Megastar Chiranjeevi: మారుమూల పల్లె నుంచి ప్రయాణం..ప్రపంచ నలుమూలల అభిమానం

Megastar Chiranjeevi: మారుమూల పల్లె నుంచి ప్రయాణం..ప్రపంచ నలుమూలల అభిమానం

నటనతో అదరగొడతాడు. తెలుగు ఇండస్ట్రీకి బ్రేక్ డ్యాన్స్ పరిచయం చేశాడు. ఇక ఆయన ఫైట్స్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఆరు పదుల వయసు దాటినా ఎనర్జిటిక్ లుక్స్తో యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నాడు. మారుమూల పల్లె నుంచి ప్రయాణం మొదలుపెట్టి తెలుగు సినీ ఇండస్ట్రీలో అగ్రస్థానానికి చేరుకున్నాడు. తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చెరిగిపోని ముద్ర వేసిన ఆయనే మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi ).

1978లో పునాదిరాళ్లు సినిమాతో అరంగేట్రం చేసిన చిరంజీవి..తన బహుముఖ నటనా నైపుణ్యంతో ప్రేక్షకులను అలరిస్తున్నారు.ఇటీవల, చిరంజీవిని భారత ప్రభుత్వం రెండవ అత్యున్నత పౌర పురస్కారం పద్మ విభూషణ్‌తో సత్కరించింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా సమక్షంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా చిరంజీవి ఈ ప్రతిష్టాత్మక అవార్డును అందుకున్నారు. ఈ వేడుక మే 9న దేశ రాజధానిలోని రాష్ట్రపతి భవన్‌లో జరిగింది. ఈ రోజు గురువారం (ఆగస్ట్ 22) ఆయన 69వ పుట్టిన రోజు సందర్భంగా చిరు గురించి కొన్ని విశేషాలు తెలుసుకుందాం.

నటనలో శిక్షణ

చిరంజీవి అసలు పేరు.. కొణిదెల శివశంకర వరప్రసాద్. 1955 ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో జన్మించారు. తండ్రి కొణిదెల వెంకట్రావు, తల్లి అంజనాదేవి. ముగ్గురు పిల్లల్లో చిరంజీవి పెద్ద. తండ్రి పోలీస్ కానిస్టేబుల్ కావడంతో ఉద్యోగరీత్యా పలు ప్రాంతాలకు బదిలీ అవుతుండేది. దీంతో చిరంజీవి విద్యాభ్యాసం నిడదవోలు, గురజాల, బాపట్ల, పొన్నూరు, మంగళగిరి, మొగల్తూరులో సాగింది. ఎన్సీసీలో చేరి న్యూఢిల్లీలో జరిగిన పరేడ్ లో పాల్గొన్నాడు. ఒంగోలులోని సీ.ఎస్.ఆర్ శర్మ కాలేజ్ నుంచి ఇంటర్మీడియట్, నరసాపురంలోని శ్రీ వై.ఎన్. కళాశాల నుంచి కామర్స్ పట్టా అందుకున్నారు. చిన్నప్పటి నుంచి నటనపై ఆసక్తి ఉండటంతో1976లో చెన్నై వెళ్ళి మద్రాస్ ఫిల్మ్ ఇన్‌స్టిట్యూట్లో చిరంజీవి శిక్షణ తీసుకున్నారు.

ఖైదీ సినిమాతో క్రేజ్

1978లో “పునాదిరాళ్లు” సినిమాతో చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయమయ్యారు. కానీ 'ప్రాణం ఖరీదు' సినిమా ముందుగా రిలీజైంది. విలన్ పాత్రలను సైతం కాదనకుండా నటిస్తూ.. మల్టీస్టారర్ చిత్రాలలో కూడా  తళుక్కుమన్నారు.  1980లో చిరంజీవి ప్రముఖ హాస్యనటుడు అల్లు రామలింగయ్య కుమార్తె సురేఖను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు సుస్మిత, శ్రీజ. కొడుకు రాంచరణ్ తేజ్. అల్లు అరవింద్ చిరంజీవి బావమరిదే . 1983లో కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన' ఖైదీ' సినిమాతో చిరంజీవికి స్టార్‌డమ్‌ వచ్చింది.అప్పట్లోనే ఈ సినిమా రూ.4 కోట్లకుపైగా వసూలు చేసి ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసింది. దీంతో చిరంజీవి కెరీర్‌లో వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ‘ఖైదీ’ సినిమాతో సూపర్ డూపర్ హిట్ కావడంతో అవకాశాలు క్యూ కట్టాయి.  ఆ సినిమా తర్వాత వచ్చిన మంత్రి గారి వియ్యంకుడు, సంఘర్షణ, ఛాలెంజ్, హీరో, దొంగ, జ్వాల, అడవి దొంగ, కొండవీటి రాజా, రాక్షసుడు, జగదేకవీరుడు అతిలోకసుందరి, గ్యాంగ్ లీడర్, ఇంద్ర, స్టాలిన్, శంకర్ దాదా  MBBS, జిందాబాద్,  ఖైదీనెంబర్ 150, ఆచార్య  వరుస విజయాలను అందించాయి. దీంతో చిరు సుప్రీమ్ స్టార్ అయ్యాడు.. విజేత, స్వయంకృషి, రుద్రవీణ వంటి సందేశాత్మక చిత్రాలతో సైతం మెప్పించాడు. రుద్రవీణ చిత్రానికిగానూ జాతీయ ఉత్తమ సమగ్రతా చిత్రం అవార్డు కూడా వచ్చింది.ఇప్పటివరకు 155కిపైగా సినిమాలు పూర్తి చేసిన చిరంజీవి..తాజాగా విశ్వంభర మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమయ్యారు. 

యాక్టింగ్ నుంచి బ్రేక్

2007లో విడుదలైన శంకర్ దాదా జిందాబాద్ తర్వాత చిరంజీవి యాక్టింగ్ నుంచి బ్రేక్ తీసుకున్నారు. అదే సమయంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. పదేళ్ళ పాటు నటనకు దూరంగా ఉన్న మెగాస్టార్.. అడపా దడపా అతిథి పాత్రల్లో కనిపించాడు. 2009లో కొడుకు రాం చరణ్ నాయకుడిగా వచ్చిన మగధీర, 2015లో వచ్చిన బ్రూస్ లీ చిత్రాల్లో కనిపించారు. 2010 లో వచ్చిన వరుడు, 2015లో వచ్చిన రుద్రమదేవి చిత్రాలకు వాయిస్ ఓవర్ ఇచ్చారు. 2001 లో వచ్చిన శ్రీమంజునాథ చిత్రంలో శివుడి పాత్రలాగానే 2013 లో వచ్చిన శ్రీ జగద్గురు ఆదిశంకర చిత్రంలో శివుడిగా అతిథి పాత్రలో కనిపించాడు.

పొలిటికల్ ఎంట్రీ

సినిమాల్లో స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలోనే మెగాస్టార్ ఒక్కసారిగా రాజకీయాలవైపు మళ్లారు. 2008 ఆగస్టులో ‘ప్రజారాజ్యం పార్టీ’ని స్థాపించిన ఆయన.. 2009 సార్వత్రిక ఎన్నికల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని 295 అసెంబ్లీ స్థానాలకు పోటీ చేశారు. అయితే కేవలం 18 సీట్లలో మాత్రమే విజయం సాధించారు. 2011 ఫిబ్రవరిలో ప్రజారాజ్యం పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైంది. ఆ తర్వాత మార్చి 2012లో రాజ్యసభకు ఎన్నికైన చిరంజీవి కేంద్ర పర్యాటక శాఖ మంత్రిగా కూడా పని చేశారు.

బాస్ రీ ఎంట్రీ

రాజకీయాల కారణంగా సినిమాలకు దూరమైన మెగాస్టార్ చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్ ‘ఖైదీ నంబర్ 150’ సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. సినిమాలో నటన, డ్యాన్స్, డైలాగ్ డెలివరీతో ఆకట్టుకున్నారు. ఆ తర్వాత ‘సైరా నరసింహారెడ్డి’ ఆచార్య, గాడ్ ఫాదర్,వాల్తేరు వీరయ్య, భోళా శంకర్ సినిమాలు చేశాడు. ఈరోజు 69వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న చిరు..ప్రస్తుతం వశిష్టతో ‘విశ్వంభర’ సినిమాతో వస్తున్నాడు. 

సేవా కార్యక్రమాలతో రియల్ హీరోగా.. 

ఇక చిరంజీవి సేవా కార్యక్రమాల ద్వారా రియల్ హీరో అనిపించుకున్నారు. రక్తదానం, నేత్రదానం అంటూ ఎంతో మంది ప్రాణాలను కాపాడేందుకు బాటలు వేశారు. కరోనా సమయంలో ఎంతో మందికి ఎన్నో రకాలుగా సాయం చేశారు. మూవీ ఇండస్ట్రీ అంతటిని ఏకతాటిపైకి తీసుకొచ్చి సీసీసీ కోసం నిధులు సేకరించారు. కరోనా సమయంలో సినీ శ్రామికులకు నిత్యావసర సరుకులు అందించి ఎన్నో కుటుంబాలను ఆదుకున్నారు చిరు.