అదరగొట్టిన మెర్సిడెస్​ బెంజ్​

అదరగొట్టిన మెర్సిడెస్​ బెంజ్​

న్యూఢిల్లీ:  జర్మన్ లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెస్ -బెంజ్ 2023–-24లో భారతదేశంలో ఒక ఆర్థిక సంవత్సరంలో అత్యధిక రిటైల్ అమ్మకాలను నమోదు చేసింది. తమ ఎస్​యూవీలు విపరీతంగా అమ్ముడయ్యాయని తెలిపింది.   కంపెనీ గత ఆర్థిక సంవత్సరంలో 18,123 యూనిట్లను విక్రయించింది. 2022-–23 ఆర్థిక సంవత్సరంలో 16,497 యూనిట్ల కంటే 10 శాతం వృద్ధిని సాధించింది. 

"మేం భారతదేశంలో అత్యుత్తమ నెల, అత్యధిక క్వార్టర్,​  అత్యుత్తమ ఆర్థిక సంవత్సరాన్ని సాధించాం. కస్టమర్లు మా ప్రొడక్టులను ఎంతో ఇష్టపడుతున్నారనడానికి ఈ అమ్మకాలు నిదర్శనం" అని కంపెనీ ఇండియా ఎండీ, సీఈఓ సంతోష్ అయ్యర్ తెలిపారు. ఈ ఏడాది జనవరి–-మార్చి కాలంలో ఈ సంస్థ 5,412 యూనిట్లను విక్రయించింది, గత ఏడాది మొదటి క్వార్టర్​లో 4,697 యూనిట్ల కంటే 15 శాతం వృద్ధిని సాధించింది. 

దేశంలో ఈ ఏడాది తొమ్మిది కొత్త మోడళ్లను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నామని, ఇందులో మూడు కొత్త బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనాలు (బీఈవీలు) ఉన్నాయని బెంజ్​వెల్లడించింది. ఈ క్యాలెండర్ ఇయర్ రెండవ క్వార్టర్​లో ఏఎంజీ ఎస్​ 63 ఈ–-పెర్ఫార్మెన్స్ సెడాన్​ను లాంచ్​ చేస్తామని తెలిపింది. ఈ ఆటోమేకర్ ఏప్రిల్ 2024లో  ఢిల్లీ,  ముంబైలోని కీలక కస్టమర్ హబ్‌‌‌‌లలో రెండు లగ్జరీ ఎంఏఆర్​ 20ఎక్స్​ ఔట్‌‌‌‌లెట్లను ప్రారంభించాలని యోచిస్తోంది.