ఏడు నెలలుగా జీతాలు లేవు..వేతనాల​ కోసం మెప్మా ఆర్పీల ఎదురుచూపులు

ఏడు నెలలుగా జీతాలు లేవు..వేతనాల​ కోసం మెప్మా ఆర్పీల ఎదురుచూపులు

ఆర్మూర్, వెలుగు :  ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, మున్సిపాలిటీల్లో వాటి అమలులో కీలకంగా వ్యవహరించే రిసోర్స్​పర్సన్స్​(మెప్మా ఆర్పీలు) ఏడు నెలలుగా జీతాల కోసం ఎదురు చూస్తున్నారు. నిజామాబాద్​ జిల్లాలో 500 మందికి పైగా ఆర్పీలు విధులు నిర్వహిస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2023, మేలో చివరగా వీరికి వేతనాలు ఇచ్చారు.

అక్టోబర్ లో ఆర్పీలకు సాలరీస్​ పెంచుతున్నట్లు గవర్నమెంట్​ప్రకటించింది. 2023 జూన్ ​నుంచి పెంపు వర్తిస్తోందని చెప్పింది. పెరిగిన జీతాలు వస్తాయని ఆర్పీలు ఆశించారు. కానీ 7 నెలలుగా జీతాలు రాకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. పెంచిన జీతాల మాటేమోగానీ జూన్  నుంచి జీతాలు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆర్పీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మహిళా సంఘాల ఏర్పాటులో కీలకపాత్ర

మున్సిపల్ పరిధిలోని మహిళల స్వయం ఉపాధి, ఆర్థికాభివృద్ధిలో ఆర్పీలు కీలకపాత్ర పోషిస్తున్నారు. పది నుంచి 15 మంది సభ్యులతో ఒక మహిళా సంఘం, 15 నుంచి 20 సంఘాలతో ఒక సమాఖ్యను ఏర్పాటు చేయిస్తారు. వారితో పొదుపులు చేయించి స్వయం ఉపాధికి బ్యాంకుల ద్వారా లోన్​లు ఇప్పిస్తారు. వీటితో పాటు ఫ్రై డే డ్రై డే, ఎన్నికల్లో బీఎల్వో విధులు సైతం నిర్వహిస్తున్నారు. దీనికి గాను ప్రభుత్వం రూ.4 వేలు గౌరవ వేతనం అందిస్తోంది. ఏడు నెలల కింద బీఆర్ఎస్​సర్కార్ మరో  రూ.2వేలు పెంచి ఇస్తామని ప్రకటించింది.

ప్రజాపాలన గ్రామసభల్లోనూ..

కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీల అమలు కోసం ప్రజల నుంచి అప్లికేషన్స్ స్వీకరించేందుకు ప్రజాపాలన, గ్రామసభలు నిర్వహించింది. ఎనిమిది రోజుల పాటు జరిగిన ఈ ప్రోగ్రామ్​లో మున్సిపల్ పరిధిల్లో ఆర్పీలు కీలకంగా వ్యవహరించారు. ఉదయం 8 నుంచి సాయంత్రం 6 వరకు ఎలాంటి రెమ్యూనరేషన్ లేకుండా విధులు నిర్వర్తించారు. ఇంటింటికెళ్లి ఆరుగ్యారంటీల అప్లికేషన్లు ఇవ్వడం, ఎలాంటి తప్పులు లేకుండా వాటిని ఫిల్​చేసి ఇచ్చారు. దీంతో గ్రామసభలు విజయవంతమయ్యాయి. కాంగ్రెస్​ ప్రభుత్వమైనా పెండింగ్ లో ఉన్న వేతనాలను త్వరగా విడుదల చేయాలని ఆర్పీలు కోరుతున్నారు. 

మున్సిపాలిటీల వారీగా ఆర్పీలు

నిజామాబాద్    400
ఆర్మూర్    40
బోధన్    68
భీమ్​గల్    08