గల్ఫ్​లో మెట్​పల్లి యువకుడి మృతి

గల్ఫ్​లో మెట్​పల్లి యువకుడి మృతి

మెట్ పల్లి, వెలుగు: గల్ఫ్​లో జరిగిన ప్రమాదంలో మెట్​పల్లికి చెందిన యువకుడు మృతిచెందాడు. కుటుంబసభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. జగిత్యాల జిల్లా మెట్ పల్లి పట్టణం ఈద్గాహ్ కాలనీకి చెందిన యూసుఫ్(32) మొదటిసారి ఆరేండ్ల క్రితం సౌదీ వెళ్లాడు. అక్కడ ఓ కంపెనీలో మెషిన్​ఆపరేటర్ గా చేరాడు. రెండేళ్ల తర్వాత ఇండియాకు వచ్చి పెళ్లి చేసుకున్నాడు. తిరిగి మళ్లీ సౌదీ వెళ్లాడు. గత ఏడాది కరోనా టైంలో ఇండియాకు వచ్చి ఫ్లైట్స్ లేకపోవడంతో ఇక్కడే ఉండిపోయాడు. తిరిగి నాలుగు నెలల క్రితం అదే కంపెనీలో చేరాడు. బుధవారం డ్యూటీ చేస్తుండగా ప్రమాదవశాత్తు మెషిన్​బ్లేడ్​తగిలి తీవ్ర గాయాలయ్యాయి. అక్కడే ఉన్న ఫ్రెండ్స్​వెంటనే హాస్పిటల్ కు తరలించారు. ప్రమాదం విషయాన్ని కుటుంబసభ్యులకు తెలియజేశారు. ట్రీట్​మెంట్​పొందుతున్న యూసుఫ్ గురువారం ఉదయం కుటుంబసభ్యులతో మాట్లాడాడు. తాను బాగానే ఉన్నానని, ఆందోళన పడొద్దని తల్లి, భార్యకు ధైర్యం చెప్పాడు. అనంతరం కొన్ని గంటల్లోనే యూసుఫ్ చనిపోయినట్లు సమాచారం రావడంతో కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతుడికి తల్లి, భార్య, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. సర్కారు స్పందించి యూసుఫ్ మృతదేహాన్ని త్వరగా ఇండియాకు తెప్పించాలని కుటుంబసభ్యులు కోరుతున్నారు.