సీఎం కేసీఆర్‌‌కు థ్యాంక్స్ చెప్పిన మెగాస్టార్

సీఎం కేసీఆర్‌‌కు థ్యాంక్స్ చెప్పిన మెగాస్టార్

తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లు పెంచేందుకు అంగీకారం తెలిపిన రాష్ట్ర సర్కారుకు మెగాస్టార్ చిరంజీవి థ్యాంక్స్ చెప్పారు. ‘‘తెలుగు సినిమా పరిశ్రమ కోరికని మన్నించి, నిర్మాతలకు, పంపిణీదారులకు, థియేటర్ యాజమాన్యానికి అన్ని వర్గాల వారికీ న్యాయం కలిగేలా సినిమా టికెట్ రేట్స్ సవరించిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌‌కు కృతజ్ఞతలు. సినిమా థియేటర్ల  మనుగడకు, వేలాదిమంది కార్మికులకు ఎంతో మేలు కలిగే నిర్ణయం ఇది” అంటూ చిరు ట్వీట్ చేశారు.

కాగా, తెలంగాణలో సినిమా టికెట్ల రేట్లు పెంపుపై నిన్న రాష్ట్ర సర్కారు ఉత్తర్వులు జారీ చేసింది. అధికారుల కమిటీ సిఫారసులతో టికెట్ ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది ప్రభుత్వం. AC థియేటర్లలో కనిష్టంగా 50 రూపాయల నుంచి 150 రూపాయల వరకు టికెట్ ధర ఉండొచ్చని ప్రభుత్వం తెలిపింది. మల్టిప్లెక్స్ లలో కనిష్టంగా 100 రూపాయల నుంచి 250 వరకు ఉండొచ్చని స్పష్టం చేసింది. అలాగే మల్టీ ప్లెక్స్ లలోని రెక్లైనర్ సీట్లకు 300 రూపాయలు ధర నిర్ణయించింది. టికెట్ ధరలపై GST అదనమని ప్రభుత్వం ప్రకటించింది.

అయితే అటు ఏపీలో మాత్రం టికెట్ రేట్లు తగ్గించింది అక్కడి ప్రభుత్వం. దీనిపై రెండు మూడ్రోజులుగా వివాదం కూడా నడుస్తోంది. ప్రభుత్వం చెప్పిన రేట్ల కంటే ఎక్కువుగా టికెట్లు అమ్మితే థియేటర్లు కూడా సీజ్ చేస్తోంది ఏపీ ప్రభుత్వం. అక్కడి అధికారులు ఎప్పటికప్పుడు థియేటర్లలో చెకింగ్ చేస్తున్నారు. అధిక ధరలకు టికెట్లు అమ్మినట్లు తెలిస్తే.. సీజ్ చేస్తున్నారు అధికారులు. జనం పై టికెట్ భారం పడకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నామని ఏపీ ప్రభుత్వం చెబుతోంది.