సినిమా పైరసీ సైట్ ఇబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి అరెస్ట్ సందర్భంగా హైదరాబాద్ సీపీ సజ్జనార్ ప్రెస్ మీట్ నిర్వహించారు. సోమవారం ( నవంబర్ 17 ) నిర్వహించిన ఈ ప్రెస్ మీట్ లో టాలీవుడ్ తరపున మెగాస్టార్ చిరంజీవి, అక్కినేని నాగార్జున, నిర్మాతలు సురేష్ బాబు, దిల్ రాజు, డైరెక్టర్ రాజమౌళి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు చిరంజీవి. ఇండస్ట్రీ బాధను అర్థం చేసుకొని ఇమ్మడి రవిని అరెస్ట్ చేసిన తెలంగాణ పోలీసులకు ధన్యవాదాలని అన్నారు. రవి పోలీసులకే సవాలు విసరడాన్ని తట్టుకోలేకపోయామని అన్నారు చిరంజీవి.
సినీ ఇండస్ట్రీ మీద చాలామంది ఆధారపడి ఉన్నారని.. వాళ్ళ కష్టాన్ని దౌర్జన్యంగా దోచుకుంటుంటే బాధగా ఉంటుందని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ పైరసీ నుంచి ఎలా తప్పించుకోవాలని ఆలోచిస్తూనే ఉన్నామని అన్నారు. ఇండస్ట్రీ మీద పరోక్షంగా లక్షల మంది ఆధారపడి ఉన్నారని.. లైట్ బాయ్ దగ్గర నుంచి పెద్ద పెద్ద డైరెక్టర్ల వరకు ఇండస్ట్రీపై ఆధారపడి ఉన్నామని అన్నారు చిరంజీవి. ఇంతమంది కష్టాన్ని ఒకడు దౌర్జన్యంగా దోచుకోవడమే కాకుండా తిరిగి పోలీసులకే సవాలు విసరడం తట్టుకోలేకపోయామని అన్నారు చిరంజీవి.
గతంలో సీవీ ఆనంద్, ఇప్పుడు సజ్జనార్ పైరసీ భూతాన్ని అంతం చేసేందుకు కృషి చేసి నిందితుడిని పట్టుకున్నారని అన్నారు. ఈ కేసులో పనిచేసిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు చిరంజీవి. ప్రజలు కూడా సినిమా తమదిగా భావించాలని.. పైరసీని ఎంకరేజ్ చేయొద్దని కోరారు. ఈ ఏడాది చాలా సినిమాలు పైరసీ చేశారని.. దీనివల్ల ఎంతో నష్టం జరిగిందని అన్నారు చిరంజీవి.
