మహిళల వేధింపులపై ‘మెన్‌‌టూ’ గళం

మహిళల వేధింపులపై ‘మెన్‌‌టూ’ గళం
  • రాచిరంపాన పెడుతున్నరు
  • తప్పుడు కేసులతో సర్వం కోల్పోతున్నామని వేదన
  • ‘జెండర్‌‌ బయాస్డ్‌‌’ చట్టాలు సవరించాలని డిమాండ్‌‌
  •  నేషనల్‌‌ కమిషన్‌‌ ఫర్‌‌ మెన్‌‌ కావాలంటున్న ఇంకొందరు

రిషి (పేరు మార్చాం) ఓ యోగా గ్రూప్‌‌లో మెంబర్‌‌. ముంబైలోని చెంబూర్‌‌లో ఉంటాడు. ప్రతి సండే పొద్దున్నే మలాడ్‌‌లోని స్టూడియోకు వెళ్లి మ్యాట్లు సిద్ధం చేస్తుంటాడు. ఇతర ఏర్పాట్లు చేస్తుంటాడు. లీనా, కరణ్‌‌ దంపతులూ ఈ క్లాసులకు వస్తుంటారు. ఎక్కడో చెంబూర్‌‌ నుంచి మలాడ్‌‌కు రిషి వస్తుండటం చూసి ఓ ఐడియా ఇచ్చారు. ‘ప్రతి శనివారం రాత్రి మా ఇంటికి రండి. సండే యోగా క్లాస్‌‌లకు కలిసి వెళ్దాం’ అన్నారు. పని ఈజీగా అవుతుందని తనూ ఓకే అన్నాడు. ఓ శనివారం రాత్రి ఇంట్లో కరణ్‌‌ లేడు. రిషికి లీనా దగ్గరైంది. నెలల తరబడి సంబంధం నడిచింది. ఇంతలో ఇంకో అమ్మాయితో రిషి పెళ్లికి సిద్ధమయ్యాడు. లీనా అగ్గిమీద గుగ్గిలమైంది. తనను రేప్‌‌ చేశాడని కేసు పెట్టింది. రాత్రికి రాత్రి రిషిని అరెస్టు చేశారు. వారం పాటు జైల్లో ఉన్నాడు. కేసు మూడేళ్లు నడిచింది. ఎట్టకేలకు 2018 ఫిబ్రవరిలో నిర్దోషిగా విడుదలయ్యాడు. కానీ అప్పటికే జరగాల్సింది జరిగిపోయింది. జాబ్‌‌ పోయింది. ఫ్రెండ్స్‌‌ దూరమయ్యారు.

74 శాతం తప్పుడు కేసులే

ఇలాంటి కేసులు దేశంలో కోకొల్లలు. అందుకే లైంగిక వేధింపులపై ‘#మీ టూ’ వేదికగా మహిళలు గళమెత్తినట్టే మహిళల నుంచి వేధింపులను ఎదుర్కొంటున్న మగవాళ్లూ ‘#మెన్​టూ’ ఉద్యమం మొదలుపెట్టారు. అమాయక భర్తలను రాచిరంపాన పెడుతున్న గృహ హింస, లైంగిక వేధింపుల చట్టాల్లో సవరణలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తప్పుడు కేసుల వల్ల గౌరవం, డబ్బు, ఉద్యోగం, మనశ్శాంతి లేకుండా పోతోందని, జెండర్‌‌ బయాస్డ్‌‌ చట్టాలు కాకుండా జెండర్‌‌ న్యూట్రల్‌‌ చట్టాలు తీసుకురావాలని కోరుతున్నారు. మగవారి హక్కుల రక్షణ కోసం 2014లో వాస్తవ్‌‌ ఫౌండేషన్‌‌ స్థాపించిన అమిత్‌‌ దేశ్‌‌పాండే మాట్లాడుతూ.. ‘మగవాళ్లపై నమోదవుతున్న కేసుల్లో వరకట్న వేధింపులు, గృహ హింసవే ఎక్కువ. కానీ ఇప్పుడు కాన్‌‌సెక్సువల్‌‌గా మొదలై రేప్‌‌ ఆరోపణలు (రిషి లాంటి కేసులు) ఎక్కువవుతున్నాయి. వీటిల్లో నిర్దోషులుగా రుజువవుతున్నవి 74 శాతం. కానీ ఇలా కేసులు పెట్టి ఎక్కువగా దోచేసుకుంటున్నారు. మగ వారి గౌరవం దెబ్బతింటోంది’ అంటున్నారు.మగవారిపై వేధింపుల కేసులు పెడితే చాలు ప్రతి దశలోనూ పోలీసులు, న్యాయ వ్యవస్థ, మీడియా వారిని ఇబ్బంది పెడుతున్నారని దేశ్‌‌పాండే వాపోతున్నారు. ఫ్రెండ్స్‌‌, ఫ్యామిలీ, తోటివారు అనుమానంగా చూస్తున్నారంటున్నారు.

‘సెక్షన్‌‌ 354 (మహిళల గౌరవానికి భంగం కలిగించడం), సెక్షన్‌‌ 376 (రేప్‌‌)’ లాంటి జెండర్‌‌ బయాస్డ్‌‌ చట్టాల నుంచి మగవారికి రక్షణ కల్పించాలనే కోరుతున్నాం’ అంటున్నారు. ఆఫీసుల్లో చిన్న మాటనుకున్నా, ఇద్దరికి పడకపోయినా 354 కేసవుతోందని, ఇలాంటి చట్టాల వల్ల ఆఫీసు వాతావరణమే మారిపోతోందంటున్నారు.  మగవారి హక్కుల కోసం పోరాడుతున్న ఎన్జీవోలు.. ‘ఫెమినిజంకు మేం వ్యతిరేకం కాదు. మహిళలను రక్షించొద్దని చెప్పట్లేదు. నిజానిజాలు తెలుసుకోవాలంటున్నాం. ఈ చట్టాల వల్ల మగ వాళ్ల హక్కులు హరిస్తున్నాయి’ అంటున్నాయి. జెండర్‌‌ బయాస్డ్‌‌ చట్టాల వల్ల అమాయకులైన మగవారు నలిగిపోతున్నారంటూ నేషనల్‌‌ కోలిషన్‌‌ ఫర్‌‌ మెన్‌‌ (ఫోరమ్‌‌ ఆఫ్‌‌ 50 ఆర్గనైజేషన్స్‌‌) కూడా ‘మెన్‌‌ ఐఫెస్టో’ 2014లో ఉద్యమాన్ని మొదలెట్టింది. ప్యూరిష్‌‌ ఆయోగ్‌‌ను ప్రారంభించి మగవారి హక్కుల కోసం పోరాడుతున్న బర్ఖా ట్రెహాన్‌‌.. నేషనల్‌‌ కమిషన్‌‌ ఫర్‌‌ మెన్‌‌ (ఎన్‌‌సీఎం) కోసం డిమాండ్‌‌ చేస్తున్నారు. అయితే ఎన్‌‌సీఎం వల్ల సమస్యలొస్తాయని జార్ఖండ్‌‌లోని జేవియర్‌‌ ఇన్‌‌స్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ సోషల్‌‌ సైన్సెస్‌‌ అసోసియేట్‌‌ ప్రొఫెసర్‌‌ అంటున్నారు.