
- చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరిక
హైదరాబాద్, వెలుగు: బీఆర్‌ఎస్ తమ సంస్థపై చేసిన ఆరోపణలు అవాస్తవం అని మెయిన్‌హార్ట్ ప్రకటించింది. జార్ఖండ్ ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్ట్‌ను తాము పూర్తి చేశామని, రాంచీ మునిసిపాలిటీ వర్క్ కంప్లీషన్ సర్టిఫికెట్ కూడా ఇచ్చిందని ఆ కంపెనీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. తమ హెడ్ క్వార్టర్ ఉన్న సింగపూర్ సహా పలు దేశాల్లో కన్‌స్ట్రక్షన్, ఇతర పనులను చేపడుతున్నామని, తమపై ఎలాంటి ఆరోపణలు లేవని తెలిపింది.
ఇండియాలో స్టాచ్యూ ఆఫ్ యూనిటీ, స్టాచ్యూ ఆఫ్ వన్‌నెస్, కోల్‌కతా మెట్రో, ఎక్స్‌ప్రెస్ వేస్, ఢిల్లీలోని జీ20 సమ్మిట్ వేదిక నిర్మాణం సహా అనేక పనుల్లో తాము భాగస్వాములుగా ఉన్నామన్నారు. హైదరాబాద్‌లో ఎస్‌ఏఎస్ ఐటీ టవర్స్ నిర్మాణం, రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్ ఎక్స్‌ప్యాన్షన్ వర్క్‌లో కూడా పనిచేశామని తెలిపారు.
తమ సంస్థపై తప్పుడు ఆరోపణలు చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని మెయిన్‌హార్ట్ హెచ్చరించింది. మెయిన్‌హార్ట్ కంపెనీకి మూసీ ప్రక్షాళన పనులు అప్పగిస్తున్న నేపథ్యంలో, అది తప్పుడు కంపెనీ అని బీఆర్‌ఎస్ ఆరోపణలు చేసింది. గతంలో ఇదే కంపెనీకి చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చాడని, ఇప్పుడు రేవంత్ ఆయన దారిలో నడుస్తున్నాడని బీఆర్‌ఎస్ విమర్శించింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఆరోపణలను ఖండిస్తూ మెయిన్‌హార్ట్ వివరణ ఇచ్చుకుంది.