మెగా ఫైట్‌‌: పాక్ పై భారత్ ట్రాక్ రికార్డులు

మెగా ఫైట్‌‌: పాక్ పై భారత్ ట్రాక్ రికార్డులు
  • ఇయ్యాల్నే ఇండియా, పాక్​ ‘ఢీ’‑20
  • ఫేవరెట్‌‌‌‌గా టీమిండియా    గెలుపే లక్ష్యంగా బరిలోకి బాబర్‌‌‌‌సేన 
  • రాత్రి 7:30 నుంచి స్టార్‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌లో

ఒక్కో రన్​.. అభిమానానికి ఊపిరి పోస్తుంది..! ఒక్కో బాల్​.. ఆటగాడిని నిలువెల్లా వణికించేస్తుంది..! ఒక్కో షాట్‌‌‌‌.. బౌలర్లనూ చేష్టలుడిగేలా చేస్తుంది..! బ్యాట్‌‌‌‌కు, బాల్‌‌‌‌కు మధ్య యుద్ధంలా సాగే.. టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌కే వన్నె తెచ్చే అసలు మ్యాచ్‌‌‌‌కు సమయం ఆసన్నమైంది..! ఫైనల్లో ఓడినా పెద్దగా పట్టించుకోం.. ఆస్ట్రేలియా, ఇంగ్లండ్‌‌‌‌ చేతిలో చిత్తయినా చింతలేదు..! కానీ, పొరుగు దేశం పాకిస్తాన్‌‌‌‌ చేతిలో ఓటమిని మాత్రం జీర్ణించుకోలేం..! గెలిస్తే.. విశ్వాన్ని జయించినంతగా సంబురపడతాం..! ఓడితే... ఆగ్రహంతో కారు చీకట్లు కమ్ముకుంటాయి..! కోట్లాది హృదయాలు మూగబోతాయి..! లక్షలాది గుండెలు భగ్గుమంటాయి..! హీరోలు.. జీరోలు అవుతారు.. పూల వర్షం పడిన చోట.. రాళ్ల వర్షం కురుస్తుంది..! ఎవరూ ఊహించని, మరెవరూ  ఆలోచించలేని, మహాద్భుత ఘట్టాలు.. హై ఓల్టేజ్‌‌‌‌ ఉత్కంఠలు.. ఊపిరి బిగపట్టే క్షణాలు.. ఉప్పొంగే నరాలకు.. వేదిక కానున్న ఇండియా, పాకిస్తాన్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌కు రంగం సిద్ధమైంది..!!

టీ 20 వరల్డ్‌‌‌‌ కప్‌‌‌‌  మొత్తం ఒక ఎత్తయితే.. ఇండియా, పాకిస్తాన్‌‌‌‌  మ్యాచ్​ మరో ఎత్తు. అందరూ ఈ మ్యాచ్​ కోసమే ఉత్కంఠగా చూస్తున్నారు. ఆ టైమ్​ వచ్చేసింది. ఆదివారం సాయంత్రం ఇరు జట్ల మధ్య పోరాటం జరగనుంది. ఇప్పటివరకు అన్ని మెగా టోర్నీల్లో కలిపి ఇరుజట్ల మధ్య 12 మ్యాచ్‌‌‌‌లు జరిగితే అన్నింటా టీమిండియానే గెలిచింది. ఈ మ్యాచ్‌‌‌‌లోనూ కోహ్లీ సేననే ఫేవరెట్‌‌‌‌.

దుబాయ్‌‌‌‌: టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ ఫలితం మొత్తం ఒక ఎత్తు అయితే.. ఇండియా, పాకిస్తాన్‌‌‌‌ రిజల్ట్‌‌‌‌ మరో ఎత్తు. ఏళ్లకు ఏళ్లుగా ఇరుజట్ల మధ్య ఆట జరగకపోయినా.. ఆడే ఒకే ఒక్క మ్యాచ్‌‌‌‌తోనే వరల్డ్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ను ఊపేస్తుంది. రిక్షా కూలీ నుంచి దేశ ప్రధాని వరకు అందరూ ఆసక్తిగా, అంతే ఉత్కంఠతో తిలకిస్తారు. ఈ నేపథ్యంలో మరోసారి ఇండో–పాక్‌‌‌‌ పోరుకు సమయం వచ్చేసింది. సూపర్‌‌‌‌–12.. గ్రూప్‌‌‌‌–2లో నేడు (ఆదివారం) ఇరుజట్ల మధ్య అసలు పోరాటం జరగనుంది. 2019 వన్డే వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ తర్వాత తొలిసారిగా దాయాది దేశాలు పోటీపడుతుండటంతో ఈ మ్యాచ్‌‌‌‌పై విపరీతమైన అంచనాలు నెలకొన్నాయి.  దీంతో అటు ప్లేయర్లతో పాటు ఇటు ఇరుదేశాల అభిమానుల మధ్య ఇప్పటికే ఓ రకమైన వార్‌‌‌‌ క్రియేట్‌‌‌‌ అయ్యింది. ఇక హిస్టరీ పరంగా చూసినా, ఆట పరంగా చూసినా ఐసీసీ మెగా ఈవెంట్లలో ఎప్పుడూ ఇండియాదే పైచేయి. అన్ని మెగా టోర్నీల్లో కలిపి ఇరుజట్ల మధ్య 12 మ్యాచ్‌‌‌‌లు జరిగితే అన్నింటిలోనూ టీమిండియానే గెలిచింది. కాబట్టి ఈ మ్యాచ్‌‌‌‌లోనూ కోహ్లీసేననే ఫేవరెట్‌‌‌‌గా బరిలోకి దిగుతోంది. 2007లో టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ మొదలైనప్పటి నుంచి ఇప్పటిదాకా ఇరుజట్ల మధ్య జరిగిన అన్ని మ్యాచ్‌‌‌‌ల్లోనూ ఇండియానే గెలవడం, ఇవన్నీ ధోనీ కెప్టెన్సీలో రావడం మరో విశేషం. ఇప్పుడు అదే ధోనీ మెంటార్‌‌‌‌గా రావడంతో జోష్‌‌‌‌ , పోటీ రెట్టింపైంది. ఇరుజట్లు తమకు మరో మ్యాచ్‌‌‌‌ మాత్రమే అంటున్నా.. తెర వెనుక ఒత్తిడి మాత్రం ఓ రేంజ్‌‌‌‌లో పెరిగిపోతున్నది. ఈ నేపథ్యంలో ఈ హై వోల్టేజ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో గెలుపు గీత దాటేదెవరో చూడాలి. 

ఆరో బౌలర్‌‌‌‌‌‌‌‌పై అదే సస్పెన్స్‌‌‌‌‌‌‌‌..
హైవోల్టేజ్‌‌‌‌‌‌‌‌ పోరుకు సిద్ధమైన కోహ్లీసేన అన్ని ఏరియాల్లో బలంగా కనిపిస్తోంది. అయితే హార్దిక్‌‌‌‌‌‌‌‌ పాండ్యా బౌలింగ్‌‌‌‌‌‌‌‌ వేయడని కెప్టెన్‌‌‌‌‌‌‌‌ శనివారం ఇన్‌‌‌‌‌‌‌‌డైరెక్ట్‌‌‌‌‌‌‌‌గా చెప్పడంతో ఆరో బౌలర్‌‌‌‌‌‌‌‌పై సస్పెన్స్‌‌‌‌‌‌‌‌ కొనసాగుతోంది. కెప్టెన్‌‌‌‌‌‌‌‌గా విరాట్‌‌‌‌‌‌‌‌కు ఇది చివరి టీ20 వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌  కావడంతో, ఈ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లో గెలవడం అతనికి ప్రతిష్టగా మారింది.  రోహిత్‌‌‌‌‌‌‌‌, రాహుల్‌‌‌‌‌‌‌‌, కోహ్లీ, సూర్యకుమార్, రిషబ్‌‌‌‌‌‌‌‌ పంత్‌‌‌‌‌‌‌‌తో టాప్‌‌‌‌‌‌‌‌ ఆర్డర్‌‌‌‌‌‌‌‌ చాలా బలంగా కనిపిస్తోంది.  టోర్నీకి ముందు జరిగిన వామప్‌‌‌‌‌‌‌‌ మ్యాచ్‌‌‌‌‌‌‌‌లు, ఐపీఎల్‌‌‌‌‌‌‌‌లో సత్తా చాటారు. ప్రి మ్యాచ్‌‌‌‌‌‌‌‌ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌లో కోహ్లీ... తన వ్యాఖ్యలతో హార్దిక్‌‌‌‌‌‌‌‌ తుది జట్టులో ఉండటం ఖాయమనే సంకేతాలిచ్చాడు. హార్దిక్‌‌‌‌‌‌‌‌ బౌలింగ్‌‌‌‌‌‌‌‌ చేసే చాన్స్‌‌‌‌‌‌‌‌ లేకపోగా అతన్ని బ్యాటర్‌‌‌‌‌‌‌‌గా పరిగణిస్తే ఆ ప్లేస్‌‌‌‌‌‌‌‌కు ఇషాన్‌‌‌‌‌‌‌‌ కిషన్‌‌‌‌‌‌‌‌ నుంచి పోటీ ఉంటుంది. ప్రస్తుత ఫామ్‌‌‌‌‌‌‌‌ను పరిగణనలోకి తీసుకుంటే ఇషాన్‌‌‌‌‌‌‌‌ను తీసుకోవడం మంచి ఆప్షన్‌‌‌‌‌‌‌‌. కానీ కోహ్లీ మాత్రం పాండ్యా వైపే మొగ్గుతున్నాడు. బౌలింగ్‌‌‌‌‌‌‌‌లోనూ ఇండియాకు తిరుగులేదు. బుమ్రా,  షమీ, జడేజా, వరుణ్‌‌‌‌‌‌‌‌ చక్రవర్తి తుది జట్టులో ఉండటం ఖాయం. అయితే భువనేశ్వర్‌‌‌‌‌‌‌‌, శార్దూల్‌‌‌‌‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌లో మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ ఎవరికి ఓటేస్తుందో చూడాలి.  ఆల్‌‌‌‌‌‌‌‌రౌండర్‌‌‌‌‌‌‌‌గా శార్దూల్‌‌‌‌‌‌‌‌ను బరిలోకి దించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.  ముగ్గురు స్పిన్నర్ల స్ట్రాటజీకి వెళ్తే అశ్విన్‌‌‌‌‌‌‌‌తోపాటు రాహుల్‌‌‌‌‌‌‌‌ చహర్‌‌‌‌‌‌‌‌ అందుబాటులో ఉంటాడు.   

బాబర్‌‌‌‌పైనే భారం..
ఈ మ్యాచ్‌‌‌‌ కోసం పాకిస్తాన్‌‌‌‌ 12 మందితో టీమ్‌‌‌‌ను ప్రకటించింది. అయితే కెప్టెన్‌‌‌‌ బాబర్‌‌‌‌ ఆజమ్‌‌‌‌ను ‘కింగ్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌’ అంటూ ఆకాశానికెత్తేస్తున్నది. ఇది నిజమో కాదో తెలియాలంటే మ్యాచ్‌‌‌‌ వరకు ఆగాల్సిందే. అయితే మెగా ఈవెంట్‌‌‌‌లో ఇండియాపై ఎప్పుడూ గెలవలేదనే ఒత్తిడి పాక్‌‌‌‌పై ఓ అస్త్రంలా పని చేస్తుండటం టీమిండియాకు కలిసొచ్చే అంశం. వెస్టిండీస్‌‌‌‌తో జరిగిన వామప్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో ధనాధన్‌‌‌‌ హాఫ్‌‌‌‌ సెంచరీ చేసిన ఆజమ్‌‌‌‌ సూపర్‌‌‌‌ ఫామ్‌‌‌‌లో ఉన్నాడు. ఆజమ్‌‌‌‌తోపాటు ఫకర్‌‌‌‌ జమాన్‌‌‌‌, ఆసిఫ్‌‌‌‌ అలీతో టాప్‌‌‌‌ ఆర్డర్‌‌‌‌ బలంగా కనిపిస్తోంది. సీనియర్లు షోయబ్‌‌‌‌ మాలిక్‌‌‌‌, మహ్మద్‌‌‌‌ హఫీజ్‌‌‌‌తో మిడిలార్డర్‌‌‌‌ కూడా స్ట్రాంగ్‌‌‌‌గా ఉంది. గత వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ల్లో ఇండియాపై ఆడిన అనుభవం ఉండటం వీరికి అడ్వాంటేజ్‌‌‌‌. వీళ్లలో ఏ ఒక్కరు చెలరేగినా భారీ స్కోరు ఖాయం. బౌలింగ్‌‌‌‌ విషయానికొస్తే  లెఫ్టార్మ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌ ఇమాద్‌‌‌‌ వసీమ్‌‌‌‌  నుంచి ఇండియాకు ముప్పు పొంచి ఉంది. యూఏఈ గ్రౌండ్స్‌‌‌‌లో అద్భుతమైన రికార్డు ఉన్న ఇమాద్‌‌‌‌... పరిస్థితులకు తగ్గట్టు బౌలింగ్‌‌‌‌ చేయడంలో దిట్ట.  ప్రస్తుతం మంచి టచ్‌‌‌‌లో కూడా ఉన్నాడు. హసన్‌‌‌‌ అలీ, రవూఫ్ , షాహీన్‌‌‌‌ అఫ్రిదితో కూడిన పేస్‌‌‌‌ అటాక్‌‌‌‌తో కోహ్లీ సేనకు పరీక్ష తప్పదు. యూఏఈలోని స్లో వికెట్లపై చెలరేగే అఫ్రిది.. తమ టీమ్‌‌‌‌ ఆడిన రెండు వామప్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల్లో నాలుగు వికెట్లు తీశాడు. 

4-0 టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ల్లో ఇండియా, పాకిస్తాన్‌‌‌‌ ఇప్పటిదాకా ఐదు సార్లు తలపడగా నాలుగుసార్లు ఇండియా గెలిచింది. ఒక మ్యాచ్‌‌‌‌ టై అయ్యింది.
192 టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల్లో పాక్‌‌‌‌పై ఇండియా హయ్యెస్ట్‌‌‌‌ స్కోరు
119 టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌ల్లో పాక్‌‌‌‌పై ఇండియా లోయెస్ట్‌‌‌‌ స్కోరు
8 2018 తర్వాత ఇండియా 8 టీ20ల్లో ఓడింది. ఇవన్నీ 160 కంటే తక్కువ స్కోరు మ్యాచ్‌‌లు. అదే 161-180 మధ్య స్కోరు చేసిన 11 మ్యాచ్‌‌ల్లో కేవలం రెండింటిలో మాత్రమే ఓడింది.
1170 లాస్ట్‌‌ త్రీ ఇయర్స్‌‌లో బాబర్‌‌ చేసిన రన్స్‌‌ ఇవి. కోహ్లీ (993) సెకండ్‌‌ ప్లేస్‌‌లో ఉన్నాడు. 

జట్లు (అంచనా)  
ఇండియా: కోహ్లీ (కెప్టెన్‌‌‌‌), రోహిత్‌‌‌‌, రాహుల్‌‌‌‌, సూర్యకుమార్‌‌‌‌, రిషబ్‌‌‌‌ పంత్‌‌‌‌, హార్దిక్‌‌‌‌, జడేజా, శార్దూల్‌‌‌‌ ఠాకూర్‌‌‌‌, వరుణ్‌‌‌‌ చక్రవర్తి / అశ్విన్‌‌‌‌, భువనేశ్వర్‌‌‌‌ / షమీ, బుమ్రా. 
పాకిస్తాన్‌‌‌‌: బాబర్‌‌‌‌ ఆజమ్‌‌‌‌ (కెప్టెన్‌‌‌‌), రిజ్వాన్‌‌‌‌, ఫకర్‌‌‌‌ జమాన్‌‌‌‌, మహ్మద్‌‌‌‌ హఫీజ్‌‌‌‌ / హైదర్‌‌‌‌ అలీ, షోయబ్‌‌‌‌, ఆసిఫ్‌‌‌‌ అలీ, షాదాబ్‌‌‌‌, ఇమాద్‌‌‌‌ వసీమ్‌‌‌‌, హసన్‌‌‌‌ అలీ, హారిస్‌‌‌‌ రవూఫ్​, షాహీన్‌‌‌‌ ఆఫ్రిది. 

పిచ్‌‌‌‌, వాతావరణం
స్లో వికెట్‌‌‌‌. స్లో బౌలర్లకు చాలా అడ్వాంటేజ్‌‌‌‌. పేస్‌‌‌‌లో వేరియేషన్స్‌‌‌‌ను రాబడితే వికెట్లు దక్కొచ్చు. లో స్కోరింగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌. మంచు ప్రభావం ఉంది. టాస్‌‌‌‌ కీలకం కానుంది. వర్షం ముప్పు లేదు.