సంక్షేమ హాస్టళ్లు..కంపు..కంపు

సంక్షేమ హాస్టళ్లు..కంపు..కంపు
  • మురికి కూపాలను తలపిస్తున్న హాస్టళ్లు
  • కంపు కొడుతున్న టాయిలెట్స్, బాత్రూమ్స్
  • కుళ్లిన ఫుడ్, చెత్తతో నిండిపోతున్న మెస్​ఏరియాలు

హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్ జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు బందెల దొడ్లను తలపిస్తున్నాయి. పట్టించుకునే నాథుడు లేక మురుగు, చెత్త చెదారంతో నిండి కంపు కొడుతున్నాయి. హాస్టళ్లను కనీసం వారానికి ఒకసారి కూడా క్లీన్​ చేయడం లేదు. మెస్​లో మిగిలిపోయిన ఫుడ్ ​ఐటమ్స్​ను రోజుల తరబడి అలానే ఉంచుతున్నారు. పాడైన కూరగాయలు, మిగిలిపోయిన అన్నం, కూరలు కుళ్లిపోయి కంపుకొడుతున్నా తొలగించడం లేదు. టాయిలెట్లు, బాత్రూమ్​లు అయితే ఘోరంగా ఉన్నాయి. ముక్కు మూసుకుని కూడా వెళ్లలేని పరిస్థితి నెలకొంది.

ఎస్సీ, ఎస్టీ, బీసీ ఇలా ఏ సంక్షమే హాస్టల్​లో చూసినా దుర్భర పరిస్థితులు ఉన్నాయి. అబిడ్స్ జీపీఓ సమీపంలోని ఎస్సీ హాస్టల్ డింపింగ్​యార్డును తలపిస్తోంది. టాయిలెట్లు, వాష్​ ఏరియాలు అపరిశుభ్రంతో నిండిపోయాయి. అంబర్​పేట శ్రీరమణ సర్కిల్​సమీపంలోని బీసీ హాస్టల్​ను రెండు వారాలకోసారి కూడా క్లీన్ చేయడం లేదని స్టూడెంట్లు వాపోతున్నారు. మిగిలిపోయిన ​ఫుడ్​ ఐటమ్స్​ను డస్ట్​బిన్లలో నింపి ఉంచుతున్నారని చెబుతున్నారు. ఈగలు, దోమలు పెరిగిపోయి, అనారోగ్యానికి గురవుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అంబర్ పేట బీసీ హాస్టళ్లు, మలక్​పేట ఎస్సీ బాయ్స్​హాస్టల్ ఇలా ఎక్కడ చూసినా కిచెన్, టాయిలెట్లు, బాత్రూమ్​లు అపరిశుభ్రంగా దర్శనమిస్తున్నాయి. నిర్వహణ లేక, ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడంతోనే ఈ పరిస్థితి దాపురించిందని స్టూడెంట్లు మండిపడుతున్నారు. చాలా చోట్ల మెనూ ప్రకారం ఫుడ్​ పెట్టట్లేదని, తరచూ ఫుడ్​పాయిజనింగ్​కు గురవుతున్నామని ఆరోపిస్తున్నారు.

కలెక్టర్ అనుదీప్​ ఆదేశించినా..

జిల్లా కలెక్టర్ అనుదీప్​ దురిశెట్టి ఇటీవల అన్ని శాఖల​అధికారులతో రివ్యూ నిర్వహించారు. సీజనల్ ఫీవర్లు, డెంగ్యూ, మలేరియా తదితర వ్యాధులు పెరగకుండా చర్యలు తీసుకోవాలని, సంక్షేమ హాస్టళ్లపై స్పెషల్​ఫోకస్​పెట్టాలని ఆదేశించారు. అయినప్పటికీ అధికారుల్లో చలనం లేదు. క్షేత్రస్థాయి పరిస్థితులు ఎలా ఉన్నాయే కనీసం పరిశీలించలేదు. దోమలు పెరగకుండా యాంటీ లార్వా స్ప్రే చేయలేదు. 

అధికారులు పట్టించుకోవడం లేదు

సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. ఇప్పటికే కొందరు స్టూడెంట్లు జ్వరాల బారిన పడ్డారు. అయినప్పటికీ అధికారుల్లో చలనం లేదు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లేకపోవడంతోనే సంక్షేమ హాస్టళ్లలో ఈ పరిస్థితి నెలకొంది. ఇకనైనా స్పందించి హాస్టళ్లను పరిశుభ్రంగా ఉంచాలి. చెత్త, చెదారం తొలగించాలి. దోమల నివారణకు చర్యలు తీసుకోవాలి. అద్దె భవనాల్లో కొనసాగుతున్న హాస్టళ్లను సొంత భవనాల్లోకి మార్చాలి.

ఎం.నవీన్ కుమార్, ఎస్ఎస్ యూ, స్టేట్ ప్రెసిడెంట్