
అభిమానులు ప్లాస్మా డొనేట్ చేయాలని చిరంజీవి పిలుపు
దాతలకు సైబరాబాద్ సీపీ సజ్జనార్ తో కలిసి సత్కారం
హైదరాబాద్, వెలుగు: కరోనా మహమ్మారితో ప్రాణాపాయంలో ఉన్నవారికి ప్లాస్మా డొనేట్ చేయాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు. కరోనా సివియర్ గా ఉన్న వాళ్లకు ప్లాస్మా సంజీవనిగా మారిందన్నారు. బ్లడ్ డొనేషన్ మాదిరిగానే అభిమానులు ప్లాస్మా డొనేట్ చేయటంతో పాటు ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. శుక్రవారం సైబరాబాద్ పోలీసులు ప్లాస్మా దాతలకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రొగ్రాం కు చిరంజీవి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. సీపీ సజ్జనార్ తో కలిసి 150 మంది ప్లాస్మా డొనర్స్ కు చిరంజీవి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ప్లాస్మా డొనర్ ను చిరంజీవి రియల్ హీరోస్ అంటూ అభినందించారు. కరోనా నుంచి కోలుకున్నవారంతా ప్లాస్మా ఇచ్చేందుకు ముందుకు రావాలన్నారు. సైబరాబాద్ సీపీ సజ్జనార్ ప్రయత్నాన్ని మెగాస్టార్ అభినందించారు.
తన బంధువుల్లో ఒకరికి కరోనా వస్తే బ్లడ్ బ్యాంక్ ప్రతినిధి ప్లాస్మా డొనేట్ చేశారని చిరంజీవి చెప్పారు. కరోనా వచ్చిందని మనస్తాపంతో చనిపోతున్న వారిని చూస్తే బాధనిపిస్తోందని, తన ఇంట్లో పనిచేసే నలుగురు వర్కర్స్ కు కరోనా వచ్చిందని వాళ్లు కోలుకొని మళ్లీ డ్యూటీకి వస్తున్నారని చెప్పారు. చిరంజీవి బ్లడ్ డొనేషన్ సహా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తు న్నారు. ప్లాస్మా డోనర్స్ సన్మాన కార్యక్రమానికి వచ్చిన చిరంజీవికి ధన్యవాదాలు. ప్లాస్మా డోనర్స్ కు అపోహాలు అవసరం లేదు. కోవిడ్ కంట్రోల్ రూమ్ ద్వారా 250 మంది నుంచి ప్లాస్మా కలెక్ట్ చేశాం. దీంతో 400 మంది కరోనా పేషెంట్లను కాపాడాం. కరోనాను జయించిన వారు తప్పకుండా ప్లాస్మా దానం చెయ్యాలి. -సజ్జనార్, సీపీ సైబరాబాద్