
న్యూఢిల్లీ: ఇండియా మెన్స్ హాకీ టీమ్.. జూనియర్ ఆసియా కప్‌లో అదరగొట్టింది. ఒమన్‌లో గురువారం జరిగిన పూల్–ఎ రెండో మ్యాచ్‌లో ఇండియా 3–1తో జపాన్ను ఓడించింది. ఇండియా తరఫున అరైజిత్ సింగ్ హుందాల్ (36వ ని.), శారదా నంద్ తివారీ (39వ ని.), ఉత్తమ్ సింగ్ (56వ ని.) గోల్స్ చేశారు. కుమెపి యసుదా (19వ ని.) జపాన్‌కు ఏకైక గోల్ అందించాడు. ఈ చాంపియన్‌షిప్‌లో టీమిండియాకు ఇది రెండో విక్టరీ. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో అటాకింగ్ గేమ్‌తో చెలరేగిన జపాన్ ఆరంభంలో గోల్‌తో లీడ్‌లోకి వెళ్లింది. దీని నుంచి తొందరగానే తేరుకున్న ఇండియా చిన్నచిన్న పాస్‌లతో బాల్‌ను ఆధీనంలో ఉంచుకుని వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంది. విరామం తర్వాత మరింత దూకుడుగా ఆడిన ఇండియా వరుస విరామాల్లో గోల్స్ చేసి విజయాన్ని అందుకుంది. శనివారం జరిగే మ్యాచ్‌లో ఇండియా.. పాకిస్తాన్‌తో తలపడుతుంది.