టోబర్ నెలాఖరు దాకా అప్లై చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. దీంతో 1,77,502 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. నవంబర్​లో ఎగ్జామ్ పెడ్తామని ప్రకటించింది. తక్కువ పోస్టులు ఉండటంతో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. 

ఆ తర్వాత అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పరీక్ష వాయిదా వేశారు. ఈ క్రమంలో తాము అధికారంలోకి రాగానే మెగా డీఎస్సీ వేస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. దీంతో పాత పోస్టులతో పాటు మరో 4,957 జనరల్ టీచర్ పోస్టులు, 1,016 స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీకి తాజాగా ఫైనాన్స్ శాఖ అనుమతులు ఇచ్చింది. మొత్తంగా 11,062 పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉంది. వీటిలో ఎస్జీటీ పోస్టులు 7,304, స్కూల్ అసిస్టెంట్ పోస్టులు 2,849, పండిట్ పోస్టులు 727, పీఈటీ పోస్టులు 182 ఉన్నాయి.