ఎల్కతుర్తి, వెలుగు: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో సోమవారం నిర్వహించిన మెగా హెల్త్ క్యాంపునకు విశేష స్పందన లభించింది. మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో, వరంగల్ కాకతీయ వైద్య కళాశాల, హనుమకొండ జిల్లా వైద్య ఆరోగ్య శాఖల సంయుక్త ఆధ్వర్యంలోఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరంలో 762 మందికి పరీక్షలు నిర్వహించి, మందులు అందించారు. శిబిరాన్ని కలెక్టర్ స్నేహ శబరీష్ ప్రారంభించారు. ఓపీ నమోదు, హెల్ప్ డెస్క్, ల్యాబ్, ప్రాథమిక పరీక్షల కౌంటర్లను కలెక్టర్ పరిశీలించారు.
కాకతీయ వైద్య కళాశాలకు చెందిన పది విభాగాలు, ఎంజీఎం ఆస్పత్రి నుంచి 38 మంది స్పెషలిస్ట్ లు, 60 మంది పీజీ విద్యార్థులు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, పారామెడికల్ సిబ్బంది, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తరఫున 35 మంది డాక్టర్లు, సూపర్వైజర్లు, ల్యాబ్ టెక్నీషియన్లు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు సేవలందించారు. ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన ఎగ్జిబిషన్ ఏర్పాటు చేశారు.
93 మందికి ఒక్కరికి దాదాపుగా రూ.1800 చొప్పున రూ. 1,67,000 వేల విలువైన ల్యాబ్ పరీక్షలు,122 మందికి రూ. 16వేల విలువైన రాండమ్ బ్లడ్ షుగర్ పరీక్షలు, రూ. 2 లక్షల కు పైగా విలువ చేసే మందులను పంపిణీ చేశారు. మొత్తం 762 మందికి వైద్య సేవలందించారు. మెరుగైన పరీక్షల కోసం 115 మందిని ఎంజీఎం, జీఎంహెచ్ లకు రెఫర్ చేశారు. కేఎంసీ ప్రిన్సిపాల్ సంధ్య, ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ హరిశ్చంద్రారెడ్డి, డీఎంహెచ్వో అప్పయ్య, కాజీపేట ఏసీపీ ప్రశాంత్ రెడ్డి పర్యవేక్షించారు.
