తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

తెలంగాణలో ఐదు రోజులు భారీ వర్షాలు.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేస్తూ ఆదివారం వెదర్ బులెటిన్​ను విడుదల చేసింది. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, జనగామ, సిద్దిపేట, హైదరాబాద్, మేడ్చల్​ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, నాగర్ కర్నూల్, నారాయణపేట, ఖమ్మం, సూర్యాపేట, నిజామాబాద్, నిర్మల్, మహబూబ్​నగర్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, మెదక్ జిల్లాలకు ఎల్లో అలర్ట్​ను జారీ చేసింది. హైదరాబాద్​లో వాతావరణం సడన్​గా మారే పరిస్థితులుంటాయని పేర్కొంది. అన్ని జిల్లాల్లోనూ ఈదురు గాలులు బలంగా వీస్తాయని, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే ముప్పు ఉంటుందని వెల్లడించింది.

హైదరాబాద్​ సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు

హైదరాబాద్ సిటీ సహా పలు జిల్లాల్లో ఆదివారం మోస్తరు వర్షాలు కురిశాయి. కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, రంగారెడ్డి, ములుగు, నిర్మల్, జగిత్యాల, వరంగల్, హనుమకొండ, మెదక్, సంగారెడ్డి, వికారబాద్, ఆదిలాబాద్, సిద్దిపేట జిల్లాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా హైదరాబాద్ సిటీలోని  రాజేంద్రనగర్​లో 5.5 సెంటీమీటర్ల వర్షం,  రంగారెడ్డి జిల్లా దిగ్వాల్​లో 5.4, తొర్రూరులో 5.3, కుమ్రంభీమ్ జిల్లా ఎల్కపల్లిలో 4.1, నిర్మల్ జిల్లా భైంసాలో 3.8, హైదరాబాద్ లోని కిషన్​బాగ్​లో 3.7, దండుమైలారంలో 3.6, మెదక్​ జిల్లా రేగోడులోలో 3.6 సెంటమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.