చెంచాలు, చాకు, బ్రష్​లు మింగిండు

చెంచాలు, చాకు, బ్రష్​లు మింగిండు

8 చెంచాలు, రెండు స్క్రూ డైవర్లు, రెండు టూత్​ బ్రష్​లు, ఒక చాకు, ఓ చిన్న ఇనుప చువ్వ.. కొనేందుకు షాపు వ్యక్తికి చెప్పిన సామాన్ల చిట్టా కాదు. ఓ వ్యక్తి మింగేసిన వస్తువులివి. హిమాచల్​ప్రదేశ్​లోని మండిలో ఉన్న సుందర్​నగర్​కు చెందిన ఓ 35 ఏళ్ల మతిస్థిమితం లేని వ్యక్తి మింగినవి. పొట్టలో నుంచి పదునైన వస్తువేదో బయటకు రావడం గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే అతడిని మండిలోని శ్రీ లాల్​బహదూర్​ శాస్త్రి ప్రభుత్వ మెడికల్​ కాలేజీ హాస్పిటల్​కు తీసుకెళ్లారు.

డాక్టర్లు సీటీ స్కాన్​, ఎక్స్​రే తీసి చూడగా కడుపులో వీటిని గుర్తించారు. వెంటనే ఆపరేషన్​ చేసి వాటిని బయటకు తీసేశారు. వాటిని బయటకు తీసేందుకు నాలుగు గంటల సమయం పట్టింది. మానసికంగా బాగాలేకపోయినా ఇంట్లో చిన్నాచితకా పనుల్లో సాయం చేస్తున్నాడని, కొన్ని రోజులుగా చికిత్స ఇప్పిస్తున్నామని కుటుంబ సభ్యులు చెప్పారు.

కొద్ది రోజుల క్రితం కడుపు నొప్పి అని చెప్పడంతో స్థానికంగా ఉన్న ప్రైవేట్​ ఆస్పత్రికి తీసుకెళ్లామని, కడుపు బాగా ఉబ్బిందంటూ డాక్టర్​ చెప్పాడని, చికిత్స చేస్తుండగానే పదునైన కొన బయటకు చొచ్చుకురావడంతో పెద్దాస్పత్రికి పంపించాడని చెప్పారు.