డెంగీ పేరిట దోచుకుంటున్రు : రోజా రాధాకృష్ణశర్మ

డెంగీ పేరిట దోచుకుంటున్రు : రోజా రాధాకృష్ణశర్మ
  •     జడ్పీ సమావేశంలో సభ్యులు 

సిద్దిపేట, వెలుగు : డెంగీ, ప్లేట్ లెట్స్ పేరిట ప్రైవేటు ఆసుపత్రుల్లో సామాన్యులను దోచుకుంటున్నారని జడ్పీ సమావేశంలో సభ్యులు ఆరోపించారు. ఎలాంటి వసతులు లేకుండానే ఐసీయూలు ఏర్పాటు చేసి వేల రూపాయల్లో బిల్లు వేస్తున్నారని, వీటిని అడ్డుకోవడానికి జిల్లా వైధ్యాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.  బుధవారం సిద్దిపేట జడ్పీ చైర్​పర్సన్ రోజా రాధాకృష్ణశర్మ అధ్యక్షతన జిల్లా ప్రజా పరిషత్ సరసభ్య సమావేశం జరిగింది. ముందుగా హరిత విప్లవ పితామహుడు ఎంఎస్ స్వామినాథన్ మృతికి రెండు నిమిషాల మౌనం పాటించి ఆయన సేవలను కొనియాడారు.

జడ్పీటీసీ సభ్యుడు గిరి కొండల్ రెడ్డి మాట్లాడుతూ రుణ మాఫీ పూర్తిగా జరగలేదని, ధాన్యం కొనుగోలు సందర్భంగా పలు సమస్యలు ఎదురవుతున్నా ముందస్తు  జాగ్రత్తలు తీసుకోవడం లేదని అన్నారు.  ఈ విషయంపై తగిన చర్యలు తీసుకోవాలని జడ్పీ చైర్ పర్సన్ వ్యవసాయ శాఖ అధికారులకు సూచించారు. ట్రక్ షీట్లు, మిల్లులో అన్ లోడింగ్ విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని, వే బ్రిడ్జీ బిల్లులను తీసుకోవాలని కోరుతున్నా సివిల్ సప్లయ్ అధికారులు పట్టించుకోవడం లేదని సభ్యులు ఆరోపించారు.

ఎమ్మెల్సీ యాదవ రెడ్డి మాట్లాడుతూ రైతులకు ఇబ్బందులు కలుగవద్దనే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోళ్లు జరిపేలా చర్యలు తీసుకుందని తెలిపారు. సిద్దిపేట రూరల్ జడ్పీటీసీ శ్రీహరి మాట్లాడుతూ సీతారాంపల్లిలోని ఒక రైస్ మిల్లు యాజమాన్యం రైతులను ఇబ్బంది పెడుతున్నా వారిపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని సభ దృష్టికి తెచ్చారు.  కొమురవెల్లికి అంబులెన్స్ కేటాయింపులో జాప్యం జరుగుతుందని జడ్పీటీసీ సభ్యుడు సిద్ధప్ప  అన్నారు.  వర్గల్ జడ్పీటీసీ బాలమల్లు మాట్లాడుతూ  రెండో విడత గొర్రెwwల పంపిణీ కోసం డీడీలు కట్టి ఎనిమిది నెలలు అయినా ఇంత వరకు ఇవ్వలేదని చెప్పారు.

దీనిపై పశు సంవర్థక శాఖ అధికారులు మాట్లాడుతూ గొర్రెల కలెక్టర్ సూచనల ప్రకారం గొర్రెల పంపిణీ చేస్తున్నామని తెలిపారు. వ్యవసాయం విద్యా, వైద్యం, మహిళా, శిశు అభివృద్ధి, పంచాయతీ శాఖకు సంబంధించిన అంశాలపై చర్చించారు.

మెజార్టీ సభ్యుల గైర్హాజరు

జడ్పీ సర్వ సభ్య సమావేశానికి మెజార్టీ సభ్యులు హాజరు కాలేదు. అడిషనల్ కలెక్టర్ గరిమా అగర్వాల్, పది మంది జడ్పీటీసీలు, ఆరుగురు ఎంపీపీలు మాత్రమే సమావేశానికి హాజరు అయ్యారు. మూడు నెలలకు ఒకసారి జరిగే సమావేశానికి ప్రజా ప్రతినిధులు, ముఖ్య అధికారులు గైర్హాజరు కావడంతో తూతూ మంత్రంగా సభను నిర్వహించారు.