జయశంకర్‍ సార్​ స్మృతివనంలో కేసీఆర్‍ జ్ఞాపకాలు

జయశంకర్‍ సార్​ స్మృతివనంలో కేసీఆర్‍ జ్ఞాపకాలు

ఓ చోట సార్​ పక్కనే కేటీఆర్​ బొమ్మ!
అన్నిచోట్లా ప్రొఫెసర్​ చిన్నగా.. కేసీఆర్​ బొమ్మలు పెద్దగా ఏర్పాటు

ప్రత్యేక రాష్ట్ర సాధనే ఊపిరిగా బతికిన పోరాట యోధుడు, తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్​ సార్​ పేరిట హన్మకొండలో నిర్మిస్తున్న స్మృతివనంలో ఏర్పాటు చేసిన చిత్రాలివి. ఉద్యమానికి జయశంకర్​సార్​ చేసిన సేవలను యాది చేసుకోవాల్సిన చోట.. ఆయన కంటే సీఎం కేసీఆరే ఎక్కువగా కనిపించేలా బొమ్మలు పెట్టారు. సార్​ పోరాటాన్ని పక్కనపెట్టి.. కేసీఆర్​ దిక్షాదివస్​లో నిమ్మరసం తాగే చిత్రాన్ని, అసలు జయశంకర్​సార్​తో ఎప్పుడూ వేదికనే పంచుకోని మంత్రి కేటీఆర్​ చిత్రాన్ని ఏర్పాటు చేశారు. ఉద్యమ ఘట్టాలకు సంబంధించిన చిత్రాల్లో జయశంకర్ ​సార్​ కంటే కేసీఆర్​ బొమ్మలే పెద్దగా పెట్టారు. ఇది చూసిన ఉద్యమకారులు, సార్​ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

వరంగల్‍ రూరల్‍/ వరంగల్‍ వెలుగు: ప్రత్యేక రాష్ట్ర సాధనే ఊపిరిగా బతికిన మహా మనిషి ప్రొఫెసర్‍ జయశంకర్‍ సార్‍. తుదిశ్వాస విడిచే వరకు జై తెలంగాణే ఆయన నినాదం. కేసీఆర్‍  మొదలు వేలాది స్టూడెంట్లకు ఉద్యమ స్ఫూర్తి నింపిన గురువు, పోరాటయోధుడు ఆయన. 2011 జూన్‍ 21న జయశంకర్​సార్​ కన్నుమూశారు. అంత్యక్రియలకు ముందు అభిమానులు నివాళి అర్పించేందుకు ఆయన పార్థివదేహాన్ని హన్మకొండ ఏకశిల పార్క్​ బిల్డింగులో ఉంచారు. కేసీఆర్ సహా తెలంగాణ ఉద్యమకారులు, అభిమానులు వేల మంది వచ్చారు. భవిష్యత్‍ తరాలకు జయశంకర్‍ సేవలు గుర్తుండేలా ఆ పార్క్​ను ఆయన పేరుతో స్మృతివనంగా మార్చాలని నిర్ణయం తీసుకున్నారు. రూ. నాలుగున్నర కోట్లతో 2016లో పనులు ప్రారంభించారు. ఐదే నెలల్లో పనులు పూర్తి కావాల్సి ఉన్నా.. ఐదేండ్లుగా సాగుతూనే ఉన్నాయి.

చిన్నబోతున్న సార్​ ఫొటోలు

స్మృతివనం మధ్యలో సినిమా థియేటర్‍ స్క్రీన్‍  సైజ్‍లో పెద్ద గోడ కట్టారు. అక్కడికి వచ్చినవారు గోడను చూడగానే జయశంకర్​ సార్‍ గొప్పదనం ఏమిటో తెలిసేలా ఆయన బాల్యం నుంచి మరణం వరకు పది సన్నివేశాలు చిత్రీకరించాలని నిర్ణయించారు. ఇప్పుడు చూస్తే జయశంకర్‍  కంటే సీఎం కేసీఆరే ఎక్కువ యాదికొచ్చేలా బొమ్మలు చిత్రించారు. మరో నలుగురైదుగురు ఉద్యమ కారుల ఫోటోలున్నా వారిని పెద్దగా హైలైట్‍ చేయలేదు. అసలు జయశంకర్‍ కంటే కేసీఆర్‍ ఫోటోలే పెద్దగా గీశారు. ఉద్యమం అనగానే జయశంకర్​ సేవలు గుర్తుకు రావాల్సినచోట.. కేసీఆర్‍ దిక్షాదివస్‍లో నిమ్మరసం తాగే ఫోటో సెలక్ట్​ చేశారు. జయశంకర్​ జీవితంలో ఉద్యమ ఘట్టాలకు సంబంధించి నాలుగైదు చిత్రాలు చెక్కితే.. అందులో నాలుగింట్లో కేసీఆర్‍ ఫోటోలే పెద్దవిగా ఉన్నాయి. ఒక బొమ్మలో  మంత్రి కేటీఆర్​ కూడా ఉన్నారు. ఉద్యమం టైంలో ఎక్కడా కేటీఆర్‍, జయశంకర్‍ ఒకే వేదికపై లేకున్నా.. ఇక్కడ వారిద్దరూ చేతులు పైకెత్తి అభివాదం చేస్తున్నట్టుగా ఉన్న బొమ్మ పెట్టారు. ఇందులోనూ సార్‍  ఫోటోనే చిన్నగా ఉంది. కాకతీయ యూనివర్సిటీ వైస్​ చాన్సలర్‍గా జయశంకర్‍ సేవలు అందించగా.. రెండు చోట్ల ఉస్మానియా వర్సిటీ బిల్డింగ్‍ ఫొటోలే వాడారు. తెలంగాణ సిద్ధాంతకర్తగా జయశంకర్​ను భావితరాలకు చూపించాల్సిన స్మృతివనంలో.. కేసీఆర్, కేటీఆర్​ హైలైట్‍ అయ్యేలా చిత్రాలు పెట్టడంపై సార్‍ అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.